మాకు అప్పగిస్తే మేమే నిర్వహించుకుంటాం
ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి.. అప్పటిదాకా ట్రస్టు బోర్డుల్లో ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి
వీహెచ్‌పీ హైందవ శంఖారావ సభ డిక్లరేషన్
డిక్లరేషన్ అమలుకు సభికులతో ప్రతిజ్ఞ చేయించిన త్రిదండి చిన్నజియ్యర్ స్వామి.. సభకు పెద్ద సంఖ్యలో హాజరైన పీఠాధిపతులు, స్వామీజీలు, భక్తజనం
సాక్షి, అమరావతి: ‘గుళ్లను హిందువులమైన మేమే నిర్మించుకున్నాం.. స్వామీజీల మార్గదర్శకంలో వాటిని హిందువులమే యోగ్యమైన పద్దతిలో నిర్వహించుకుంటాం. రాష్ట్రంలో, దేశమంతటా హిందూ ఆలయాల నిర్వహణలో పెత్తనం చేయడం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. ఆయా ప్రభుత్వాల నుంచి విముక్తి కలిగించాలి. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు విశ్రమించేది లేదు. అందరం కలిసి ఐక్యంగా అడుగులు ముందుకు వేద్దాం’ అని వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, వీహెచ్‌పీ నేతలు పిలుపునిచ్చారు.
ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి వద్ద వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభ మధ్యాహ్నం 12.40 గంటలకు మొదలై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ‘వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సాధు సన్యాసులు, నాయవేత్తలు, హిందు ప్రముఖులు కలిసి ఆలయాల స్వయం ప్రతిపత్తికి సంబంధించి రూపొందించిన ముసాయిదా చట్టం ప్రతులను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అప్పగించాం. బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చట్టం ప్రతిని అందించాం.
ఆయా ప్రభుత్వాలు, పార్టీలు అత్యంత శీఘ్రంగా ఆ ముసాయిదా చట్టాన్ని పరిశీలించి, నూతన చట్టం రూపొందించడం ద్వారా ఆలయాలను హిందు సమాజానికి అప్పగించే చర్యలు చేపట్టాలి. వెంటనే చట్ట సవరణ చేయాలి. ఆ లోపు, ఆలయ ట్రస్టు బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి. ఆలయాల్లో, ఆలయాలు నిర్వహించే సంస్థల్లో పని చేసే అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి.
ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడడంతో పాటు అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి ఆలయాలకు అప్పగించే బాధ్యతను ప్రభుత్వాలు వెంటనే తీసుకోవాలి’ అని హైందవ శంఖారావం డిక్లరేషన్ ప్రకటించారు. గుడి నిధులను హిందు ధార్మిక ప్రచారానికి, హిందు ధర్మ, ధార్మిక సేవలకు మాత్రమే ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదని శంఖారావం సభ విజ్ఞప్తి చేసింది. త్రిదండి చిన్న జియ్యర్‌స్వామి డిక్లరేషన్ సాధన కోసం సభకు హాజరైన అశేష భక్త జనంతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు.
అయోధ్య తరహాలో అన్ని ఆలయాలు
అయోధ్యలో రామజన్మభూమి ఆలయాన్ని హిందువులే స్వతంత్రంగా నిర్వహించుకుంటున్న తరహాలోనే దేశంలో మిగిలిన అన్ని ఆలయాలు కూడా అదే బాటలో నడిచేలా అడుగులు ముందుకు వేద్దామని ఆయోధ్య రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గిరిగోవింద దేవ్ గిరి స్వామీజీ పిలుపునిచ్చారు. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం కేవలం హిందు మందిరాలను మాత్రమే తమ చేతుల్లోకి తీసుకుందని.. మసీదులు, గురుద్వారాలు, జైన్ మందిరాల జోలికి వెళ్లలేదని వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు.
ఆలయ నిర్వహణను ప్రభుత్వాలు చట్టం చేసి, తమ చేతుల్లోకి తీసుకున్నాయన్నారు. ఈ పని చేయాల్సింది ధర్మాచార్యులు, భక్త సమాజం అని వివరించారు. మొత్తం హిందూ సమాజం కలిసి ఆలయాలను నిర్వహించుకోవాలన్నది వీహెచ్‌పీ అభిమతమని వెల్లడించారు. అందులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. ఈ దిశగా రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నట్టు వీహెచ్‌పీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి మిలింద్ పారండే చెప్పారు.
ఈ ఉద్యమానికి హైందవ శంఖారావం పేరిట ఏపీలో నాంది పలికామని వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. రాష్ట్రంలో గుళ్ల పేరిట ఇదివరకు 15 లక్షల ఎకరాల భూములుంటే, ఇప్పుడవి నాలుగున్నర లక్షల ఎకరాలకు కుచించుకుపోయాయని చిన్నజియ్యర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవదాయ శాఖను రద్దు చేయాలన్నదే హైందవ శంఖరావం సభ డిమాండ్ అని కమలానంద స్వామి అన్నారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు పెట్టాలని, ఆలయాలను హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు ఏ సంబంధం లేని వాళ్లు కౌంటర్లు పెట్టి టికెట్లు అమ్ముకుంటుంటే ఒళ్లు మండుతోందన్నారు. మన ధర్మాన్ని మనం పాలించుకుందామని గణపతిసచ్చిదానందస్వామి అన్నారు. వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్శ, ఉత్తరాంధ్ర వీహెచ్‌పీ కన్వీనర్ తనికెళ్ల సత్యరవికుమార్, వీహెచ్‌పీ భాగ్యనగర్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment