దేశంలో 47 శాతం బంగారం వీరి దగ్గరే!
దేశంలో 47 శాతం బంగారం వీరి దగ్గరే!
Published Tue, Dec 27 2016 9:27 AM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM
భారత్లో బంగారానికి భారీగానే డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని కొనడానికే కాని అమ్మకానికి ఎవరూ ఇష్టపడరు. మరికొంతమంది బ్లాక్మనీని దాచుకోవడానికి బంగారాన్ని సురక్షిత మార్గంగా ఎంచుకుంటారు. అసలు భారత్లో బంగారం ఎవరి వద్ద ఎక్కువుందో తెలుసా? మూడు అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థలు.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్కార్ప్ సంస్థల వద్దే దేశంలో 47 శాతం బంగారం ఉందట. గత రెండేళ్లలో ఈ మూడు సంస్థలు కనీసం వారి బంగారం నిల్వలను 195 టన్నుల నుంచి 263 టన్నులకు పెంచుకున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడైంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ మూడు సంస్థలు కేరళకు చెందినవే.
ఆ మూడు సంస్థల్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ దేశీయ అతిపెద్ద గోల్డ్ లోన్ సంస్థగా పేరుగాంచుతోంది. గత రెండేళ్లలో ఈ సంస్థ 116 టన్నుల నుంచి 150 టన్నులకు పైగా బంగారం నిల్వలను పెంచుకుంది. ఈ నిల్వలు సింగపూర్(127.4 టన్నులు), స్వీడన్(125.7 టన్నులు), ఆస్ట్రేలియా(79.9 టన్నులు), కువైట్(79 టన్నులు), డెన్మార్క్(66.5 టన్నులు), ఫిన్లాండ్(49.1 టన్నులు) ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగతా రెండు కంపెనీలు మణప్పురం ఫైనాన్స్ వద్ద 65.9 టన్నులు, ముత్తూట్ ఫిన్కార్పొ వద్ద 46.88 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలుగా తమ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలు బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని ఇస్తాయి. పాత నోట్లను రద్దు చేసిన మొదటి రెండు వారాల్లోనే ఈ గోల్డ్ లోన్ బిజినెస్లు 65-70 శాతం క్షీణించాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు చెక్, స్వైపింగ్ మిషన్ లాంటి వాటిని ఎంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ 558 టన్నుల బంగారం నిల్వలతో 11వ అతిపెద్ద దేశంగా ఉంది. బంగారం నిల్వలో 8,143 టన్నులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. దాని తర్వాతి స్థానంలో 3,378 టన్నులతో జర్మనీ నిలుస్తోంది. గ్లోబల్గా బంగారానికి నమోదవుతున్న డిమాండ్లో భారత్ నుంచే 30 శాతం డిమాండ్ ఉందని తెలిసింది.
Advertisement