ఒంగోలు టౌన్: రాష్ట్రంలో పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల గుట్టు రట్టయింది. 100 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన ఈ దొంగల ముఠా 300 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేసి విక్రయించి వచి్చన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దొంగల ముఠా ఒంగోలు జైల్లో ఉండగా.. వారి నుంచి వెండి ఆభరణాలు కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించేందుకు వెళుతున్న వ్యక్తిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పూర్తి సమాచారం బయటపడింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవర సిపన్య, సవర బోగే‹Ù, మెదక్ జిల్లాకు చెందిన బత్తిని శ్రీకాంత్‌లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, బి.నిడమానురు గ్రామాల్లోని రఘునాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయాల్లో జరిగిన దొంగతనాల్లో నిందితులు. ఈ ముగ్గురు.. సవర సూర్య, కాకుమాని శ్రీనివాసరావులతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా దేవాలయాలను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవారు. చోరీ చేశాక దేవాలయాల్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌లను కూడా తీసుకెళ్లేవారు. దొంగలించిన ఆభరణాలను శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు చెందిన కాకినాడ కృష్ణారావుకు విక్రయించి అతడు ఇచి్చన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు.
ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో నాగులుప్పలపాడు మండలం చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయంలో వెండి ఆభరణాలను, సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగిలించారు. తిరిగి ఆగస్టులో నాగులప్పలపాడు మండలం బి.నిడమానూరులోని సాయిబాబా ఆలయంలో వెండి వస్తువులను దొంగిలించారు. పోలీసులు గాలిస్తుండగా అమలాపురం పోలీసులకు చిక్కారు. అక్కడ నుంచి ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్ జేఎఫ్‌సీఎం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం జిల్లా కారాగారంలో ఉన్నారు. చోరీ చేసిన సొత్తును కాకినాడ కృష్ణారావుకు విక్రయించినట్టు తెలపడంతో ఒంగోలు పోలీసులు అతడిపై నిఘా పెట్టారు.
చెన్నైలో వెండి ఆభరణాలను విక్రయించేందుకు శ్రీకాకుళం నుంచి చెన్నై సెంట్రల్ రైల్లో వెళుతున్న కృష్ణారావును సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు ఆలయాల్లో దొంగిలించిన రూ.15.50 లక్షల విలువైన వెండి, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు రాష్ట్ర వ్యాప్తంగా 100 దేవాలయాల్లో చోరీ చేసిన 300 కేజీల వెండి ఆభరణాలను కూడా తనకు విక్రయించినట్టు కృష్ణారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment