Manappuram Finance
-
సాగర తీరంలో లగ్జరీ ఫ్లాట్.. రూ.41 కోట్లకు కొన్న కేరళ బిజినెస్‌మ్యాన్
కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పి.నందకుమార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ప్రైమ్ కార్టర్ రోడ్డులో రూ.41.25 కోట్లకు ఈ అపార్ట్మెంట్ కొన్నట్లు ఈ లావాదేవీకి సహకరించిన రియల్ ఎస్టేట్ ప్రాప్‌టెక్ కంపెనీ నోబ్రోకర్‌ను ఉటంకిస్తూ మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.వెస్ట్ బాంద్రా ప్రాంతంలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. ఏప్రిల్ 24న రిజిస్ట్రేషన్ జరగ్గా, ఎస్ రహేజా డెవలపర్స్ దీనిని విక్రయించింది. దీని కోసం నందకుమార్ రూ.2.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రస్తుతం ముంబైలో కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ కుమారుడు ఈ నివాసం ఉపయోగించనున్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఈ కుటుంబానికి ముంబైలో ఇదే తొలి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్.ముంబైలోని ఈ ఖరీదైన ప్రాంతంలో ఇటీవల పలువురు వ్యాపార సినీ ప్రముఖలు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. యానిమల్, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించిన నటి తృప్తి దిమ్రీ జూన్ 3న ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్టర్ రోడ్లో ఓ లగ్జరీ ప్రాపర్టీని రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకు ముందు మే నెలలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివాలిలో ఆరు లగ్జరీ అపార్ట్మెంట్లను రూ .15.42 కోట్లకు కొనుగోలు చేశారు. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
యాక్సిస్ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా - ఎందుకో తెలుసా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత కొంతకాలంగా నిబంధనలను అతిక్రమించే బ్యాంకుల లైసెన్సులు రద్దు చేస్తూ, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల యాక్సిస్ బ్యాంక్, గోల్డ్ లోన్ అందించే మణప్పురం ఫైనాన్స్, ఫైనాన్స్ రంగానికి చెందిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నియమాలను అతిక్రమించిన కారణంగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ. 90.92 లక్షలు, మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 42.78 లక్షలు, ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్‌కు రూ. 20 లక్షల జరిమానా విధించింది. కేవైసీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా బ్యాంకింగ్ సర్వీస్ అవుట్సోర్సింగ్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, మేనేజ్ చేయడం వంటి ఇతర నియమాలను కూడా పాటించలేదని స్పష్టం చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన 'సిస్టమాటిక్ ఇంపోర్ట్ నాన్-డిపాజిట్ టేకింగ్ కంపెనీ అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ గైడ్‌లైన్స్ - 2016'ను సరిగ్గా పాటించనందుకు త్రిసూర్‌కు చెందిన మణప్పురం ఫైనాన్స్‌పై రూ.42.78 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను పాటించనందుకు ఆనంద్ రాఠి గ్లోబల్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు కూడా రూ. 20 లక్షల జరిమానా విధించారు. -
‘మణప్పురం’ మేనేజర్ అరెస్ట్
కోనేరుసెంటర్: ఎట్టకేలకు మణప్పురం ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసును పోలీసులు ఛేదించగలిగారు. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మాయలేడి అక్రమాలకు కృష్ణాజిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఆమెను, మరో ముగ్గురిని పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. దీనికి సంబంధించి కృష్ణాజిల్లా ఎస్పీ పీ జాషువా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. అక్రమ మార్గంలో సంపాదన గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకట పావని డిగ్రీ వరకు చదువుకుంది. వివాహమైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె మణప్పురం ఫైనాన్స్ కంపెనీలో గోల్డ్‌లోన్ మేనేజర్‌గా పనిచేస్తోంది. జిల్లాలోని ముదినేపల్లి, పెడన, బంటుమిల్లి బ్రాంచ్‌లలో పనిచేసి, ఇటీవల కంకిపాడు బ్రాంచ్‌కు బదిలీపై వెళ్ళింది. గోల్డ్‌లోన్ కోసం తరచూ ఆఫీసుకు వచ్చే కృత్తివెన్ను మండలం, పోడు గ్రామానికి చెందిన రేవు దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా చనువుగా మారింది. దుర్గాపస్రాద్ ప్రైవేట్ కళాశాల నిర్వహిస్తున్నాడు. ఈ పరిచయంతో ఇద్దరూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకుని మణప్పురం ఫైనాన్స్‌లో ఎలాంటి ష్యూరిటీ లేకుండా, ఆభరణాలు తనఖా పెట్టకుండా దుర్గాప్రసాద్‌కు పావని లక్షల రూపాయలు బదిలీ చేసింది. అలాగే తాకట్టులో ఉన్న నగలును పెద్దమొత్తంలో అప్పజెప్పింది. పది నెలల్లో సుమారు రూ.3.60 కోట్లకు పైబడి విలువ చేసే దాదాపు 10.650 కిలోల బంగారాన్ని ఇద్దరూ కలిసి అపహరించారు. ఆడిట్‌తో గుట్టురట్టు వీరి పన్నాగానికి బందరు మండలం, పోలాటితిప్ప గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తమ్ముడు కొక్కిలిగడ్డ నాగబాబు, కంకిపాడు మణప్పురం ఫైనాన్స్ సంస్థ హౌస్ కీపర్ మిట్టగడుకుల ప్రశాంతి సహకరించారు. అపహరించిన నగలును దుర్గాపస్రాద్ మచిలీపట్నం సహా విజయవాడలోని కోస్టల్ సెక్యూరిటీ బ్యాంకు, సౌత్ సెంట్రల్ బ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో పలు దఫాలుగా తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. ఈనెల 16న ఒకేసారి తాకట్టులో ఉన్న ఏడు కిలోల బంగారు ఆభరణాలను పావని చోరీ చేసి పరారైంది. విషయం తెలుసుకున్న మణప్పురం శాఖ అధికారులు ఆడిట్ నిర్వహించగా, విషయం బయటపడింది. దీంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ జాషువా డీఎస్పీ స్థాయి అధికారులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం నెప్పలి గ్రామంలోని డొంకరోడ్డులో పావని, దుర్గాప్రసాద్, వారికి సహకరించిన నాగబాబు, ప్రశాంతిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారాన్ని వందశాతం రికవరీ చేశారు. నగదు కొంత వాడుకున్నట్టు గుర్తించగా, మిగిలిన సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరచిన అధికారులందరినీ ఎస్పీ అభినందించారు. -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
మణప్పురం మిస్ సౌత్ ఇండియా గ్రాండ్ ఫినాలే (ఫొటోలు)
-
మణప్పురం లాభం పతనం
న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది. -
మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా
సాక్షి, హైదరాబాద్: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన డోర్‌స్టెప్ లోన్ పథకాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఓ వాల్యూవర్, మరో ఎగ్జిక్యూటివ్‌ల నుంచి వివరాలను కేటుగాళ్లు సేకరించి.. లేని బంగారంపై రూ.30 లక్షల రుణం మంజూరు చేసేసుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో స్థానికుల ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. లోన్ స్కీమ్ కథాకమామిషూ ఇదీ.. వినియోగదారులను ఆకర్షించడానికి వ్యాపార సంస్థల మాదిరిగా ఫైనాన్స్ సంస్థలూ రకరకాల స్కీముల్ని పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మణప్పురం ఫైనాన్స్ సంస్థ డోర్ స్టెప్ లోన్ స్కీమ్ ప్రారంభించింది. బంగారంపై రుణం కావాల్సిన వ్యక్తి ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా అప్లై చేసుకుంటారు. ఈ చిరునామాకు వెళ్లే వాల్యూవర్ బంగారం సరిచూసి తన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మణప్పురం పోర్టల్‌లోకి లాగిన్ అయి ఆ వివరాలు పొందుపరుస్తాడు. మరుసటి రోజు కస్టమర్ ఇంటికి వచ్చే ఎగ్జిక్యూటివ్ మంజూరైన రుణాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేసి, బంగారం తీసుకుని వెళ్తాడు. ఈ విధానాన్ని అధ్యయనం చేసిన సైబర్ నేరగాళ్లు కొత్త పథకం వేశారు. హెడ్డాఫీస్ పేరుతో ఫోన్లు చేసి.. సైబర్ నేరగాళ్లు హిమాయత్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌ల వివరాలు, ఫోన్ నంబర్లు తెలుసుకున్నారు. ఈ నెల 15న వాల్యూవర్కు కాల్ చేసిన కేటుగాళ్లు మణప్పురం హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో మీ వర్క్ పోర్టల్‌లోకి అప్డేట్ కావట్లేదంటూ చెప్పి యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకున్నారు. మంగళవారం ఎగ్జిక్యూటివ్‌కు సైతం ఇదే మాదిరిగా ఫోన్ చేసి ఆయన నుంచీ వివరాలు సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మాదిరిగా లోన్ కోసం అప్లై చేశారు. అదే రోజు వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లు తమ పని పూర్తి చేసినట్లు చూపిస్తూ.. 1,210 గ్రాముల బంగారం ఉన్నట్లు రూ.30 లక్షల రుణం ఓ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసేశారు. ఒడిశా బ్యాంకు నుంచి డ్రా.. మణప్పురం సంస్థ ఎప్పటికప్పుడు ముందు రోజు లావాదేవీలను పరిశీలిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మణప్పురం హెడ్డాఫీస్ బుధవారం నాటి లావాదేవీలను పరిశీలించింది. దీంతో తమ వద్ద ఉండాల్సిన బంగారంలో 1,210 గ్రాములు తక్కువ వచి్చంది. దీంతో ఆ లోన్‌కు సంబంధించి లాగిన్ అయిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిర్వాహకులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మణప్పురం ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు వెళ్లిన డబ్బు చివరకు ఒడిశాలోని బ్యాంకుకు చేరిందని తేల్చారు. అక్కడి బ్యాంకు నుంచి బుధవారమే నిందితులు డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
గోల్డ్ లోన్ కంపెనీలకు ఆర్బీఐ ఝలక్
సాక్షి, ముంబై: గోల్డ్ లోన్ కంపెనీలు మణప్పురమ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ .10 లక్షలు, రూ .5 లక్షలు జరిమానా విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ర్నాకులంలోని ముత్తూట్ ఫైనాన్స్ విభాగం మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 కాలంలో గోల్డ్ లోన్లకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను ముత్తూట్ ఫైనాన్స్ అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన కారణంగా రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్షిప్ వెరిఫికేషన్ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది. -
రివాల్వర్‌తో అసిస్టెంట్ మేనేజర్‌పై దాడి
సాక్షి, రాయదుర్గం: స్థానిక కణేకల్లు రోడ్డులోని మణప్పరం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయంలో సోమవారం దోపిడీ చోటు చేసుకుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో దుండగులు ప్రవేశించి, యాసిడ్ బాటిల్స్ వేసి భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు రివాల్వర్‌తో అసిస్టెంట్ మేనేజర్ తలపై బాది నగదు దోచుకెళ్లారు. రెక్కీ నిర్వహించి.. దోపిడీకి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. బంగారు నగలు తాకట్టు పెట్టాలంటూ శనివారం ఉదయం ఫైనాన్స్ కార్యాలయంలో మేనేజర్ మంజునాథ్‌ను ఇద్దరు యువకులు కలిసి మాట్లాడి వెళ్లారు. ఆ సమయంలోనే కార్యాలయంలో పనిచేస్తున్న వారి సంఖ్య, అందులోని భద్రతా ప్రమాణాలను వారు క్షుణ్ణంగా పసిగట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. నగ తాకట్టు పేరుతో.. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి మణప్పురం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో తాము బంగారు నగ తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ ఓ గోల్డ్ చైన్‌ను తీసి చూపించారు. దీంతో సెక్యూరిటీ గార్డు వారిని లోపలకు అనుమతించారు. దుండగులు లోపలకు ప్రవేశించగానే రెండు రివాల్వర్లు తీసి నగదు, బంగారం ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు. యాసిడ్ బాటిళ్లతో దాడి మారణాయుధాలు చూసి కార్యాలయంలోని సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అసిస్టెంట్ మేనేజర్ హరీష్ సైరన్ ఆన్ చేయడంతో అతని తలపై రివాల్వర్‌తో దాడి చేశారు. తలకు రివాల్వర్ గురిపెట్టి సైరన్ ఆఫ్ చేయించారు. తర్వాత ఎవరైనా కదిలితే కాల్చి వేస్తామంటూ తమతో పాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్స్‌ను కార్యాలయంలోకి చెల్లాచెదురుగా విసిరారు. దీంతో సీట్లలో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో భిక్కచచ్చిపోయారు. లాకర్ తీసేందుకు విఫలయత్నం అర గంట పాటు కార్యాలయంలో హల్చల్ చేసిన దుండగులు లాకర్ తీసేందుకు విఫలయత్నం చేశారు. తాళాలు ఇవ్వాలంటూ సిబ్బందిని ఒత్తిడి చేశారు. తమ వద్ద తాళాలు లేవని వారు చెప్పడంతో చివరకు క్యాష్ కౌంటర్లోని రూ.51,140 తీసుకుని కార్యాలయం గేట్‌కు తాళం వేసి పరారయ్యారు. తుపాకీ దెబ్బకు తలకు గాయమైన అసిస్టెంట్ మేనేజర్ తేరుకుని తన వద్ద ఉన్న రెండో తాళంతో గేటు తీసి, మేనేజర్ మంజునాథ్ సిబ్బందితో కలిసి వెంబడించేలోపు దుండగులు ద్విచక్ర వాహనంలో పరారయ్యారు. పరిశీలించిన పోలీసులు మణప్పురం ఫైనాన్స్ రాయదుర్గం శాఖ మేనేజర్ మంజునాథ ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ రాఘవేంద్రప్ప, సిబ్బందితో కలిసి దోపిడీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. దుండగులు విసిరిన బాటిళ్లలోని ద్రావకం యాసిడ్ కాదని తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీ ఘటనపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారన్నారు. దుండగులు బళ్లారి వైపు వెళ్లినట్లు తెలిసిందన్నారు. అన్ని రూట్లలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. -
‘మీ వల్లే ఆర్థిక, రాజకీయ స్థిరత్వం’
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన కృషిని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. మన్మోహన్ కేబినెట్లో 2004–12 మధ్య ప్రణబ్ పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం తెల్సిందే. మణప్పురం ఫైనాన్స్ సంస్థ నెలకొల్పిన వీసీ పద్మనాభన్ స్మారక జీవితకాల సాఫల్య పురస్కారాన్ని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మన్మోహన్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడారు. మన్మోహన్ హయాంలో ప్రవేశపెట్టిన చారిత్రక సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టాన్ని ప్రస్తావించారు. 1990 తొలి నాళ్లలో భారత్ అంతర్జాతీయ సమాజంలో విశ్వాసం కోల్పోయినప్పుడు మన్మోహన్ తన తెలివితేటలతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పదేళ్లు సమర్థంగా నడిపి రాజకీయ అస్థిరతకు ముగింపు పలికారని ప్రశంసించారు. -
దేశంలో 47 శాతం బంగారం వీరి దగ్గరే!
భారత్‌లో బంగారానికి భారీగానే డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని కొనడానికే కాని అమ్మకానికి ఎవరూ ఇష్టపడరు. మరికొంతమంది బ్లాక్‌మనీని దాచుకోవడానికి బంగారాన్ని సురక్షిత మార్గంగా ఎంచుకుంటారు. అసలు భారత్‌లో బంగారం ఎవరి వద్ద ఎక్కువుందో తెలుసా? మూడు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థలు.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థల వద్దే దేశంలో 47 శాతం బంగారం ఉందట. గత రెండేళ్లలో ఈ మూడు సంస్థలు కనీసం వారి బంగారం నిల్వలను 195 టన్నుల నుంచి 263 టన్నులకు పెంచుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడైంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ మూడు సంస్థలు కేరళకు చెందినవే. ఆ మూడు సంస్థల్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ దేశీయ అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థగా పేరుగాంచుతోంది. గత రెండేళ్లలో ఈ సంస్థ 116 టన్నుల నుంచి 150 టన్నులకు పైగా బంగారం నిల్వలను పెంచుకుంది. ఈ నిల్వలు సింగపూర్(127.4 టన్నులు), స్వీడన్(125.7 టన్నులు), ఆస్ట్రేలియా(79.9 టన్నులు), కువైట్(79 టన్నులు), డెన్మార్క్(66.5 టన్నులు), ఫిన్లాండ్(49.1 టన్నులు) ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగతా రెండు కంపెనీలు మణప్పురం ఫైనాన్స్ వద్ద 65.9 టన్నులు, ముత్తూట్ ఫిన్కార్పొ వద్ద 46.88 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలుగా తమ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. పాత నోట్లను రద్దు చేసిన మొదటి రెండు వారాల్లోనే ఈ గోల్డ్ లోన్ బిజినెస్‌లు 65-70 శాతం క్షీణించాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు చెక్, స్వైపింగ్ మిషన్ లాంటి వాటిని ఎంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ 558 టన్నుల బంగారం నిల్వలతో 11వ అతిపెద్ద దేశంగా ఉంది. బంగారం నిల్వలో 8,143 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. దాని తర్వాతి స్థానంలో 3,378 టన్నులతో జర్మనీ నిలుస్తోంది. గ్లోబల్‌గా బంగారానికి నమోదవుతున్న డిమాండ్‌లో భారత్ నుంచే 30 శాతం డిమాండ్ ఉందని తెలిసింది.