అభిప్రాయం
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’
– జాషువా
ఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.
వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.
‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.
అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?
అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.
సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు.
జగన్‌మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.
ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్‌మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్‌లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.
‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’
(ఈశావాస్యోపనిషత్తు)
ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ
–యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘
ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు?
ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.
‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.
నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త వైసీపీ నాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment