Lord Buddha
-
బుద్ధుని తపస్సు ఎలా సాగింది? బుద్ధగయలో నేడు ఏం చేస్తారు?
బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ నాటికీ బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. బుద్ధ పూర్ణిమను ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పౌర్ణమిని మే 23న జరుపుకోనున్నారు. బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు.బీహార్‌లోని బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం కోసం బయలుదేరిన బుద్ధుడు గయలోని ధుంగేశ్వరి పర్వతంపై ఉన్న ప్రాగ్బోధి గుహకు చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆ గుహలో కఠిన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ తపస్సు సమయంలో, ఆయన ఆహారంతో పాటు నీటిని కూడా స్వీకరించలేదని చెబుతారు. ఫలితంగా బుద్ధుని శరీరం అస్థిపంజరంలా మారింది. నేటికీ అస్థిపంజరం రూపంలో ఉన్న బుద్ధుని విగ్రహం బుద్ధగయలో కనిపిస్తుంది. దుంగేశ్వరిలో మాతా దుర్గేశ్వరి ఆలయం ఉంది. అక్కడే బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది.బుద్ధుడు తన ధ్యాన సమయం ముగిశాక కాలినడకన ఇక్కడ నుండి బయలుదేరాడు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్రౌర్ గ్రామానికి చేరుకుని, అక్కడి మర్రిచెట్టు కింద తిరిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుజాత అనే మహిళ బుద్ధుని అస్థిపంజర రూపాన్ని చూసి, అతనికి ఒక కప్పు ఖీర్ అందించింది. దానిని స్వీకరించిన బుద్ధ భగవానుడు అక్కడ నుండి బుద్ధగయకు బయలుదేరాడని చెబుతారు.బుద్ధగయలోని ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాక పూర్ణిమ రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. పలువురు బౌద్ధ అనుచరులు ఇక్కడికి తరలివస్తారు. బుద్ధ భగవానుడు ఇక్కడ నుండే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. బుద్ధగయలోని మహాబోధి ఆలయం అంతర్జాతీయ వారసత్వ సంపదలో భాగంగా గుర్తింపు పొందింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే శ్రావ్యమైన కీర్తన ప్రతిధ్వనిస్తోంది. -
అమెరికాలో నేరాలు తగ్గించిన బుద్ధుడు!
అమెరికాలో ఒకప్పుడు నేరాలకు పేరుమోసిన ప్రాంతం అది. చుట్టుపక్కల జరిగే నేరాలకు విసిగి వేసారిన ఒక పెద్దమనిషి ఒక బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి, జనసంచారం బాగా ఉండే రహదారి పక్కన పెట్టాడు. అక్కడే బుద్ధుడి కోసం ఒక చిన్న ఆలయం నిర్మించాడు. రహదారి పక్కన బుద్ధుడిని నెలకొల్పిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ విడ్డూరం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ నగరం ఈస్ట్‌లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈస్ట్‌లేక్ ప్రాంతంలో పదిహేనేళ్ల కిందటి వరకు తరచు నేరాలు జరిగేవి. దుండగులు వీథుల పక్కనే ప్రమాదకరమైన వస్తువులను పడేసేవారు. తరచు చోరీలకు తెగబడుతుండేవారు. ఈ పరిస్థితులతో బాగా విసిగిపోయిన డాన్ స్టీవెన్సన్ అనే పెద్దమనిషి స్థానికంగా ఉన్న ఒక దుకాణం నుంచి బుద్ధుడి విగ్రహాన్ని కొనుక్కొచ్చి, వీథి పక్కనే పెట్టాడు. బుద్ధుడికి నీడ కల్పించడానికి చిన్న గుడి కట్టాడు. ఇదంతా 2009లో జరిగింది. క్రమంగా జనాలు ఇక్కడి బుద్ధుడిని దర్శించుకుని, ప్రార్థనలు జరపడం మొదలైంది. అప్పటి నుంచి ఈస్ట్‌లేక్ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి క్రైమ్ రికార్డ్స్‌ను గమనిస్తే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య 82 శాతం మేరకు తగ్గిపోయినట్లు స్థానిక పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇంతకీ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టిన డాన్ స్టీవెన్సన్ బౌద్ధుడు కాదు సరికదా, మతాలపై విశ్వాసమే లేని నాస్తికుడు కావడం విశేషం. మొత్తానికి పోలీసులు చక్కదిద్దలేని పనిని బుద్ధుడు చక్కదిద్దాడు. -
బుద్ధుడి బోధనలు ఇప్పుడు మరింత ఆచరణీయం
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళి కోవిడ్ అనే మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో బుద్ధ భగవానుడి బోధనలు మరింతగా ఆచరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఆషాఢ పూర్ణిమ, ధమ్మచక్ర దినం సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశమిచ్చారు. బుద్ధుడు బోధించిన మార్గంలో నడుస్తూ కఠిన సవాలును ఎలా అధిగమించాలో ప్రపంచానికి భారత్ ఆచరణలో చూపుతోందని అన్నారు. బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తన శిష్యులకు సందేశమిచ్చిన తొలిరోజును ధమ్మచక్ర దినంగా బౌద్ధులు జరుపుకుంటారు. ప్రస్తుత కష్టకాలంలో తథాగతుడి ఆలోచనా విధానానికి ఉన్న శక్తిని ప్రపంచం చక్కగా అర్థం చేసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచానికి సంఘీభావంగా ఇంటర్నేషనల్ బుద్ధిస్టు కాన్ఫెడరేషన్ ‘కేర్ విత్ ప్రేయర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. ‘‘శత్రుత్వాన్ని శత్రుత్వంతో అణచివేయలేం. ప్రేమ, దయార్ధ్ర హృదయంతోనే అది సాధ్యం’’అన్న ధమ్మపదంలోని సూక్తిని మోదీ గుర్తుచేశారు. మన బుద్ధి, మన వాక్కు, మన ప్రయత్నం, మన కార్యాచరణ మధ్య సామరస్యం మనల్ని సంతోషాల తీరానికి చేరుస్తుందని వివరించారు. బుద్ధుడి ఆశయాలు తనకు సంతోష, విషాద సమయాల్లో ప్రజలకు మేలు చేయడానికి ఎనలేని ప్రేరణ ఇస్తున్నాయని తెలిపారు. అనుకున్నది సాధించడానికి బుద్ధుడు మనకు అష్టాంగ మార్గాన్ని బోధించాడని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. -
అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి..
కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. కుశల ధర్మాలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి. అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది. కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. నడవాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి... ‘భగవాన్! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి. వానినుండి ఎలా బైటపడగలం’’ అని అడిగేవారు. అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి. అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి. మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు! – డా. బొర్రా గోవర్ధన్ -
వేసాక్ డే వేడుకల్లో పాల్గొన్న మోదీ
కొలంబో : రెండురోజుల శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ వేసాక్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మోదీకి శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బౌద్ధుల అతి పెద్ద ఉత్సవం అయిన వేసాక్ డే ఉత్సవాలు ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో తొలిసారి కొలంబోలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను ఏటా బౌద్ధ మతస్థులున్న దేశాల్లో జరుపుకుంటారు. మే నెలలో నిండు చంద్రుడు కనిపించే రోజున బుద్ధునికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి చైనా, భారత్, జపాన్ , థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, లావోస్, టిబెట్ , భూటాన్, తదితర బౌద్ధ ప్రధాన దేశాల నుంచి వేయికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం భారత సంతతికి చెందిన తమిళులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. కాగా ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇది రెండోసారి. -
యుద్ధక్షేత్రంలో శాంతి సందేశం
సందర్భం- 14 న బుద్ధపూర్ణిమ మానవుడు తన శక్తియుక్తుల్ని సమసమాజాల కోసం, శాంతి సుఖాల కోసం వెచ్చించాలి అనే అహింసా సందేశాన్ని ఈ అవనికి అందించిన అజరామరుడు గౌతమబుద్ధుడు. బుద్ధుడు ఒక శాంతి ప్రదాతే కాదు! శాంతి దూత కూడా. అహింస, శాంతి అనే మానవీయ విలువల్ని ప్రపంచానికి అందించిన దేశం మనది. సాటి మనుషుల్ని మనుషులుగా చూడడమొక్కటే ‘మానవీయం’ కాదని; సమస్త జీవకోటిని, చరాచర ప్రపంచాన్ని ప్రకృతినీ ప్రేమతో చూసినప్పుడే అది మానవీయత అవుతుందని ప్రపంచానికి చాటిన బుద్ధ భగవానుడు పుట్టిన పుణ్యభూమి ఇది. సంపదల కోసం, అధికారం కోసం మానవ రక్తాన్ని ఏరుల్లా పాలించిన ఈ ప్రపంచానికి మనిషి మనిషిగా బ్రతకడానికి, ఈ సృష్టిలో ఒక ‘మంచి’ జీవిగా మనుగడ సాగించడానికి బుద్ధుడు ప్రబోధించిన శాంతి సందేశం ఒక వరం. ‘‘రణరక్తం కాని చోటు భూస్థలమంతా వెదకినా దొరకదు.. గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీరులతో....’’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక వ్యక్తి మరోవ్యక్తిని, ఒక జాతి మరో జాతిని, ఒక దేశం మరో దేశాన్ని... ఇలా చంపుకుతిన్న దాఖలాలు చరిత్ర నిండా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల నరమేధం తర్వాత అణుబాంబు ఫార్ములా సృష్టికర్త అయిన ఐన్‌స్టీన్‌ని ఒక విలేకరి ఇలా అడిగాడు - ‘‘సర్, ఇప్పుడే ఇలా ఉంది. ఇక, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎంత వినాశనం జరుగుతుంది?’’ అని. దానికి ఐన్‌స్టీన్, ‘‘మూడో ప్రపంచ యుద్ధం సంగతి అయితే నాకు తెలియదు. నాలుగో ప్రపంచ యుద్ధాన్ని మాత్రం ఆటవిక మానవులు కర్రల్తో చేసుకుంటారు’’ అన్నాడు. అంటే ప్రపంచం యుద్ధో న్మాదంతో సర్వనాశనం అవుతుందని ఆయన ఉద్దేశం. యుద్ధాలకి మానవుని పచ్చి ‘దురాశే’ కారణమని బుద్ధుని అభిప్రాయం. ‘ఆశ’ వల్లే మానవ జాతి దుఃఖసాగరంలో పడి మునిగి పోతోందనేది బుద్ధుని ఆలోచన. ఈ ఆశ, దురాశలు దూరం చేసుకుంటే సమాజంలో శాంతి జీవనం నెలకొంటుందని ఆయన ప్రబోధించాడు. ప్రజలు శాంతియుత జీవనం సాగించాలంటే పంచశీలతను పాటిస్తూ ‘అష్టాంగ మార్గం’ అవలంబించాలని సూచించాడు. బుద్ధుడు గొప్ప ధర్మ ప్రవక్త. ఈర్ష్యలు, ద్వేషాలు, మోహాలు, మత్సరాలు, అహంకారాలు, అణచివేతలు లేని సమ సమాజం కోసం కుటుంబాన్ని, రాజ్యాన్నీ, రాజ్యాధికారాన్నీ, అన్నింటినీ త్యజించి, నలభై ఏళ్లపాటు కాలినడకన దేశం మొత్తం తిరిగి తన శాంతి సందేశాన్ని గ్రామ గ్రామాన వినిపించాడు. బుద్ధుడు కేవలం బోధనలతో సరిపెట్టుకున్న ప్రవక్త మాత్రమే కాదు. అహింస, శాంతి, సమత నెలకొల్పడానికి అహరహం కృషి చేశాడు. ఎన్నో హింసల్ని నిలువరించాడు. ఎన్నో యుద్ధాల్ని జరక్కుండా చూశాడు. బుద్ధుడు స్వయంగా యుద్ధ క్షేత్రాల మధ్య నిలబడి అడ్డుకున్న యుద్ధాలూ ఉన్నాయి! యుద్ధాలను నివారించాక గౌతముడు సర్వాన్నీ త్యజించి, ధ్యానం చేసి, జ్ఞానం పొంది, బుద్ధునిగా మారాడు. మరలా ఎనిమిదేళ్ల తర్వాత ఆ రెండు రాజ్యాల మధ్య అదే సమస్యలవల్ల యుద్ధం ఖాయం అయ్యింది. ఈ విషయం బుద్ధునికి తెలిసింది. అప్పుడు బుద్ధుడు రాజగృహలో ఉంటున్నాడు. విషయం తెలిసి హుటాహుటిన బయలు దేరాడు. అప్పటికే యుద్ధం మొదలైంది. ఇరు రాజ్యాల సైనికులు లుంబిని ప్రాంతంలో కలబడ్డారు. బుద్ధుడు నిస్సంకోచంగా యుద్ధ క్షేత్రం మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు. ఇరు సైనికుల్ని శాంతింప చేశాడు. ఆయనకి ఒక వైపు తన తండ్రి వంశం వారు. మరోవైపు తన తల్లి వంశం వారు. ఇరు గణనాయకుల్ని పిలిపించాడు. ‘‘ఓ! గణవీరులారా! మీరెందుకిలా చీటికి మాటికి యుద్ధానికి తలపడుతున్నారు. పెద్దలందరూ కూర్చొని, నీటి పంపక విషయంలో కొన్ని విధివిధానాలు ఏర్పాటు చేసుకోవచ్చుగదా! ఆ నియమాల్ని ఏ ఒక్కరూ అతిక్రమించకుండా నడచుకుంటే ఇరు రాజ్యాలు క్షేమంగా, శాంతంగా, సుఖంగా ఉంటాయి గదా! ఈ పని చేయకుండా నీటికోసం, రక్తాన్ని ధారపోస్తున్నారా? మీకు నీరు ముఖ్యమా! రక్తం ముఖ్యమా! మీ వీరత్వాన్ని ప్రజలందరూ సుఖంగా బ్రతకడం కోసం వినియోగించండి. ప్రకృతి కల్గించే ఇబ్బందుల పరిష్కారం కోసం ఎంతో విలువైన మీ ప్రాణాల్ని, రక్తాన్నీ ధారపోయకండి. రాజ్యాన్ని శోకజలంతో నింపకండి. శాంతించండి. శాంతి చర్చలు జరపండి. యుద్ధాన్ని ఆపండి. ఆయుధాలు పడేయండి. ఆనకట్టలు కట్టి వరద జలాన్ని వృధా చేయకుండా రక్షించుకోండి. మీ శక్తి యుక్తులు ‘నిర్మాణానికి’ ఉపయోగించండి. వినాశకానికీ, విధ్వంసానికీ కాదు-’’ అని గొప్ప సందేశం ఇచ్చాడు. శాంతి ఉపదేశం ప్రబోధించాడు. అదే విధంగా మగధరాజు అజాతశత్రువు, కోసలరాజు ప్రసిద్ధ జిత్తుల చేత ఎన్నో యుద్ధాల్ని ఆపించాడు. ఈ ప్రపంచం అనవసరపు యుద్ధాల ద్వారా ఎన్నో కోట్ల మానవుల్ని బలి తీసుకుంది. అంటే ఎంత ‘మానవసంపద’ హరింపబడిందో కదా. - బొర్రా గోవర్ధన్ బుద్ధుని వల్లే ఆ యుద్ధం ఆగిపోయింది! బుద్ధుని కాలంలో మన దేశంలో పదహారు రాజ్యాలుండేవి. వీటిని షోడశ మహా జనపథాలు అనేవారు. వీటిలో చాలా రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు. కోసల, మగధలు మాత్రమే రాచరిక రాజ్యాలు. బుద్ధుడు శాక్యవంశం వాడు. బుద్ధుని తల్లి మాయాదేవి ‘కొలియ’ వంశం ఆడపడుచు. శాక్యులవీ, కొలియులవీ వేరు వేరు గణ రాజ్యాలు. ఈ రెండు రాజ్యాల మధ్యగా రోహిణి నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఎగువన కొలియ రాజ్యం, దిగువన శాక్య రాజ్యం ఉండేవి. వర్షాలు బాగా పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరంతా లోతట్టుకు ప్రవహించి శాక్యరాజ్యం వరదల పాలయ్యేది. అలాగే వర్షాభావం ఏర్పడినప్పుడు కొలియులు కిందికి నీరు రానిచ్చేవారు కాదు. దానితో శాక్యుల పంటపొలాలన్నీ ఎండిపోయేవి. ఈ విషయం మీద వాగ్వివాదాలు పెరిగి ఇరు రాజ్యాలకీ యుద్ధం వచ్చింది. ‘చర్చల’ ద్వారా పరిష్కరించుకునే ఈ సమస్యను యుద్ధందాకా లాక్కెళ్లడం బుద్ధునికి ఇష్టం లేదు. ఒక యువరాజుగా సైన్యాన్ని నడిపించాల్సిన వాడే యుద్ధాన్ని వ్యతిరేకించాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందా మన్నాడు. అలాగని, బుద్ధుడు పిరికివాడు కాదు. యుద్ధ కళలన్నింటిలో, అన్ని గణరాజ్యాల యువకులందరి కంటే మేటిగా నిలచిన వాడే! యుద్ధం వద్దన్న విషయంపై సొంత గణం వారు బుద్ధుణ్ణి ఎంతో నిందించారు. అయినా, ఆయన మనస్సు యుద్ధాన్ని వ్యతిరేకించింది. ఇంతలో వర్షాలు పడ్డాయి. దానితో యుద్ధం ఆగిపోయింది.