వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జాషువా
కోనేరు సెంటర్: లోన్ యాప్‌లతో అమాయక ప్రజలను వేధిస్తున్న మరో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ జాషువా గురువారం మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. పెనమలూరు, ఆత్కూరు, కంకిపాడు, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నారు. వాటిని సక్రమంగా చెల్లించినప్పటికీ.. యాప్ నిర్వాహకులు మరింత డబ్బు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇవ్వకపోతే మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో కొందరు డబ్బులు చెల్లించగా.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ జాషువా.. సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపి ఈనెల 17న మహారాష్ట్రలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
వారిచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్‌సింగ్, అతని సోదరుడు రోహిత్‌కుమార్, జయశంకర్ ఉపాధ్యాయలతో పాటు ఢిల్లీకి చెందిన అభిషేక్‌కుమార్‌సిన్హాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన హక్తర్ హుస్సేన్ అనే సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు.
వీరిలో కొందరు వాట్సాప్ కాల్స్, నకిలీ నంబర్లు, సోషల్ మీడియా ద్వారా రుణాలు తీసుకున్నవారిని బెదిరిస్తుండగా, మరికొందరు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతుంటారు. వీరందరికీ పాక్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఉంటారు.
వీరందరికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలియదు. వీరు వందలాది సిమ్‌లతో.. నకిలీ బ్యాంకు ఖాతాలతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. నేరస్తులందరినీ అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు వెంకటరామాంజనేయులు, భరత్ మాతాజీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment