అమెరికాలో ఒకప్పుడు నేరాలకు పేరుమోసిన ప్రాంతం అది. చుట్టుపక్కల జరిగే నేరాలకు విసిగి వేసారిన ఒక పెద్దమనిషి ఒక బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి, జనసంచారం బాగా ఉండే రహదారి పక్కన పెట్టాడు. అక్కడే బుద్ధుడి కోసం ఒక చిన్న ఆలయం నిర్మించాడు. రహదారి పక్కన బుద్ధుడిని నెలకొల్పిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఈ విడ్డూరం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్‌లాండ్ నగరం ఈస్ట్‌లేక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈస్ట్‌లేక్ ప్రాంతంలో పదిహేనేళ్ల కిందటి వరకు తరచు నేరాలు జరిగేవి. దుండగులు వీథుల పక్కనే ప్రమాదకరమైన వస్తువులను పడేసేవారు. తరచు చోరీలకు తెగబడుతుండేవారు. ఈ పరిస్థితులతో బాగా విసిగిపోయిన డాన్ స్టీవెన్‌సన్ అనే పెద్దమనిషి స్థానికంగా ఉన్న ఒక దుకాణం నుంచి బుద్ధుడి విగ్రహాన్ని కొనుక్కొచ్చి, వీథి పక్కనే పెట్టాడు.
బుద్ధుడికి నీడ కల్పించడానికి చిన్న గుడి కట్టాడు. ఇదంతా 2009లో జరిగింది. క్రమంగా జనాలు ఇక్కడి బుద్ధుడిని దర్శించుకుని, ప్రార్థనలు జరపడం మొదలైంది. అప్పటి నుంచి ఈస్ట్‌లేక్ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి క్రైమ్ రికార్డ్స్‌ను గమనిస్తే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య 82 శాతం మేరకు తగ్గిపోయినట్లు స్థానిక పోలీసు అధికారులే చెబుతున్నారు.
ఇంతకీ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టిన డాన్ స్టీవెన్‌సన్ బౌద్ధుడు కాదు సరికదా, మతాలపై విశ్వాసమే లేని నాస్తికుడు కావడం విశేషం. మొత్తానికి పోలీసులు చక్కదిద్దలేని పనిని బుద్ధుడు చక్కదిద్దాడు.
Comments
Please login to add a commentAdd a comment