
ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి
50 ఏళ్లకుపైగా చరిత్ర
దక్షిణాదిలో రెండో స్థానంలో నెల్లూరు
తయారీలో బెంగాలీలవైపే ప్రస్తుతం మొగ్గు
జీవనోపాధి కోల్పోతున్న స్థానిక స్వర్ణకారులు
స్వర్ణాభరణాల తయారీలో దక్షిణాది రాష్ట్రాల్లో సింహపురి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ లభించే వినూత్న డిజైన్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీలు, జైన్లు.. ఇక్కడి వారు అందించే ముడిసరుకుతో ఆభరణాలను తయారు చేస్తూ స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి పొందేవారు. అయితే కాలక్రమేణా వీరి స్థానాన్ని బెంగాలీలు ఆక్రమిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న తయారీదారులు ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నారు.
నెల్లూరు (పొగతోట): స్వర్ణాభరణాల తయారీకి కేరాఫ్‌గా నెల్లూరు నిలుస్తోంది. దక్షిణాదిలో కోయంబత్తూరు తర్వాతి స్థానం నెల్లూరుదే కావడం విశేషం. చెన్నై సైతం మూడో స్థానంలో ఉందంటే ఇక్కడ రూపొందించే ఆభరణాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 50 ఏళ్ల నుంచే జిల్లాలో నిష్ణాతులు పాతుకుపోయారు. పెద్ద, చిన్న, అతి సూక్ష్మ ఆభరణాల తయారీలో ఇక్కడి స్వర్ణకారులు ప్రావీణ్యం సాధించారు.
అర గ్రాము, గ్రాముతో చిన్న కమ్మలు, నెక్లెస్‌లు, స్టోన్ ఐటెమ్స్‌ను రూపొందించడంలో చేయి తిరగడంతో వీటిని సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.500 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా.
జిల్లాలో ఇలా..
ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు జిల్లాలో సుమారు 15 వేల మందికిపైగా ఉన్నారు. చిన్న, పెద్ద బంగారు షాపులు నగరంలో వెయ్యికిపైగా ఉన్నాయి. స్వర్ణాభరణాలను తయారు చేయడంలో ప్రారంభంలో స్థానిక స్వర్ణకారులు, అనంతరం ముస్లింలు, ప్రస్తుతం బెంగాలీలు ముందంజలో ఉన్నారు. చేతితో తయారుచేసే బంగారు ఆభరణాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.
అదే ముంబై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో మెషీన్ కటింగ్‌తో తయారు చేస్తున్నారు. నగరంలోని ఆచారివీధి, చిన్నబజార్, కొరటాల వీధి, గిడ్డంగివీధి, కాకర్ల వీధి, కుక్కల గుంట, మండపాల వీధిలో వేలాది మంది స్వర్ణకారులు జీవనోపాధి పొందుతున్నారు. అధిక శాతం షాపులనూ ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు.
కాలానుగుణంగా మార్పులు
స్వర్ణకారులకు ముడి సరుకును మార్వాడీలు, జైన్లు, స్థానికులు అందజేస్తారు. స్వర్ణకారులుండే రోజుల్లో వంద గ్రాముల బంగారానికి 8 గ్రాముల తరుగు, కూలిని అందించేవారు. ఇలా వంద గ్రాముల బంగారాన్ని ఇస్తే 92 గ్రాములతో ఆభరణాలను తయారుచేసేవారు. ఫలితంగా స్వర్ణకారులకు 8 గ్రాముల బంగారం, కూలి లభించేది. అనంతరం తయారీలో ముస్లింలు ప్రవేశించారు. ఆ సమయంలో కూలిని ఎత్తేసి తరుగును మాత్రమే ఇచ్చేవారు.

గోల్డ్ మాఫియా ఆగడాలు
జిల్లాలో గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. బడా నేతల సహకారంతో ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో తయారు చేస్తున్న రాళ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ నగలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు దొడ్డిదారిన తీసుకొచ్చి తయారీ అనంతరం అదే మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతుండటంతో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
పెండింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు
బంగారు ఆభరణాలను తయారు చేసేందుకు వచ్చిన బెంగాలీల్లో అధిక శాతం మంది పూర్తి వివరాల్లేకుండానే ఉంటున్నారు. బంగారు ఆభరణాల చోరీలకు సంబ«ంధించిన ఎఫ్‌ఐఆర్‌లు సంతపేట పోలీస్‌స్టేషన్లో అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వీటిని తయారు చేసే దుకాణంలో సీసీ ఫుటేజ్‌లు అందుబాటులో ఉన్నా, అపహరించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు.
జిల్లాలో నైపుణ్యమున్న స్వర్ణకారులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు రావడంలేదు. బెంగాల్ నుంచి తయారీదారులను ఆహ్వా నించి సూక్ష్మ బంగారు ఆభరణాలను రూపొందించడాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, పలచటి ఆభరణాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో అధిక శాతం మంది రావడం ప్రారంభించారు.
తయారీలో ప్రస్తుతం వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం తరుగుగా ఐదు గ్రాములను ఇస్తున్నారు. వీరి రంగప్రవేశంతో స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా ఆటోలు తోలుకుంటూ, కూరగాయలు, పండ్ల వ్యాపారాలు, బడ్డీ కొట్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు.

సందట్లో సడేమియాగా మధ్యవర్తులు
బంగారు ఆభరణాల తయారీలో మధ్యవర్తులుగా చిన్నబజార్, పెద్దబజార్ తదితర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తులు సూచించిన వ్యక్తులకే బంగారాన్ని ఆభరణాల తయారీ నిమిత్తం ఇస్తారు. తయారీదారులకొచ్చే తరుగులో కొంత భాగాన్ని వీరు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కీలకంగా ఉండే వ్యక్తులకు బంగారు ముడి సరుకును ఇస్తున్నారు. వీరు బెంగాలీలతో బంగారు ఆభరణాలను తయారు చేయించి తిరిగి అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment