సాక్షి, హైదరాబాద్: ఓ ఆర్థిక మోసం కేసులో 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్‌లో 1995 నమోదైన కేసులో నిందితుడిగా వీఎస్ క్షీర్‌సాగర్‌ను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ తెలిపారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లపేరిట మొత్తం రూ.4.3 కోట్లు సదరు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఈ మొత్తంలో రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లో దాదర్ బ్రాంచ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వీఎస్ క్షీర్‌సాగర్ కొట్టేశాడు.
కంపెనీ దివాళా తీయడంతో ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ పట్టణంలో అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన సీఐ డీ ఇన్‌స్పెక్టర్ ఎస్ వెంకటేశ్, ఎస్సై పి నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ ఎం.గోపాల్‌లను సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment