ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన డోర్‌స్టెప్ లోన్ పథకాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఓ వాల్యూవర్, మరో ఎగ్జిక్యూటివ్‌ల నుంచి వివరాలను కేటుగాళ్లు సేకరించి.. లేని బంగారంపై రూ.30 లక్షల రుణం మంజూరు చేసేసుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో స్థానికుల ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
లోన్ స్కీమ్ కథాకమామిషూ ఇదీ..
వినియోగదారులను ఆకర్షించడానికి వ్యాపార సంస్థల మాదిరిగా ఫైనాన్స్ సంస్థలూ రకరకాల స్కీముల్ని పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మణప్పురం ఫైనాన్స్ సంస్థ డోర్ స్టెప్ లోన్ స్కీమ్ ప్రారంభించింది. బంగారంపై రుణం కావాల్సిన వ్యక్తి ఆన్‌లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా అప్‌లై చేసుకుంటారు. ఈ చిరునామాకు వెళ్లే వాల్యూవర్ బంగారం సరిచూసి తన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా మణప్పురం పోర్టల్‌లోకి లాగిన్ అయి ఆ వివరాలు పొందుపరుస్తాడు. మరుసటి రోజు కస్టమర్ ఇంటికి వచ్చే ఎగ్జిక్యూటివ్ మంజూరైన రుణాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేసి, బంగారం తీసుకుని వెళ్తాడు. ఈ విధానాన్ని అధ్యయనం చేసిన సైబర్ నేరగాళ్లు కొత్త పథకం వేశారు.
హెడ్డాఫీస్ పేరుతో ఫోన్లు చేసి..
సైబర్ నేరగాళ్లు హిమాయత్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌ల వివరాలు, ఫోన్ నంబర్లు తెలుసుకున్నారు. ఈ నెల 15న వాల్యూవర్‌కు కాల్ చేసిన కేటుగాళ్లు మణప్పురం హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో మీ వర్క్ పోర్టల్‌లోకి అప్‌డేట్ కావట్లేదంటూ చెప్పి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తీసుకున్నారు. మంగళవారం ఎగ్జిక్యూటివ్‌కు సైతం ఇదే మాదిరిగా ఫోన్ చేసి ఆయన నుంచీ వివరాలు సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మాదిరిగా లోన్ కోసం అప్‌లై చేశారు. అదే రోజు వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లు తమ పని పూర్తి చేసినట్లు చూపిస్తూ.. 1,210 గ్రాముల బంగారం ఉన్నట్లు రూ.30 లక్షల రుణం ఓ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసేశారు.
ఒడిశా బ్యాంకు నుంచి డ్రా..
మణప్పురం సంస్థ ఎప్పటికప్పుడు ముందు రోజు లావాదేవీలను పరిశీలిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మణప్పురం హెడ్డాఫీస్ బుధవారం నాటి లావాదేవీలను పరిశీలించింది. దీంతో తమ వద్ద ఉండాల్సిన బంగారంలో 1,210 గ్రాములు తక్కువ వచి్చంది. దీంతో ఆ లోన్‌కు సంబంధించి లాగిన్ అయిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిర్వాహకులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మణప్పురం ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు వెళ్లిన డబ్బు చివరకు ఒడిశాలోని బ్యాంకుకు చేరిందని తేల్చారు. అక్కడి బ్యాంకు నుంచి బుధవారమే నిందితులు డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment