సామాన్యులకు అందుబాటులో గదులు | TTD rooms booking for common devotees | Sakshi
Sakshi News home page

సామాన్యులకు అందుబాటులో గదులు

Published Sat, Apr 25 2015 3:34 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

సామాన్యులకు  అందుబాటులో గదులు - Sakshi

సామాన్యులకు అందుబాటులో గదులు

వేసవి సెలవుల్లో ఇబ్బందుల్లేకుండా టీటీడీ ఏర్పాట్లు
రికార్డు స్థాయిలో గదుల బుకింగ్
వందశాతం గదుల కేటాయింపుపై ఉన్నతాధికారుల కసరత్తు

 
 సాక్షి, తిరుమల : వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ఎవరి సిఫారసు లేకుండానే సామాన్య భక్తులకు సైతం గదులు సులభంగా లభిస్తున్నాయి. గడిచిన 22 రోజుల్లోనే సాధారణ, వీఐపీ ప్రాంతాల్లో ఉండే గదుల్లో సుమారు 90 శాతం వరకు భక్తులకు కేటాయిస్తున్నారు. గదుల బుకింగ్‌లోనూ, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియలోనూ పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు చేపట్టారు. దీనివల్ల సామాన్య భక్తులు సైతం ఎక్కడి నుంచైనా గదులు సులభంగా పొందే సౌకర్యం లభించింది.
 
గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నుంచి 22 వ తేదీ వరకు అంటే 22 రోజుల్లో 81 శాతం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 91 శాతం గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీఐపీలుగా పరిగణించే ఉన్నత వర్గానికి చెందిన భక్తులు బసచేసే పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో 498 గదులున్నాయి. ఇక్కడ కూడా గత ఏడాది 57శాతం మాత్రమే భక్తులు గదులు పొందారు. కొత్త నిబంధనల వల్ల 78శాతానికి పెరగడం విశేషం.

గదుల బుకింగ్ శాతం పెరగటంతో అద్దెల ద్వారా వచ్చే రాబడి కూడా పెరిగింది. 22 రోజుల్లో సుమారు రూ.75 లక్షలు దాకా అదనంగా ఆదాయం లభించింది. ప్రస్తుతం రిసెప్షన్ ద్వారా టీటీడీకి ఏడాదిలో రూ.98.5 కోట్లు లభిస్తోంది. తాజా నిబంధనల వల్ల మరో రూ.10 నుంచి రూ.12 కోట్ల దాకా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుండటం విశేషం.

ఈవో సూచనలు..సిబ్బంది చిత్తశుద్ధి
సామాన్య భక్తులకు సులభంగా గదులు లభించాలన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఈవో సూచనలు అమలు చేశాం. అందుకనుగుణంగా రిసెప్షన్ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందువల్లే గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. తద్వారా టీటీడీకి కూడా రాబడి పెరిగింది. ఈ వేసవిలో వందశాతం గదుల బుకింగ్ కోసం అధికారి నుంచి అటెండర్ స్థాయి వరకు అందరం కలసి పనిచేస్తాం. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం.
 - కేఎస్.శ్రీనివాసరాజు,తిరుమల జేఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement