కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్‌ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు.
సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.
జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు.
ఖాతాదారుల్లో ఆందోళన
మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి.
బ్రాంచ్ హెడ్ పావని పనే...
బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్‌గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment