జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఓల్గా తదితరులు
సాక్షి, అనంతపురం కల్చరల్ : సమాజంలోని అసమానతలు తొలిగేలా సాహిత్యాన్ని నడిపించిన 20వ శతాబ్దపు మహాకవిగా గుర్రం జాషువానే గుర్తించాలని ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా అన్నారు. గుర్రం జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య ఆధ్వర్యంలో ‘మహాకవికి నివాళి’ పేరిట జరిగిన కార్యక్రమంలో శనివారం నగరానికి విచ్చేసిన ప్రఖ్యాత సాహితీ వేత్తలు ఓల్గా, అక్కినేని కుటుంబరావు, కథా రచయిత సింగమనేని నారాయణ తదితరులు జాషువా జీవితాన్ని, సాహిత్యంలోని విశేషాల గురించి మాట్లాడారు. తెలుగు సాహిత్య రంగంలో అసమాన ప్రతిభతో రాణించిన జాషువా గొప్పతనాన్ని తొలిరోజుల్లో పెద్ద పండితులు గుర్తించలేకపోయారని విచారం వ్యక్తం చేశారు.
గబ్బిళం రచన ద్వారా సమాజానికి కొత్త సందేశాన్ని అందించిన జాషువా చిరస్మరణీయుడని, ఆయనను గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు భావించాలన్నారు. సాహిత్య సభల కోసం అనంతకు విచ్చేసిన తమకు జాషువా విగ్రహం ఏర్పాటు చేసుకుని భక్తితో ఆరాధించుకోవడం ఆనందమేసిందని తెలిపారు. నాగలింగయ్య జాషువా సాహిత్య సేవకునిగా ఎనలేని సేవలందిస్తున్నారని అభినందించారు. అంతకు ముందు స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఓల్గాతో కలిసి పలువురు రచయితలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు భాస్కర్, ఉమర్ ఆలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment