rooms booking
-
ఆలయం ఏదైనా మీ ఇంట్లోనే టికెట్
సాక్షి, అమరావతి:ఏడాదిన్నర క్రితం దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 8 ఆలయాల్లో ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్ సేవల్ని వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉండే రోజుల్లో సైతం భక్తులు 30 నుంచి 90 రోజుల ముందుగానే దర్శన టిక్కెట్లు, పూజలు, ఇతర సేవ టికెట్లతో పాటు ఆలయాల్లో అద్దె గదుల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. తద్వారా దైవ దర్శనాలకు వెళ్లిన రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఇష్టదైవాలను కొలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 3న మొదటిసారి శ్రీశైలం ఆలయంలో ఆన్లైన్ సేవలను ప్రాథమికంగా ప్రారంభించారు. ఆ తర్వాత 2022 జూలై 21వ తేదీ నుంచి ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో అన్ని రకాల సేవలను పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దశలవారీగా పెద్ద ఆలయాలన్నింటిలోనూ ఈ రకమైన ఆన్లైన్ సేవలను విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ సేవలు ప్రారంభించిన 2022 జూలై 21 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 23 తేదీ వరకు 10,20,943 మంది భక్తులు వినియోగించుకున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ఆలయాలు కొన్ని రకాల సేవలను గరిష్టంగా 30 రోజుల ముందుగా మాత్రమే ఆన్లైన్ అందుబాటులో ఉంచుతుండగా.. ఆలయాలు, అక్కడి సేవల ఆధారంగా గరిష్టంగా 90 రోజుల ముందుగా కూడా ఈ సేవలు పొందే వీలు కల్పించినట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆలయాలకు వెళ్లే భక్తులు భక్తి పారవశ్యంతో దైవ దర్శనం పూర్తి చేసుకునేలా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆలయాల పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా సేవ, దర్శన టికెట్లు ముందుగా కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాటు చేశాం. ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ ఖజానా నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దుర్గ గుడికి నిధులు కేటాయించారు. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి పురాతన ఆలయాల పునఃనిర్మాణంతో పాటు కొత్త ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) అత్యంత సులభ విధానంలో బుకింగ్ ఆలయాల్లో పూజలు, సేవలు, దర్శన టికెట్లు భక్తులు సులభంగా ముందస్తుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరించింది. ఏ ఆలయానికి ఆ ఆలయం కాకుండా అన్ని ఆలయాలకు సంబం«ధించి ఈ రకమైన సేవలను ఒకేచోట నుంచి భక్తులు పొందేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు. భక్తులు తమ ఫోన్ నంబర్ ఉపయోగించి ఈ సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. -
ఇంత తక్కువ ధరకు రైల్వే స్టేషన్లో రూమ్ లభిస్తుందని తెలుసా!
IRCTC Retiring Rooms: ఇండియన్ రైల్వే మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికుల వల్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ అందించే చాలా సౌకర్యాలను గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఈ కథనంలో అతి తక్కువ ధరకే హోటల్ రూమ్ లాంటి గదులను ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలను తెలుసుకుందాం. నిజానికి రైలు ప్రయాణం చేసేవారు స్టేషన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ మీదనే ఉండిపోతారు. కొంత మంది సమీపంలో ఉన్న హోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు. రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులు (సింగిల్, డబుల్ బెడ్) అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి. చాలా వరకు కేవలం వందకే రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. లేకుంటే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ సదుపాయం పెద్ద పెద్ద స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. రిటైరింగ్ రూమ్ ఇలా బుక్ చేసుకోండి.. టికెట్ కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్లు ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవాలి. మీరు ఏ స్టేషన్లో ఉండాలనుకుంటున్నారు అనేది ఎంచుకోవాలి. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మషన్, జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి ఎంపిక చేసుకుని, ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని బుక్ చేసుకోవాలి. రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ చార్జెస్ & రద్దు చేసుకునే విధానం ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జ్ రిటైరింగ్ రూమ్‌కు 24 గంటల వరకు రూ.20, డార్మిటరీ బెడ్‌కు 24 గంటల వరకు రూ.10 ఉంటుంది. అదే సమయంలో రిటైరింగ్ రూమ్ 24 గంటల నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధరలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక వేళా 48 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది. రూమ్ తీసుకునే రోజు రద్దు చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఉంటుంది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) గుర్తుంచుకోవలసిన విషయాలు ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. వెయిట్-లిస్ట్‌లో ఉన్నప్పుడు రూమ్‌లను బుక్ చేసుకోవడం కుదరదు. ఆన్లైన్లో బుకింగ్ చేస్తే, క్యాన్సిల్ కూడా ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒక వేళా ట్రైన్ రద్దు అయితే, నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన డబ్బు తిరిగి వాపసు పొందుతాడు. -
శ్రీవారి భక్తులకు సులభంగా అద్దె గదులు
తిరుమల: శ్రీవారి భక్తులకు సులభంగా, త్వరితగతిన అద్దె గదులు కల్పించాలని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో సమీక్షించారు. ఈవో మాట్లాడుతూ తిరుమలలో అద్దె గది కోసం ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సంబంధిత గదుల స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అలిపిరి టోల్గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలిపిరి టోల్గేట్ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్ఎంఎస్లు వస్తాయన్నారు. భక్తులు నేరుగా సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని సూచించారు. అనంతరం టీటీడీ కాల్ సెంటర్ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ గదుల కేటాయింపుల్లో మార్పులు
తిరుపతి తుడా: తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో భక్తుల సౌకర్యార్థం గదుల కేటాయింపుల్లో టీటీడీ స్వల్ప మార్పులను తీసుకురానుంది. తిరుపతిలో ఉన్న విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో జూలై 1 నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి విష్ణు నివాసంలోని అన్ని గదులను కరెంటు బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ గదులు పొందిన భక్తులు 24 గంటల్లో ఖాళీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం సముదాయాల్లో అన్ని గదులను ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ రెండు వసతి సముదాయాల్లోనూ 24 గంటల స్లాట్ విధానం అమలు కానుంది. బుక్ చేసుకున్న సమయానికి ఆలస్యంగా చేరుకున్నా.. నిర్ణీత సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం అతిధి గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, స్థానికులు గదులు పొంది బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 4న శ్రీవారి విగ్రహానికి శిలా సంగ్రహణం ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుపతి సమీపంలోని రామాపురం గ్రామం వద్ద జూలై 4న శిలా సంగ్రహణం నిర్వహించనున్నట్లు తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని జేఈవో నివాసంలో శుక్రవారం శిలా సంగ్రహణంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లక్ష్మీకాంతం మాట్లాడుతూ..4న ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు శిలా సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. టీటీడీ ఆగమ సలహాదారులు, అర్చకులు, స్తపతి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. -
సామాన్యులకు అందుబాటులో గదులు
► వేసవి సెలవుల్లో ఇబ్బందుల్లేకుండా టీటీడీ ఏర్పాట్లు ► రికార్డు స్థాయిలో గదుల బుకింగ్ ► వందశాతం గదుల కేటాయింపుపై ఉన్నతాధికారుల కసరత్తు సాక్షి, తిరుమల : వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ఎవరి సిఫారసు లేకుండానే సామాన్య భక్తులకు సైతం గదులు సులభంగా లభిస్తున్నాయి. గడిచిన 22 రోజుల్లోనే సాధారణ, వీఐపీ ప్రాంతాల్లో ఉండే గదుల్లో సుమారు 90 శాతం వరకు భక్తులకు కేటాయిస్తున్నారు. గదుల బుకింగ్లోనూ, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియలోనూ పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు చేపట్టారు. దీనివల్ల సామాన్య భక్తులు సైతం ఎక్కడి నుంచైనా గదులు సులభంగా పొందే సౌకర్యం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నుంచి 22 వ తేదీ వరకు అంటే 22 రోజుల్లో 81 శాతం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 91 శాతం గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీఐపీలుగా పరిగణించే ఉన్నత వర్గానికి చెందిన భక్తులు బసచేసే పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో 498 గదులున్నాయి. ఇక్కడ కూడా గత ఏడాది 57శాతం మాత్రమే భక్తులు గదులు పొందారు. కొత్త నిబంధనల వల్ల 78శాతానికి పెరగడం విశేషం. గదుల బుకింగ్ శాతం పెరగటంతో అద్దెల ద్వారా వచ్చే రాబడి కూడా పెరిగింది. 22 రోజుల్లో సుమారు రూ.75 లక్షలు దాకా అదనంగా ఆదాయం లభించింది. ప్రస్తుతం రిసెప్షన్ ద్వారా టీటీడీకి ఏడాదిలో రూ.98.5 కోట్లు లభిస్తోంది. తాజా నిబంధనల వల్ల మరో రూ.10 నుంచి రూ.12 కోట్ల దాకా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుండటం విశేషం. ఈవో సూచనలు..సిబ్బంది చిత్తశుద్ధి సామాన్య భక్తులకు సులభంగా గదులు లభించాలన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఈవో సూచనలు అమలు చేశాం. అందుకనుగుణంగా రిసెప్షన్ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందువల్లే గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. తద్వారా టీటీడీకి కూడా రాబడి పెరిగింది. ఈ వేసవిలో వందశాతం గదుల బుకింగ్ కోసం అధికారి నుంచి అటెండర్ స్థాయి వరకు అందరం కలసి పనిచేస్తాం. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం. - కేఎస్.శ్రీనివాసరాజు,తిరుమల జేఈవో