ఆ విషయాల్లో నిర్ణయాలకు సీనియర్ అర్చకుల అభిప్రాయాలే కీలకం
అవసరమైతే ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు
దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవోలకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవదాయ శాఖ కమిషనర్ సహా ఆలయ ఈవో, తదితర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైదిక ఆగమ విషయాల్లో ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని నిర్ధారించడానికి 1987 నాటి దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్–13(1)కి అనుగుణంగా అధికారులు ఆలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ బుధవారం జీఓ–223ను జారీచేశారు.
వివిధ ఆలయాల్లో స్వామివార్లకు నిర్వహించే సేవలకు సంబంధించిన విధానాలు.. యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర ఉత్సవాల నిర్వహణ వంటి విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడి సీనియర్ అర్చకులు, ఇతర మతపరమైన సిబ్బంది అభిప్రాయాలే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఈఓ వైదిక కమిటీలను ఏర్పాటుచేసుకోవచ్చని ఆయన ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఏదైనా సందేహం, అభిప్రాయభేదం ఏర్పడితే ప్రఖ్యాత పీఠాధిపతులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఇలాంటి అంశాల్లో ఏ ఆలయానికి ఆ ఆలయం లేదా ఇతర దేవదాయ ధార్మిక సంస్థలు ఒక స్వతంత్ర సంస్థగా పరిగణించబడతాయన్నారు. అలాగే, ఒకే రకమైన ఆగమాలకు సంబంధించిన ఆలయాలు, ధార్మిక సంస్థలైనప్పటికీ సంబంధిత ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు భిన్నంగా వేరొక ఆలయ సంప్రదాయాలు పాటించాలనిలేదని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment