Common devotees
-
సామాన్యులకు అందుబాటులో గదులు
► వేసవి సెలవుల్లో ఇబ్బందుల్లేకుండా టీటీడీ ఏర్పాట్లు ► రికార్డు స్థాయిలో గదుల బుకింగ్ ► వందశాతం గదుల కేటాయింపుపై ఉన్నతాధికారుల కసరత్తు సాక్షి, తిరుమల : వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల ఎవరి సిఫారసు లేకుండానే సామాన్య భక్తులకు సైతం గదులు సులభంగా లభిస్తున్నాయి. గడిచిన 22 రోజుల్లోనే సాధారణ, వీఐపీ ప్రాంతాల్లో ఉండే గదుల్లో సుమారు 90 శాతం వరకు భక్తులకు కేటాయిస్తున్నారు. గదుల బుకింగ్లోనూ, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రక్రియలోనూ పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు చేపట్టారు. దీనివల్ల సామాన్య భక్తులు సైతం ఎక్కడి నుంచైనా గదులు సులభంగా పొందే సౌకర్యం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నుంచి 22 వ తేదీ వరకు అంటే 22 రోజుల్లో 81 శాతం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది 91 శాతం గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక వీఐపీలుగా పరిగణించే ఉన్నత వర్గానికి చెందిన భక్తులు బసచేసే పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో 498 గదులున్నాయి. ఇక్కడ కూడా గత ఏడాది 57శాతం మాత్రమే భక్తులు గదులు పొందారు. కొత్త నిబంధనల వల్ల 78శాతానికి పెరగడం విశేషం. గదుల బుకింగ్ శాతం పెరగటంతో అద్దెల ద్వారా వచ్చే రాబడి కూడా పెరిగింది. 22 రోజుల్లో సుమారు రూ.75 లక్షలు దాకా అదనంగా ఆదాయం లభించింది. ప్రస్తుతం రిసెప్షన్ ద్వారా టీటీడీకి ఏడాదిలో రూ.98.5 కోట్లు లభిస్తోంది. తాజా నిబంధనల వల్ల మరో రూ.10 నుంచి రూ.12 కోట్ల దాకా ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుండటం విశేషం. ఈవో సూచనలు..సిబ్బంది చిత్తశుద్ధి సామాన్య భక్తులకు సులభంగా గదులు లభించాలన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఈవో సూచనలు అమలు చేశాం. అందుకనుగుణంగా రిసెప్షన్ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అందువల్లే గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. తద్వారా టీటీడీకి కూడా రాబడి పెరిగింది. ఈ వేసవిలో వందశాతం గదుల బుకింగ్ కోసం అధికారి నుంచి అటెండర్ స్థాయి వరకు అందరం కలసి పనిచేస్తాం. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం. - కేఎస్.శ్రీనివాసరాజు,తిరుమల జేఈవో -
'మాకు సామాన్య భక్తులే విఐపిలు'
తమకు సామాన్య భక్తులే విఐపిలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ భూ ములు లీజు వ్యవహారంపై సాధ్యమైనంత త్వరలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. దేవాదాయాలకు చెందిన ఆస్తులు ద్వారా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. -
భక్తులకు పాద భాగ్యం
పాడేరు,న్యూస్‌లైన్: నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా ఆలయం అలంకరించారు. ఈ నెల 13న అనుపు ఉత్సవం ఉంటుంది. ఉత్సవ విగ్రహం, పాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్సవాల సమయంలో విగ్రహం, పాదాలను నెత్తిన పెట్టుకొని మోసే భాగ్యం ఉంటే అంతా మంచే జరుగుతుందనే నమ్మకం పూర్వం నుంచి భక్తుల్లో నెలకొంది. అయితే వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో సామాన్య భక్తులు ఉత్సవ విగ్రహం, పాదాలను తాకేందుకు కూడా వీలు లేని పరిస్థితి వారిని బాధిస్తోంది. లక్షలాది మంది భక్తులు ఉత్సవానికి తరలి వస్తున్నా అందరికి మోసే భాగ్యం మాత్రం లేదు. కానీ ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంతో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఉత్సవ కమిటీ వీఐపీలుగా గుర్తించడం లేదు. సామాన్య భక్తులే తమకు వీఐపీలని, అందరికీ ఉత్సవ విగ్రహం, పాదాలను మోసే అవకాశం కల్పిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణలు ప్రకటించారు. పోలీసుశాఖ కూడా రోప్‌వే ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహం, పాదాలను భక్తులు తాకే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.