హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్‌ | Five accused arrested in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్‌

Published Fri, May 12 2023 4:47 AM | Last Updated on Fri, May 12 2023 4:47 AM

Five accused arrested in murder case - Sakshi

పెనమలూరు :  కానూరు వద్ద జరిగిన చెన్నూరి అజయ్‌సాయి(22) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిగడప వసంతనగర్‌కు చెందిన చెన్నూరి అజయ్‌సాయి అదే గ్రామానికి చెందిన బొమ్మిడి మణికంఠ, పామర్తి మణికంఠ, పుట్టి శ్రీధర్, దొంపల ప్రశాంత్, పటమటకు చెందిన కగ్గా సాయినాగార్జునలు కలిసి ఈ నెల 7వ తేదీన పటమట రాజులబజార్‌లో ఉన్న స్నేహితుడు సంతోష్‌ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు.

ఆ సమయంలో బొమ్మిడి మణికంఠ ఇయర్‌ బడ్స్‌ కనిపించలేదు. అజయ్‌సాయిపై అనుమానంతో కొట్టారు. ఎనికేపాడు ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద బడ్స్‌ దాచానని అజయ్‌సాయి చెప్పడంతో అదే రోజు రాత్రి అతనిని బైక్‌ పై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బడ్స్‌ దొరక్క పోవడంతో అజయ్‌సాయిపై  విచక్షణ రహితంగా దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌సాయిని సాయినాగార్జున, పామర్తి మణికంఠ పటమట డొంక రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అజయ్‌సాయి కంకిపాడు ఫ్‌లైఓవర్‌ వద్ద ప్రమాదంలో గాయపడినట్లు వైద్యులను నమ్మించారు. అయితే అజయ్‌సాయి 8న ఆస్పత్రిలో మృతి చెందాడు.

మృతి వివరాలు కంకిపాడు పోలీసులకు అందడంతో.. వారు విచారణ నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను సీఐ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నిందితులపై రౌడీషీట్‌ కూడా తెరుస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, ఇందులో వీరు గంజాయి వాడారన్న వచ్చిన వార్తలో నిజం లేదని ఎస్పీ తెలిపారు. రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే ముందు  వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల విచారణ జరక్క ముందే రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

జీవన్‌కుమార్‌ది ఆత్మహత్యే 
పెదపులిపాక గ్రామంలో కాలినగాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జమ్మలమూడి జీవన్‌కుమార్‌(21)ది ఆత్మహత్యేనని ఎస్పీ జాషువా తెలిపారు. తన తండ్రి సుధాకర్‌ తీసుకున్న లోన్‌కు సంబంధించి ఈఎంఐ నగదులో రూ.12,500ను జీవన్‌కుమార్‌ ఖర్చు చేయడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపంతో ఉన్న జీవన్‌కుమార్‌ ఈ నెల 9న గురునానక్‌కాలనీలోని రెస్టారెంట్‌లో మిత్రుడు శ్యామ్‌ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు.

అనంతరం అదే రోజు రాత్రి యనమలకుదురు పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొన్నాడు. ఈ విషయం సీసీ కెమెరాలో నమోదైంది. తొలుత జీవన్‌కుమార్‌ది హత్యగా భావించామని, డీఎస్పీ జయసూర్య విచారణలో జీవన్‌ కదలికల్లో ప్రతి నిమిషాన్ని విచారించి సాంకేతిక సాక్ష్యాలు సేకరించినట్టు ఎస్పీ జాషువా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement