కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
అక్రమ మార్గంలో సంపాదన
గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది.
దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు.
ఆడిట్‌తో గుట్టురట్టు
వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు.
ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment