Joshua
-
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్‌కు స్వర్ణం
పారిస్: అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషువా చెప్తెగాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్’ గేమ్స్‌లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్లో చెప్తెగాయ్ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్ పేరిటే ఉంది. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
పెనమలూరు : కానూరు వద్ద జరిగిన చెన్నూరి అజయ్‌సాయి(22) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిగడప వసంతనగర్‌కు చెందిన చెన్నూరి అజయ్‌సాయి అదే గ్రామానికి చెందిన బొమ్మిడి మణికంఠ, పామర్తి మణికంఠ, పుట్టి శ్రీధర్, దొంపల ప్రశాంత్, పటమటకు చెందిన కగ్గా సాయినాగార్జునలు కలిసి ఈ నెల 7వ తేదీన పటమట రాజులబజార్లో ఉన్న స్నేహితుడు సంతోష్ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో బొమ్మిడి మణికంఠ ఇయర్ బడ్స్ కనిపించలేదు. అజయ్‌సాయిపై అనుమానంతో కొట్టారు. ఎనికేపాడు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బడ్స్ దాచానని అజయ్‌సాయి చెప్పడంతో అదే రోజు రాత్రి అతనిని బైక్ పై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బడ్స్ దొరక్క పోవడంతో అజయ్‌సాయిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌సాయిని సాయినాగార్జున, పామర్తి మణికంఠ పటమట డొంక రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అజయ్‌సాయి కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద ప్రమాదంలో గాయపడినట్లు వైద్యులను నమ్మించారు. అయితే అజయ్‌సాయి 8న ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతి వివరాలు కంకిపాడు పోలీసులకు అందడంతో.. వారు విచారణ నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను సీఐ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నిందితులపై రౌడీషీట్ కూడా తెరుస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, ఇందులో వీరు గంజాయి వాడారన్న వచ్చిన వార్తలో నిజం లేదని ఎస్పీ తెలిపారు. రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల విచారణ జరక్క ముందే రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. జీవన్‌కుమార్‌ది ఆత్మహత్యే పెదపులిపాక గ్రామంలో కాలినగాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జమ్మలమూడి జీవన్‌కుమార్(21)ది ఆత్మహత్యేనని ఎస్పీ జాషువా తెలిపారు. తన తండ్రి సుధాకర్ తీసుకున్న లోన్‌కు సంబంధించి ఈఎంఐ నగదులో రూ.12,500ను జీవన్‌కుమార్ ఖర్చు చేయడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపంతో ఉన్న జీవన్‌కుమార్ ఈ నెల 9న గురునానక్‌కాలనీలోని రెస్టారెంట్లో మిత్రుడు శ్యామ్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు. అనంతరం అదే రోజు రాత్రి యనమలకుదురు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొన్నాడు. ఈ విషయం సీసీ కెమెరాలో నమోదైంది. తొలుత జీవన్‌కుమార్‌ది హత్యగా భావించామని, డీఎస్పీ జయసూర్య విచారణలో జీవన్ కదలికల్లో ప్రతి నిమిషాన్ని విచారించి సాంకేతిక సాక్ష్యాలు సేకరించినట్టు ఎస్పీ జాషువా చెప్పారు. -
లోన్ యాప్ నిందితులు అరెస్టు
కోనేరు సెంటర్: లోన్ యాప్‌లతో అమాయక ప్రజలను వేధిస్తున్న మరో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ జాషువా గురువారం మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. పెనమలూరు, ఆత్కూరు, కంకిపాడు, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నారు. వాటిని సక్రమంగా చెల్లించినప్పటికీ.. యాప్ నిర్వాహకులు మరింత డబ్బు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవ్వకపోతే మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో కొందరు డబ్బులు చెల్లించగా.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ జాషువా.. సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపి ఈనెల 17న మహారాష్ట్రలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్‌సింగ్, అతని సోదరుడు రోహిత్‌కుమార్, జయశంకర్ ఉపాధ్యాయలతో పాటు ఢిల్లీకి చెందిన అభిషేక్‌కుమార్‌సిన్హాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన హక్తర్ హుస్సేన్ అనే సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు. వీరిలో కొందరు వాట్సాప్ కాల్స్, నకిలీ నంబర్లు, సోషల్ మీడియా ద్వారా రుణాలు తీసుకున్నవారిని బెదిరిస్తుండగా, మరికొందరు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతుంటారు. వీరందరికీ పాక్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఉంటారు. వీరందరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలియదు. వీరు వందలాది సిమ్‌లతో.. నకిలీ బ్యాంకు ఖాతాలతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. నేరస్తులందరినీ అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు వెంకటరామాంజనేయులు, భరత్ మాతాజీ, తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌తో కయ్యం చైనా పన్నాగమే
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు పెంచడం, పొరుగుదేశాలు భారత్‌పై ధిక్కారస్వరం వినిపించడం వెనక చైనా సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని కెలాగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జోషువా ఐసన్‌మన్ అన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం’అనే అంశంపై అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. ఆసియాలో భారత్, చైనా రెండు బలమైన దేశాలని, ఈ రెండింటి మధ్య ఉద్రిక్తతలు పెరగడం చైనా పన్నాగమేనని ఆయన విశ్లేషించారు. డ్రాగన్ విస్తరణ విధానం రోజురోజుకూ పెరుగుతోందని, తాజాగా భూటాన్ కూడా తమ భూభాగమే అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకురావడం దీనికి నిదర్శనని చెప్పారు. భారత్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలోకి డ్రాగన్ విపరీతంగా డబ్బు ప్రవహింపజేస్తోందని, వాటికి ఆర్థిక సాయం పేరుతో ఎర వేస్తోందని చెప్పారు. ఆయా దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టడం వెనక చైనా భవిష్యత్ మిలటరీ అవసరాలు దాగున్నాయని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లో పాకిస్థాన్ మినహా మరే దే శంతోనూ భారత్‌కు ఎలాంటి రాజకీయ విభేదాలూ లేవనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, నేపాల్ అకస్మాత్తుగా భారత్‌పై వ్యతిరేకత ప్ర దర్శిస్తుండటం గమనించదగ్గ అంశమన్నారు. భారత్ పొరుగు దేశాలతో మి లటరీ సంబంధాల బలోపేతానికి చైనా అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగైతేనే చైనా దూకుడుకు ముకుతాడు.. మరోవైపు వాయవ్య ఆసియాలోనూ చైనా జోక్యం పెరుగుతోందని జోషువా అన్నారు. ఈ ప్రాంతాల్లోని దీవులపై చైనా సైన్యం ఆధిపత్యం చాటుకునేం దుకు తాపత్రయపడుతోందని వివరించారు. మొత్తానికి ఆసియా దేశాలన్నీ తనను సూపర్‌పవర్‌గా గుర్తించాలన్న తహతహ చైనాలో కనిపిస్తోందన్నారు. అలాగే కోవిడ్ తదనంతరం తలెత్తిన ఆర్థిక సమస్యల నేపథ్యంలో చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బీఆర్ఐ (బెల్ట్ అండ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్) ప్రాజెక్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. చై నా దూకుడుకు ముకుతాడు వేసేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ చేతులు కలపాల్సిన అవసరముందన్నారు. -
కోటమామ కూతురు
బుజమ్మీద పెట్టుకున్న కర్రమీద రెండు చేతులు ఏలాడదీసి ముందు పోతున్న గొర్రెల మందలో ఒక గొర్రెలా కల్సిపోయి పొలానికి పోతున్న చినసుబ్బయ్యమామ, బైలిక్కి పోయత్తన్న నన్ను వాక్కాడ ఆపి ‘‘ఆ నాగమనోల్ల ఇంటికాడెందబ్బాయ్ అంతమందున్నారో’’ అని అడిగేడు. ‘‘ఆటే వత్తంటివే వాళ్ళనే అడగ్గూడదా నన్నడక్కపోతే’’ అని కసురుకున్నట్టు అనేతలికి ‘‘అడుగుదామనుకుని ఆగేనబ్బాయ్ కాని అక్కడి జనాలని చూసి గొర్రెలు బెదిరిపోయి లగుదోల్నియ్, వాటెనకాలే నేను కూడా లగుదోలాల్సి వచ్చిందే, దీనెమ్మ నాయాల్ది ఈ గొర్రెలు నాకు కూడుబెట్టె సంగతి దేవుడెరుగ్గానే ఈటికి మేతమేపటానికి వూరెందో వల్లకాడేందో కూడా తెలుసుకొనే సమయం లేకపోయేనే నా దగ్గర చత్... ’’ అంటా ముందుకి కదిలేడు. నా కళ్ళు గబుక్కున సమాదుల పక్కకి తిరిగినియ్ ఎవరికోసమైన గుంట తీస్తన్నారేమోనని. ఎత్తు పల్లాల మట్టితప్ప మనుసులజాడ కనపళ్ళా అక్కడ. ‘‘హమ్మయ్య’’ అనుకోని హడావిడిగా నాగమనోల్ల ఇంటికి బయల్దేరాను. నాగమనోల్ల ఇంటికెళ్ళే రోడ్డుమూల తిరిగేసరికి ఆరేళ్ళ జాషువాతాత మనవడు మొండిమోల్నసైడుకాలవ మీద కూర్చొని గుంటగిన్నెలో ఎండుమిరగబాయలతో నూరిన గోగూరపచ్చడి మెండుగా కలుపుకొని తింటా కనిపించాడు. వాడిపక్కనే ఒకకుక్క కోడలు తెచ్చే కూటికోసం ఎదురుచూస్తున్న ముసలిఅత్తలా దిగాలుగా కూర్చొని వుంది. ఆ గోంగూర పచ్చడి మంటకి వాడి ముక్కోలోంచి కళ్ళలోంచి కారతన్న నీళ్ళపైన ఈగలు ఒకటేమాయన అరుసుకుంటూ ఎగురుతున్నాయ్. ‘‘నాయాలకాన లెగు ఇక్కడ్నుంచ... ఇంట్లో కూచ్చొని కూడు తినలేవా’’ అని బెదిరించినట్టు అరిసి ‘‘ఓ కాంతత్తో నీ మనవడు ఆ మురికిగుంట పక్కన కూర్చొని కూడు తింటన్నాడు, లోపలికి పిలువు’’ అని అరిసా . ‘‘ఆనాబట్ట నామాట ఏడింటాడబ్బాయ్....’’ అని ‘‘ఒరేయ్ ఒరేయ్ దోవ తప్పినోడో మర్యాదగా ఇంట్లోకి వత్తావా లేకపోతే మెల్లెత్తుకొని రావాల్న’’ అని అర్సింది పిల్లోడి మీద ఇంట్లోనుంచే. వాడు లేవల.‘‘కనీసం గుడ్డలన్న ఎయ్యకూడదా వాడికా ... వాళ్ళమ్మ నాన్నయాడికి బొయేరో.....’’‘‘వాళ్ళకేడ కుదిరిద్దయ్య పిల్లోడికి గుడ్డలెయ్యనో... వాడేమో పొద్దున్నేమొద్దులు కొట్టను పోవాలయ్య ఆ పిల్లేమో గ్రేడింకి పోవాలయ్యే, వాళ్ళు ఎల్లబోయే టయానికి వీడు నిద్దర లేవడయ్యే వాళ్ళకేడ కుదిరిద్ది పిల్లోడి గురించి పట్టించుకోను, వీన్నేమో నా జివానేసి పోయేరు. నేనేమో కూసుంటే లేవలేనయ్యే నుంచుంటే కూసోలేనయ్యే.... ఈనా సితనాపిబట్టేమో సెప్పిన మాట గంగావినడయ్యే.... రేయ్ అక్కడనుంచి లేత్తావా లేవ్వా’’ అంటా సిన్నగా లేసి ఒక సీపురు పుల్ల తీసుకొని వాణ్ని కొట్టడానికి వస్తుంది.‘‘ ఎంత పన్లున్నాగాని పిల్లల్ని జాగ్రత్తగా సూసుకోవద్దంటే.... వాడికి ఆ సైడు కాలవలో దోమలుకుట్టి రేపు డెంగో బుంగో వస్తే అప్పుడు బాధ పడేదెవురొ’’ అంటా నాగమనోల్ల ఇంటి వైపుకి గబా గబా నడిచాను. నాగమణి వాళ్ళ ఇంటికాడికి జనం సేరుకొని, వచ్చినోల్లు వచ్చినట్టు పెద్ద పెద్దగా మాట్లాడకుండా గుస గుస లాడుకుంటూ వున్నారు. ఎవరో తెలియదుగాని ఇద్దరుముగ్గురు ఆడోల్లు దూరంగా నాగమణి రెండునెలల కొడుకు నిద్రపోతున్న మంచంకాడ మూతులకి కొంగు అడ్డం పెట్టుకొని ముక్కులు పైకి ఎగబీల్చుకుంటున్నారు. నాగమణి మొగుడు మాణిక్యరావు కుడితి తొట్టిమీద తల ఏలాడేసుకొని కూసోనివున్నాడు అప్పుడే వూరినుంచి వచ్చినట్టు వున్నాడు కర్రల సంచి ఆయన కాలు పక్కనే వుంది. ఇంకో పక్క నాగమణి నుంచొని ఏడుస్తా వుంది. ‘‘బంగారం లాంటి పిల్లోన్ని నిలువున నాశనం చేసేవు కదంటే సెడిపోయిన్దానా’’ ఆదమరచి నిలుచున్న నాగమణిని ఎగిసి కాలితో తన్నాడు మాణిక్యరావు. అల్లంత దూరంలో పడింది నాగమణి.‘‘నీకు ముసలమేమన్నా పుట్టిందంట్రా సెడు నాబట్ట పచ్చి బాలింతని కాలితో తంతున్నావ్’’ లగుదోలింది కిందబడ్డ నాగమణిని పైకి లేపడానికి నాగమణి అమ్మమ్మ పంచలోనుంచి.కుట్లేసిన కాడ కలుక్కుమన్నట్టుంది నాగమణికి. గబుక్కున తడిమిచూసుకుంది కుట్లు పిగిలి నెత్తురేమన్నా వస్తుందేమోనని. నెప్పేగాని నెత్తురు రాల. తనకలాడుతుంది పైకి లేవడానికి.పద్మ గోడకి కూలబడి వల వల ఏడుస్తుంది. కూతురికి పట్టిన గతిని తలుచుకొని. కోటమామ కూతురుదగ్గరికి పోలేక వెనకడుగు వెయ్యలేక కొయ్యబారిపోయి బిత్తర సూపులు చూస్తున్నాడు జనాలవైపు.‘‘దీనెమ్మ దీన్ని సంపినా పాపంలేదు’’ అంటా పొయ్యికాడ వున్న వూదులుగొట్టం తీసుకొని కిందపడున్న నాగమణి వీపు మీద బాదాడు మాణిక్యరావు. నాగమణి ఆ దెబ్బకి కూసోలేక నున్చోలేక గిల గిల తన్నుకుంటా నేలమీద పడి దొర్లుతుంది.‘‘ఒసే కోపమొస్తే మనిషి కాదమ్మా ఈ ముండమోపోడు... పిల్లని సంపెసేటట్టున్నాడో.... అయ్యో అయ్యో ఆ నా బట్టని లాక్కెల్లండయ్యా మీకు పుణ్యమున్దిద్దె’’ అని ఏడుస్తా మాణిక్యరావుని ఎనక్కి నెడతంది. ‘‘నీ యమ్మ నువ్వు లేయే దాని అంతు తేలుస్తా ఈ రోజు’’ అంటా ఆ ముసలిదాని పక్కకి తోసి నాగమణి మీదకి దూకాడు.‘‘అన్నో ఆ పిల్లమీద ఇంకొక్క దెబ్బ పడిందంటే నీ దొమ్మలు పగుల్తియ్ సెబ్తన్న’’ గట్టిగా అరిసేను ఆయనికి అడ్డంపోయి.వూదులుగొట్టం కిందేసి పిల్లోడు పడుకొని వున్న మంచం కాడికి ఎడుస్తా పోయేడు మాణిక్యరావు.పద్మ గబుక్కున నాగమణి కాడికివచ్చి నాగమణి తల దీసి వొళ్ళో బెట్టుకొని ‘‘అమ్మో నాగమనో లేయే .. తల్లో లేయే ... నా బిడ్డో లేయే ..’’ అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు బెట్టుకుంటా ఏడుస్తా వుంది.‘‘ అయ్యో నువ్వు రాకపోతే సంపెసేవోడయ్యా నా బిడ్డనే.... అమ్మో నాగమనో .... లేయే మనింటికి పోదామో ’’ అంటా నాగమణి కాళ్ళ కాడ కూల బడ్డాడు కోటమామ. ‘‘అబ్బాయ్ అబ్బాయ్ కొంచెం మంచినీళ్ళు తీసుకురండయ్యా ఎవురన్నా బోయే ... మోయ్ నాగమనా మోయ్... ఇటుసూడే తల్లో ....’’ అని హడావిడిపడతా కొంగుతో నాగమణి మొఖమ్మీద గాలి ఇసురుతుంది నాగమణి అమ్మమ్మ. జనాలు నాగమణి దగ్గరకు వచ్చేరు. ‘‘మీరు పక్కకి రండి ఆ పిల్లకి కొంచెం గాలి తగల్నియ్యండి’’ అంటా నాగమణి ముందుకొచ్చి ‘‘అమ్మాయ్ నాగమనా పైకి లెగూ’’ అంటా చెయ్యి పట్టుకుని పైకి లేపేను. నాగమణి కూర్చుంటూ కళ్ళార్పకుండా నా వైపే చూస్తు, ‘‘నా బిడ్డ సచ్చిపోయాడు మామ ....నా బిడ్డ సచ్చిపోయేడు.... నా బంగారి బిడ్డ సచ్చిపోయేడు మామా... నా బంగారు బిడ్డ ... ’’ అంటా పెద్దగాఏడుపందుకుంది. ఎండిపోయిన నాగమణి కళ్ళలో ఎవరో ఏతమేసి తోడినట్టు కన్నీళ్లు వుబికినాయి బయటికి, అవి కిందికి జారి రయికపై అట్టకట్టుకుపోయిన పాలమరకల్లో కలిసిపోయినాయి. ‘‘అమ్మో ఏడవబాకే నీకేమన్నా అయ్యిద్దె ....’’ అంటా అరికాల్లమీద అరిచేత్తో రుద్దుతున్నాడు కోటమామ. అక్కడున్నోల్లన్దరిలో కోటమామే పిరికోడు.మూడు సంవత్సరాల కిందటి మాట....మా అమ్మ కోటమామ పోయిన తరువాత చెప్పింది. అప్పటికే కోటమామ మా ఇంటికీ వచ్చి గంట పైన అయ్యిందంట. మా యమ్మ కూడా అప్పటికే నాలుగైదు సార్లు‘‘ఎందబ్బాయ్ ఇట్టా వచ్చేవో మామ కోసమా ఏంది?’’ అని అడిగినా కూడా ‘‘వూరికినేలేప్పా’’ అంటా అక్కడే నేనొచ్చిన్దాక కూసోని వున్నాడు.నన్ను చూసి గబక్కన సర్దుకొని కూర్చుంటా ‘‘అబ్బాయ్ పెద్దోడా ఇట్టారా ?’’ అన్నాడు.‘‘ఏంది కోటమాం ఈ జామునొచ్చేవ్ ఏంది కతా’’ అని పక్కన కూర్చున్న ఆయన మీదున్న చనువుతో‘‘అది కాదబ్బాయ్ మా గురించి నీకు తెల్వంది ఏముంది? అత్తా నేను నాగపడకుండా పనికిపోయినా ఇల్లు గడవడం కష్టమేనయ్యా... జెరమొచ్చినా తలనొప్పొచ్చిన ఒల్లునొప్పులొచ్చిన బిర్రుగా దుప్పటి కప్పుకొని పడుకుంటా గాని ఆస్పిటిలిగ్గా పోను డబ్బులు కర్చు అవుతాఎమోనని. అప్పో నన్నెక్కడన్నా పెళ్ళిళ్ళలో చూసా’’ అని మమ్మసాయ తిరిగి అడిగి ‘‘కనీసం పెళ్ళిళ్ళకి కూడా పోను సదివిమ్పులు ఇయ్యాల్సి వస్తున్దేమోనని. ఎవురేమైనా అనుకోని పండగపూటకూడా నాగాపెట్టకుండా పనికిపోతా కావాలంటేమన పల్లెల్లో యెవుర్నయినా అడుగు’’‘అబ్బాయ్ కోటయ్య ఇయన్ని పిల్లోడికి ఎందుకు సెప్తన్నా’’ ఎదురడిగింది మమ్మ. నాది కూడా అదే డౌటు కాబట్టి నేను కూడా ఊ అన్నా .‘‘ఇదంతా ఎవురికొస్మప్పా నాగమణి పెళ్లికోసం కదంటే...’’ ఆయనికి ఏడుపు వస్తంది గాని ఆపుకుంటున్నాడు. ‘‘ఎవురు కాదన్నారబ్బాయ్...అసలు సంగతేంది?’’ నావైపు అనుమానంగా చూస్తా అడిగింది ఆయన్ని.‘‘మీ అబ్బాయి నాగమణి తో ఏమన్నాడో నువ్వే అడుగు’’ అన్నాడు కొంచెం కోపంగా.‘‘నేనేమన్నాను ... అసలు దేని గురించి?’’ నాక్కూడా కోపమొచ్చింది.‘‘వచ్చే నెలలో పిల్ల పెళ్లి పెట్టుకుంటిమే ....ఆ పిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే పోలీసు కంప్లెంటు ఇస్తానన్నవంటగా?’’ గుటకలు మింగుతా అన్నాడు. ‘‘ఏందిరా ... పోలీసు కంప్లెంటు ఏంది?’’ అయోమయంగా అడిగింది మా అమ్మ.‘‘అదా ...లేకపోతే ఎందిమా ఆ పిల్లకి పద్నాలుగేళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళంట! కనీసం ఆపిల్ల పుష్పావతన్నా అవ్వద్దంటే?అందులో మాణిక్యరావు అన్నకి ఆపిల్లకి వయసు తేడా పదకొండేళ్ళు...అందుకే ఆపిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే బాల్యవివాహం అని చెప్పి పోలీసు కంప్లెంటు ఇస్తానని చెప్పా?’’ అన్నాను గర్వంగ. ‘‘అప్పో నువ్వు చెప్పే పిల్లకి పెళ్లి సెయ్యాలంటే ఈ రోజుల్లో మనం సెయ్య గలిగి వున్నామా..... ఎంత పనికిమాలినోడుకూడా లచ్చ కట్నం ఇయ్యంది పెళ్లిచేసుకోడయ్యా.... లచ్చలేడ దేవాలప్ప’’ గొంతుకి కల్లె అడ్డం పడి దగ్గేడు, కళ్ళలోంచి నీళ్ళు కారతన్నాయ్. ‘‘నాయాల్ది ఆడపిల్లని కన్న పాపానికి పెళ్లి మనమే సెయ్యలయ్యే, పుట్టింటి సామాన్లు మనమే తేవాలయ్యే,కానుపులు మనమే సెయ్యాలయ్యే, పిల్లకి ఏ కష్టమొచ్చినా మనమే మున్డున్డాలయ్యే.... అన్ని డబ్బులు నాకాడ యాడుండాయిమే... రేయింబగళ్ళు పని చేసినా కూటికే సరిపోతున్నే....ఆ పిల్లోడు మా అక్కాయ కొడుకే కాబట్టి కట్నం బొట్నం ఏమొద్దన్నాడు. ఈ పిల్ల పెద్దమనిశయ్యిందాక ఎదురుచూస్త కూసుంటే వాడి వయసు పోదా? వాడు గాని ఈ పిల్లని పెళ్లి చేసుకోకపోతే నేను డబ్బులేడ్నుంచి తెవాలిమే... పెద్దమనిషి కాకపోతేనేం ఆపిల్లేమన్నా ఇప్పుడు సూట్టానికి సిన్నపిల్లలాగుందా నువ్వుసూడ్లా? ఇప్పుడు పెళ్లిచేస్తే పెద్దమనిషి అయినాకే కాపరం చేసుకుంటారు అప్పుడు దాక పిల్ల మనింట్లోనే ఉండటానికి కూడా పిల్లోడు ఒప్పుకున్నాడు. ఎట్టో కట్ట ఈ పిల్లని వాడికిచ్చి పెళ్లిచేస్తే వాళ్ళ బతుకు వాళ్ళుబతుకుతారు.... లేకపోతే నేను పిల్లకి పెళ్లి చెయ్యగలిగి వున్నానంటప్ప మీ వోడేమో పోలీసులుకి సెప్తానంటన్నే... నేనేడ సావాలో సెప్పప్పా’’ అంటా మా అమ్మ సేతులు పట్టుకున్నాడు. ‘‘ఆయన్న కాకపోతే ఇంకొకడు మామ... కనీసం ఆ పిల్లకి పద్దేనిమిదేల్లన్నా నిండద్దా?’’‘‘నోర్మూసుకోరా ఆయన్ని నీకెందుకు ? వాళ్ళ కూతురు వాళ్ళిష్టం’’ నా మీద అరిసింది మా అమ్మ.‘‘అబ్బాయ్ నువ్వన్నట్టే మా అమ్మాయిని ఆపుతాంగానే ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు... నువ్వే పెళ్లిచేసుకో కట్నంలేకుండా...సరేనా ’’ అన్నాడు కళ్ళుతుడుసుకొని నవ్వుతా‘‘నాగమణికేమి బంగారంలాగ వుండిద్ది ఆపాలేగానే పెళ్లిచేసుకోనా ఏంది?’’ అన్న నవ్వుతా నేను కూడా.‘‘మాటలకేమి గానే ... పెద్దోడో అయ్యో నీకు దండం పెడతా పోలీసులుకి మాత్రం సెప్పబాకయ్య’’ అన్నాడు కొంచెం దీనంగా.‘‘అసె వాడి మాటలకేమొచ్చే గాని నువ్వు పోరే....వాడేదో నవులాటకి అనుంటాడు’’ అంది మా అమ్మ కోట మామతో.‘‘ఆ మాట మీ పిల్లోన్ని సెప్పమనప్పా అట్టానే పోతా... ఈ మాట ఎవుడన్నా సదూకోనోడు గాని అనుంటే నేను నవ్వులాటకే అనుకునేవోన్ని మీవోడు సదూకున్న పిల్లోడైనా అన్నంత పని సేత్తాడేమోనని బయమ్మే ’’ అన్నాడు‘‘ఇప్పుడు నేనేమి పోలీసులుకి సెప్పన్లెకానా రేపు పెళ్ళయినాక నాగమణికి ఏమన్నాకావాలా? అప్పుడున్దిద్ది నీకు’’ అన్న నవ్వుతా. ‘‘నువ్వేం బయపడబాకరా ఈడిప్పుడు కాలేజ్ కి పోతే మల్లి వచ్చేదెప్పుడో... వాడెవురికి సెప్పడ్లే నువ్వు ఇంటికిపోయి పెళ్లి పన్లు చూసుకో’’ అని హామీ ఇచ్చింది మా అమ్మఅది జరిగిన రెండు సంవత్సరాలకి అనుకుంటా క్రిస్మస్ పండగ రోజు కోటమామ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేడు. ఇంటికెల్లా, కావాలనే నాగమణి చేత పిండి వంటలు తెప్పించేడు.‘‘ఇప్పుడు చెప్పరా అల్లుడా నాగమణి ఎట్టుందో? అప్పుడు తెగ బయపడి పోతివే పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేస్తున్నామని? ఇప్పుడు చూడు ఎట్టుందో’’ అన్నాడు కోట మామ.నిజంగానే తేరిపార చూడాల్సి వచ్చింది. ‘‘మామ ఆ రోజు నీ మాటిని నాగమణిని నేను పెళ్లి చేసుకున్నా బాగుండేది మామ? మిస్సయాను పొ’’ అన్నాను అందరు పగలబడి నవ్వారు, మాణిక్యరావు అన్న కూడా.చిన్నప్పటినుంచి నాగమణిని మొఖంలో ఇదే మొదటిసారి ఏడుపు చూడటం. ఎంతో అందంగా ఏ మాత్రం కల్మషంగాని కుట్రబుద్దిగాని లేని నాగమణి అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. అందుకే తన నుండి దూరంగా బయటికొచ్చేసాను. మొన్ననే పండక్కని ఇంటికొచ్చిన నేను నాగమణి ఇక్కడే వుందని తెలుసుకొని ఇంటికి పోయినప్పుడు, కొడుక్కి అప్పుడే నీల్లుపోసిందిగామాల గుండ్రాయిలాగా బొద్దుగా వుండే వాడికి ఒళ్ళు తుడుస్తా ఆ రెండు నెలెల పిల్లోడికి ఆ చొక్కా ఎవరు తెచ్చేరో, ఆ టవలు ఎవరు తెచ్చేరో, వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో, వస్తూ వస్తూ పిల్లోడికోసం ఏమేమి బొమ్మలు తెస్తాడో అని చెబుతుంటే వాడు అవన్నీ నిజంగా వింటున్నట్టు నమ్ముతున్నట్టు వాడి చిట్టి చేతులను బుగ్గలపై రుద్దుకుంటూ, కాళ్ళను ముందుకూ వెనక్కి ఆడిస్తూ, నాగమణి వైపు ఆ చిట్టి కళ్ళతో తీక్షణంగా చూస్తూ వున్నాడు నేను అక్కడికి చేరుకునేసరికి.‘‘అయ్యో నిజమే మీ నాన్న నీకోసం ఒక లారి నిండా సామాను తీసుకొని వస్తున్నాడంట’’ అన్నాను పంచలోకి చేరుకుంటూ.‘‘రా మామా కూర్చో’’ అంటా కాల్లకట్టె వైపు చెయ్యి చూపించింది నవ్వుతా‘‘మేయ్ ఎందిమే పిల్లోన్ని కనమంటే గుమ్మడికాయని కన్నవో’’ అన్నాను పిల్లోడి అరికాళ్ళ వేళ్ళను మెత్తగా నిమురుతూ.‘‘ ఊరుకో మామ పిల్లోడికి మారు పేర్లు పెట్టమాక ...నా బంగారి కొడుక్కీ .....’’ అంటా మురిసిపోయింది.‘‘ ఏమాటకామాటే చెప్పుకోవాలిగాని నాగమనా...మీ పిల్లోడికి అన్నీ నీపోలికలే వచ్చినియ్మే నీలాగే చాల అందంగా ఉన్నాడో....’’ అన్నాను.‘‘ఊరుకో మామ దిష్టిబోద్ది మా పిల్లోడికే’’ అంటా వెంట్రుకల ముడివిప్పి ఆ పొడవాటి వెంట్రుకలతో కాళ్ళ నుంచి తలవరకూ మూడు చుట్లుతిప్పి దిష్టితీసి అరికాల్లో కాటుకతో కుంకుడుకాయంత దిష్టిబొట్టు పెట్టింది. ‘పిల్లోడు మీద అంత జాగ్రత్తగా ప్రేమగా వుండే పిల్లకి ఇట్ట జరిగిందేంది దేవుడా’ అనుకుంటా పక్కనే వున్న బొంకు అరుగు కాడికి వొచ్చేను. ‘‘మామో అవ్వాయ్ సువ్వాయ్ లేమన్నా తేవాలంటే ఒంగోలు పోయే ’’ అంటా సమాదుల్లో గుంట తవ్వను పోతున్న సుధాకరు అక్కడ కూర్చున్న పేతురుతాతని అడిగేడు.‘‘అసె చిన్న పిల్లోడికి అయ్యన్ని ఎందుకురా? ఏదో అంత గుట తీసి బూడ్చిపెట్టకా’’ అన్నాడు చుట్ట ముట్టిస్తా.గుండె జల్లుమంది.‘‘అయ్యో ప్రైటు సీసా ఒకటియ్యయ్యా పిల్ల బాగానీరంసంగా ఉంది’’ అంటా బొంకు కాడికి వచ్చింది నాగమణి అమ్మమ.‘‘నాయనమ్మో అసలెంయ్యిందే నిన్నటిదాకా పిల్లోడు బాగానేఉన్నే ఇంతలోనే ఏందిది’’ అన్నాను‘‘ఏం సెప్పమంటావయ్యా ఆడి గాచారం అట్టరాసుంది... ఎవురు మాత్రం ఏమి సెయ్యగలరు’’ అంది స్ప్రైటు సీసా అందుకుంటా.‘‘ఒరేయ్ అబ్బాయ్ ఇటురాయ్య ఈప్రైటు తీసుకెళ్ళి పద్మమ్మకియ్యి’’ అంటా పక్కనున్న సిన్నపిల్లోడికి ఇచ్చి అరుగు పక్కనున్న సిన్నరాయిమీద కూసుంది.‘‘ మొన్న నేను ఇంటికి పోయినప్పుడు ఎంత బాగున్నాడు పిల్లోడు....పాపం నాగమణి మొకం సూడలేకపోతున్నానే’’ అన్నాను.‘‘అయ్యో రాత్రి పోడుకోబోయేటప్పుడుకూడా పిల్లోడుతో మేమందరం బాగానే ఆడుకుంటిమికదయ్యా , పిల్లోడు మేము సేప్పేయి బాగానే ఆలకించేడు, ఎండుమిరగబాయల్తో బాగానే దిష్టి తీసెను, దోమలు కుడతాయేమోనని దోమతెరకట్టి నేను పక్కనే మంచమేసుకొని పొడుకున్న, అంతా బాగానే ఉన్నే, రెండు మూడు టైం అయ్యేలోకే పిల్లోడు మామూలుగా ఎప్పుడు పాలకి లేవనూ ఏడవనూ చేసేవాడు, అక్కడినుంచి పాపం ఆ పిల్లకి నిద్ర వుండేది కాదు. నాకెందుకో గబుక్కన మెలుకువొచ్చింది ఒక జామున, ఏంది ఇంకా పిల్లోడు పాలకి లేవలేదు అని అనుమానం వొచ్చి నాగమణిని లేపుదాం అని దోమతెరలోకి పోయి పిల్లోన్ని పట్టుకునేలికి పిల్లోడి వొళ్ళంతా సల్లంగా అయిసుగడ్డ లాగుంది. నాకు గుండెలు పగిలే’’ కళ్ళు తుడుసుకుంది.‘‘మేయ్ నాగమనా ఎందిమే పిల్లోడి వొళ్ళు ఇంత సల్లంగా ఉందా అని గబక్కన లైటేసి సూస్తినే... పిల్లోడు తెల్లగా పాలిపోయి నీలక్క పోయి వున్నాడు బిడ్డ, మొవ్ ఉచ్చ పోసుకొని ఉంటాడు లేయే పిల్లోడో... లైటాపే మల్లి వోడు లేచేడంటే నాకు నిద్రున్దదే... అంటా కదిలింది. అప్పడు తెలిసిందయ్యా నాకాపిల్లోడు ఎందుకుసచ్చిపోయేడో....బిడ్డ మొకంమీద నాగమణి రొమ్ము పడివుంది. మొదులుకే దానియి ఎత్తురొమ్ములు దానికితోడు అవి పాలతో నిండి ఇంకా బరువెక్కిల్లా..... పాపం బిడ్డ ఎంత అల్లడిపోయి ఉంటాడో తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తంది. బిడ్ద పిల్లోన్ని బంగారమాల సూసుకునేది... పిల్లోడికి బాగా పాలు పడాలని బాగా కూడు తినేది. దానికి ఏం ముసలం పట్టిందో ఒళ్ళు తెలియకుండా నిద్రబోయింది’’ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ‘‘యెంటనే ఒసే అడ్డల్దానా పిల్లోడు సచ్చిపోయేడే.... లేసి సూడే అనేతలికి, నీ యమ్మ గూప్పగలగొడ్త ఆమాటన్నావంటే నాబిడ్డని అంటా తాసుపాములాగా నా మీదకి లేసిందయ్యా. పిల్లోడి పక్కకి తిరిగి ఈడెమో దుప్పటి కప్పుకోడు ఒళ్లంతా సూడు ఎలా సల్లగయ్యిందో అంటా రొమ్ముతీసి పిల్లోడి నోట్లో పెట్టి నుదుటిమీద ముద్దుపెట్టుకుని శానాసేపు అట్టాగే పడుకుందయ్యా బిడ్డ. నేను పోయి వాళ్ళమ్మా నాయన్ని లేపకొచ్చేలికే.....మా వైపు చూసి, బిత్తరసూపులు సూస్తా, మౌ పిల్లోడికేమయ్యిన్దిమా....బిడ్డ పాలుతాగట్లేదే....ఒళ్లంతా సల్లన్గయ్యిందే ఫానాపండా.... రేపు వాళ్ళనాన్న ఉయ్యాల తెత్తానన్నాడే పిల్లోడ్ని ఉయ్యాలలో పండేద్దామే.....నాపక్కనొద్దె వాడికేమన్నా అయ్యిద్దేమోనని భయంగా వుందే .....అంటానే వుంది కళ్ళనీళ్ళు కారతానే ఉండాయ్...పాపం దానికేమిసెయ్యాలో అర్ధంగాక...’’ ముసల్ది ఇకసెప్పలేక పోయింది.‘‘అంత మొద్దు నిద్రెట్టా పట్టిందిరా దానికి మగల్లారా..... బంగారం లాంటి పిల్లోడు సచ్చిపోయినే’’ అన్నాడు బొంకేసేబు.‘‘ అల్లా బొద్దికూరప్పాడు ఇస్రాన్తమ్మ మనవడు కూడా ఇట్టాగే మామ సచ్చిపోయిందే ‘‘ అన్నాడు పక్కనే వున్నా సిన్నమోసే.‘‘పోయినాదివారం యరజర్లలో ఇట్టాగే ఒక పిల్లోడు వాళ్ళమ్మ జాకెట్కి వుండే పిన్నిసు ఎట్ట కిందపడిందో...అది ఆపిల్లోడ నోట్లోకి ఎట్టాపోయిందో గొంతుకడ్డంపడి గిలగిల కొట్టుకుంటంటే హాస్పిటల్ కి తీసుకెల్లెలికె ప్రాణాలు పోయినియంట’’ చాల బాధ పడతా చెప్పేడు బాబురావు.‘‘చాల జరుగుతున్నయబ్బాయ్ ఇట్టంటియే’’ నిట్టూర్చింది రాయేలు సినమ్మ.‘‘నాగమణి అంత మొద్దుతరాగ నిద్రబోయే పిల్ల కాదె’’ అన్నాను నేను గొనుగుతున్నట్టు.‘‘పిల్లకి ఏవిల్లొచ్చి అయిదోనెల రాన్గల్లోనే తెచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి మొత్తం మీదే బాద్యతన్నట్లు చేతులుదులుపుకొని పోతుంట్రే మొగుళ్ళు, దాని కూటికని, హాస్పిటల్కని, కానుపులుకని కర్సులుమీద కర్సులు సెయ్యాల్సోస్తన్నే.... తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా బిడ్డని కనిపెట్టుకొని కూసోడానికి దాని అమ్మకి అయ్యకి కుదరకపోతున్నే, నాకేమో సుగరొచ్చి మోకాళ్ళ నొప్పులుతోటే అడుగు దీసి అడుగు వెయ్యలేక పోతుంటినే... బిడ్డ దాని తప్పేముందిలె.... పొద్దున్నే లేసి ఇల్లూడ్సి, బాసిన్లు తోమి, గుడ్లుతుక్కొని, కావాల్సింది ఒండుకొని, పిల్లోడికి నీలు పోసి, గుడ్లేసి, అట్టకన్నుమూస్తే పిల్లోడికి ఎమయ్యిద్దో అని కనిపెట్టుకొని వుండాలయ్యే, రాత్రన్న నిద్రబోదామంటే వాడేమో తొమ్మిదికే పొడుకుంటున్నే వాడు పొడుకున్నకే ఈ పిల్ల కూటికి లేవలయ్యే...అన్ని పన్లు చేసుకొని పడుకునేలికి పిల్లోడు నిద్రలేస్తాడయ్యే బిడ్డ అట్టాగే ఎట్టోకట్టా నెట్టకోస్తానే వుంది. అది మాత్రం ఏమి చేసిద్ది. ఎంత కాలం అని నిద్రలేకుండా వుండిద్ది. దాని కర్మకాలి ఇట్టా జరిగే. ఇంకా అదేదో దాని తప్పే అయినట్టు ఆమూగి మొద్దోడేమో వూరినుంచి వచ్చీరాంగల్లోనే గొడ్డుని బాదినట్టు బాదుతున్నే’’ అని సెప్పుకుంటా అక్కడనుంచి లేచి వెళ్లి పోయింది. చాల సేపు ఎవురూ ఏమి మాట్లాడలా. నాకూ అక్కడ కూర్చో బుద్దెయ్యలేదు. అక్కడినుంచి బయటకొచ్చాను.ఒక ఆరేళ్ళ పిల్ల ఇంకో తొమ్మిది నెల్ల పిల్లోన్ని సంకలో ఎత్తుకొని రోడ్డు దాటబోతూ ట్రాక్టర్ హార్న్ విని ఉలిక్కి పడి వెనక్కి వెళ్ళింది.ఒకామె నెత్తిమీద పలుగూ పార పెట్టుకొని సంకలో ఒక పిల్లోన్ని చేతిలో ఇంకో పిల్లోన్ని తీసుకొని నడిజామున మట్టి పని నుంచి ఇంటికి వస్తూ వుంది. సంకలో పిల్లోడు నిద్ర పోతూ తన చేతిలో వేలాడుతూ వున్నాడు.ఇద్దరు పిల్లోల్లు ట్రాన్సా్ఫం దగ్గరలో బచ్చాలాట ఆడుకుంటా వున్నారు.జాషువా మనవడు ఆ వీదిలో పోతున్న కుక్కల్ని రాళ్ళతో కొడుతున్నాడుపిల్లలందరూ అపాయపు అంచునే కనిపించేరు నాకు.పిల్లోని బూడ్చి పెట్టిందాకా అక్కడే వుండి అందరూ పోయాకా స్మశానం గేటు మూసి గొళ్ళెం పెట్టి బయటకొస్తుంటే ముందు గొర్రెలు వాటెనకాల చినసుబ్బయ్యమామ వస్తా కనిపించేరు.‘‘ఎందబ్బాయ్ ఇక్కడున్నావు?’’ అని అడిగేడు ‘‘నాగమణి కొడుకు....’’ చెప్పబోయేను. ట్రాక్టర్ హార్న్ మోగిందిగొర్రెల గుంపు చెల్లా చెదురయ్యింది‘‘హోయ్ ... టుర్ర్ర్ర్.... దీనెమ్మ ఈ గొర్రెలు .....’’ పరిగెత్తేడు.చూస్తూ వున్నాను గొర్రెల గుంపుని, ప్రతి గొర్రె ఇంకో గొర్రెను పట్టించుకోవడంలేదు గాని అన్ని లైన్ లోనే వెళ్తూవున్నాయి. అన్నీ గొర్రెలు మందలో ఉన్నాయన్న ధీమాతో చిన సుబ్బయ్య మామ వాటి వెనకాలె వెళుతున్నాడు. ఒక్క గొర్రె మాత్రం ఆ పోతున్న గొర్రెలను చూస్తూ నిలబడి పోయింది ఇంకేమి చెయ్యలేక. -
ఈ యుగపు మహాకవి జాషువానే
సాక్షి, అనంతపురం కల్చరల్ : సమాజంలోని అసమానతలు తొలిగేలా సాహిత్యాన్ని నడిపించిన 20వ శతాబ్దపు మహాకవిగా గుర్రం జాషువానే గుర్తించాలని ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా అన్నారు. గుర్రం జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య ఆధ్వర్యంలో ‘మహాకవికి నివాళి’ పేరిట జరిగిన కార్యక్రమంలో శనివారం నగరానికి విచ్చేసిన ప్రఖ్యాత సాహితీ వేత్తలు ఓల్గా, అక్కినేని కుటుంబరావు, కథా రచయిత సింగమనేని నారాయణ తదితరులు జాషువా జీవితాన్ని, సాహిత్యంలోని విశేషాల గురించి మాట్లాడారు. తెలుగు సాహిత్య రంగంలో అసమాన ప్రతిభతో రాణించిన జాషువా గొప్పతనాన్ని తొలిరోజుల్లో పెద్ద పండితులు గుర్తించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. గబ్బిళం రచన ద్వారా సమాజానికి కొత్త సందేశాన్ని అందించిన జాషువా చిరస్మరణీయుడని, ఆయనను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు భావించాలన్నారు. సాహిత్య సభల కోసం అనంతకు విచ్చేసిన తమకు జాషువా విగ్రహం ఏర్పాటు చేసుకుని భక్తితో ఆరాధించుకోవడం ఆనందమేసిందని తెలిపారు. నాగలింగయ్య జాషువా సాహిత్య సేవకునిగా ఎనలేని సేవలందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఓల్గాతో కలిసి పలువురు రచయితలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు భాస్కర్, ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
సమసమాజ స్థాపనకు కృషి చేయాలి
అనంతపుురం కల్చరల్ : మహాకవి గుర్రం జాషువా స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జాషువా 119వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నగరంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో హుస్సేన్‌సాబ్, డెప్యూటీ మేయర్ గంపన్న, కవులు, కళాకారులు, ఉద్యోగ సంఘాలవారు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జాషువా సాహిత్య పీఠ సాధన కమిటీ, జెన్నే పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించారు. సాహితీ సదస్సుకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జయరాజ్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ వాస్తవికత, సామాజికత, ఆధునికత అనే పునాదులపై తెలుగు కవిత సరికొత్త రూపాన్ని సంతరించుకుందని అభిప్రాయపడ్డారు, నూతన సామాజిక కవిత్వాన్ని గురుజాడ ప్రారంభిస్తే దానిని శ్రీశ్రీ, జాషువాలు కొనసాగించారన్నారు. నేటి తరం సాహిత్యంతో సామాజిక అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు. అనంతరం హనుమంతరాయ చౌదరి, ఆచార్య జయరాజ్, లిటిల్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఆంజనేయులు గౌడ్, జెన్నే ఆంజనేయులు, కథా రచయితలు శాంతి నారాయణ, జిరసం అధ్యక్షుడు ప్రేమ్‌చంద్, ఆచార్య సుధాకరబాబు, అమ్మిశెట్టి తులసీకృష్ణ, అంకె రామలింగయ్య తదితరులను ఘనంగా సత్కరించారు. జాషువా సాహిత్యంపై క ళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృ త్వం, పద్యపఠన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జాషువా సాహిత్య పీఠ సాధన కమిటీ సభ్యులు తోట నాగరాజు, కార్పోరేటర్ బంగి సుదర్శన్, అగ్రికల్చర్ ఎడి రంగస్వామి , పండిట్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య నివాళి అనంతపురం టవర్‌క్లాక్ : నగరంలోని మహాకవి గుఱ్ఱం జాషువా విగ్ర హానికి మాదిగ ఉద్యోగుల సమాఖ్య పూలమాలలు వేసి నివాళులర్పించింది. సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ మాట్లాడుతూ సమాజ చైతన్యానికి జాషువా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మహాకవి జయంతి వేడుకలను ప్రతి జిల్లాలోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర, రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు, ఉపాధ్యక్షుడు న రసింహులు, కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జాషువా రచనలతో చైతన్యం
=ఆత్మ సంఘర్షణ, అవమానాల నుంచే కవిత్వం =జాతీయ సదస్సులో కేయూ వీసీ వెంకటరత్నం కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : నాలుగు దశాబ్దాల తర్వాత కూడా గుర్రం జాషు వా రచనలు, సాహిత్యం నేటి సమాజంలో సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నాయని కాకతీయ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘గుర్రం జాషువా సాహిత్యతత్వం-సమకాలిన దృక్ప థం’ అంశంపై శుక్రవారం జాతీయ సదస్సు ఏర్పాటుచేశారు. హ్యుమానిటీస్ భవనంలోని సెమినార్ హాలులో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆత్మ సంఘర్షణ, అవమానాల నుంచే జాషువా కవిత్వం పుట్టిందని పేర్కొన్నారు. తన జీవన యానంలో ఎన్నో అవమానాలు భరించిన జాషువా ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదనే భావనతో సమాజంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రచనలు చేశారని తెలిపారు. తన పాఠశాల రోజుల్లోనే జాషువా రాసిన గబ్బిలం కావ్యాన్ని చదివానని గుర్తుచేసుకున్నారు. కాగా, తెలుగు అకాడమీ ప్రాంతీయ కార్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటుచేయాలని భావిస్తే క్యాంపస్‌లో స్థలమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వీసీ తెలిపారు. తెలుగు అకాడమీలో పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లోని తెలుగు అకాడమీలో మూడేళ్ల క్రితమే జాషువా పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర తెలుగు అకాడమీ డెరైక్టర్ కె.యాదగిరి తెలిపారు. అలా గే, గుర్రం జాషువా జయంతి, వర్ధంతి సందర్భంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతో పా టు పాఠశాలల పిల్లల కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇంకా ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీరంగంలో కృషి చేసినవారికి ఏటా రూ.10లక్షల ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని వివరించారు. కా గా, తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రం వరంగల్‌లో ఏర్పాటుచేసేందుకు రూ.2కోట్లు మంజూరయ్యాయని యాదగిరి పేర్కొన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ కాళిదాసు మేఘాల ద్వారా సందేశాన్ని పంపితే, జాషువా గబ్బిలం కావ్యంలో అస్పృశ్యుడి ఆవేదనను ఆవిష్కరించడం దళిత చైతన్యంలో భాగమేనని తెలిపారు. తెలుగు విభాగం ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే కీలకపోన్యాసం చేస్తూ జాషువా సాహిత్యం అట్టడుగు వర్గాల జీవితాన్ని చిత్రించిందని తెలిపారు. తెలుగు కవులు తమ గ్రంథాలను పురుషులకే అంకితమిస్తే మొదటిసారిగా జాషువా తన గ్రంథాలను స్త్రీలకు అంకితమివ్వడం విశేషమన్నారు. డాక్టర్ వేలూరి శ్రీదేవి మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడాలని జాషువా తన రచనలో ద్వారా తెలిపారన్నారు. సదస్సుకు కేయూ తెలుగు విభాగాధిపతి, సెమినార్ డెరైక్టర్ డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, హైదరాబాద్‌లోని జాషువా పరిశోధనా కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాసశర్మ పరిశోధనా కేంద్రం నివేదిక సమర్పించారు. సదస్సులో తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, ఆర్ట్స్ కాలేజీ తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏటూరి జ్యోతి, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్, ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, ననుమా స్వామితో పాటు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశోధన పత్రాల సమర్పణ కేయూలో జరిగిన జాతీయ సదస్సులో తొలిరోజు పలువురు పరిశోధనా పత్రాలు సమర్పించారు. జాషువా - క్రీస్తు చరిత్ర అంశంపై ప్రొఫెసర్ కె.ఆనందన్, జాషువా కవిత్వం అలంకారాలు అంశంపై ప్రొఫెసర్ మానస చెన్నప్ప, జాషువా జీవితం సాహిత్య దృక్పథం అంశం పై డాక్టర్ విస్తాళి శంకర్రావు, జాషువా కవిత్వం చంద ప్రయోగాలు అంశంపై డాక్టర్ నర్సయ్య, జాషువా కవి త్వం ఆధ్యాత్మికత అంశంపై ప్రొఫెసర్ యోగా ప్రభావతి తదితరులు పరిశోధనా పత్రాలు సమర్పించారు.