ఆ రోజుల్లో పిల్లలకు కూడా సైనిక శిక్షణ ఇవ్వటం రివాజుగా వుండేది. దళాలుగా విభజించటం, ప్రత్యేకంగా హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చెయ్యటం, ప్రతి ఏడాదీ విన్యాసాలు చేయించటం అంతా యుద్ధరంగానికెళ్లే సైనికులకిచ్చిన ట్రెయినింగు లాంటిదే. పెద్దవాళ్లకు ఈ సైన్యంతో ఏ సంబంధమూ లేదు. అన్ని హోదాలలోనూ, వృత్తుల్లోనూ పిల్లలే. అయితే సైన్యానికి తగిన అభ్యర్థుల్ని ఎంపిక చెయ్యటం మాత్రంపెద్దల బాధ్యత. అలాగే శిక్షణ కోర్సు రూపొందించటంలో కూడా సీనియర్లు సలహాలివ్వటం తప్పనిసరి.ఈ మిలటరీ అకాడెమీకి దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి పిల్లాడి కలా అందులో చేరటమే. కాని ప్రవేశ పరీక్షలు మహా కఠినంగా ఉండేవి. శరీర దారుఢ్యం మాత్రమే కాదు, తెలివితేటల్ని కూడా పరిగణలోకి తీసుకునేవారు. పరీక్షరాయటానికి కనీస వయసు ఆరేడేళ్లుగా నిర్ధారించారు. ప్రవేశం సంపాదించిన వాళ్లకు అన్ని రంగాలలోనూ అద్భుత శిక్షణ దొరికేది. తరువాత జీవితంలో కూడా చిన్నప్పుడు ఇలాంటి ట్రెయినింగు తీసుకున్నానని చెప్పుకోవటం ఎవరికైనా గర్వకారణం. శిక్షణ కేంద్రాల నిర్వాహణలో, ప్రమోషన్లలో పెద్దల ప్రమేయం ఇసుమంతయినా ఉండదని మరోసారి చెప్పుకోవాలి. పద్నాలుగేళ్లు దాటిన వాళ్లకు అకాడెమీలోకి ప్రవేశం నిషిద్ధం. సైన్యం నాలుగు డివిజన్లతో త్రివిధ దళాలు, పదాతిదళం, లైట్ అల్టలరీ, మెడికల్ సర్వీస్ కాప్స్‌గా విస్తరించి ఉంది. అర్హులైన బాలికలకు సైన్యంలో నర్సులుగా, వాలంటీర్లుగా ఉద్యోగాలు దొరికాయి.ఒకసారి అకస్మాత్తుగా చిన్న పొరుగుదేశం కయ్యానికి కాలు దువ్వింది. ఎన్నో రెట్లు శక్తివంతమైన పెద్ద దేశంతో యుద్ధం ఎలా చెయ్యగలమని కూడా ఆ దేశ ప్రభువులు ఆలోచించలేదు. కాని ఎంత అవమానం! ఉఫ్ అంటే ఎగిరిపోయే బుడతలు తమను కవ్విస్తారా? సమవుజ్జీలతోనే యుద్ధం చెయ్యటం నీతిమంతుల లక్షణం. కాని చాలెంజ్ చేసినప్పుడు? గుణపాఠం నేర్పక తప్పదు. ‘‘పెద్దవాళ్లెందుకు? మేము చాలు,’’ అంటూ ముందుకొచ్చింది బాలసైన్యం.
ఇది సంచలన వార్త. పిల్లల శౌర్య పరాక్రమాలను కీర్తించారు కొందరు. హాహాకారాలు చేశారు మరికొందరు. తర్జన భర్జనల తర్వాత, యుద్ధం కాని ఈ యుద్ధానికి బాలసైన్యం చాలని నిర్ణయించింది ప్రభుత్వం.దేశమంతా మనసారా ఆశీర్వదించింది బాల సైనికుల్ని.విదేశాంగశాఖ పొరుగుదేశానికి ఆచరణీయం కాని ఒక ప్రతిపాదన పంపింది. వాళ్ల ప్రతిస్పందన కోసం నిరీక్షించకుండా ఇరవైనాలుగ్గంటల్లోనే సైన్యాన్ని సరిహద్దుల మీద మోహరించారు. ప్రతిపాదన అంగీకరించలేదని అధికారికంగా తెలిసిన క్షణాన యుద్ధం ప్రకటించారు. సైనిక పరాక్రమాన్ని గురించి ఎవరికే సందేహం లేదు. విజయం తథ్యం. రణభేరి మోగింది. జయజయ ధ్వానాలు మిన్నంటాయి. బాలయోధుల మీద పుష్ప వర్షం కురిసింది. కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ రాజధానిలో ప్రతిజ్ఞలు చేశారు. ‘‘శత్రువును తుదముట్టించిగాని తిరిగిరాం’’ అని. దేశం కోసం ప్రాణాలొడ్డటమే ప్రతి సైనికుడికి లభించగలిగిన అత్యున్నత గౌరవం. బాలవాక్కులు ప్రజలందర్నీ ఉత్తేజిత్తుల్ని చేశాయి. పన్నెండేళ్ల పసివాడు సైన్యానికి అధినాయకుడు. ఇప్పుడు దేశానికి సూపర్ హీరో. కాని అందరూ చిన్న పిల్లలు. వాళ్లను చూసి కంటతడి పెట్టని తల్లి లేదు. ఒక వైపు గర్వం, మరోవైపు దిగులు. సైనిక బ్యాండు మోగింది. శత్రుహననమే ఏకైక లక్ష్యంగా ముందుకు కదిలారు బాలలు.గుండెను కలిచివేసే దృశ్యాలెన్నో! తల్లి చేతుల్లో ఒదిగి నాలుగేళ్ళ కుర్రాడు ‘‘నేనూ యుద్ధానికి పోతాను’’ అంటూ మారాం చేశాడు. ‘‘నువ్వింకా చిన్న పిల్లాడివిరా’’ అంటూ ఎంత చెప్పినా వినడు. సాయంకాలపు పత్రికల నిండా ఇలాంటి హృదయ విదారకమైన వార్తా కథనాలే. అంతిమ విజయం గురించి ఎవరికీ సందేహం లేదు. ఉపన్యాసాలు, సైన్యం కదలిక వంటి కార్యక్రమమంతా రేడియోలో ప్రత్యక్ష ప్రసారమైంది. సైన్యం సరిహద్దులు దాటిన రోజు నుండే శత్రువు ఓటమి గురించిన సమాచారం వచ్చింది. ఒక సెక్టార్‌లో ఎదిరించిన వాళ్లందర్నీ నిశ్శేషంగా సంహరించారు పిల్లలు. ఈ అఖండ విజయానికి దేశమంతా పండగ చేసుకుంది. సంతోషంతో బాణాసంచా కాల్చారు. పత్రికల నిండా బాలల సాహసగాథలే. మృత్యుముఖంలో కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని పరాక్రమం. ప్రతి యుద్ధం కొత్త హీరోలను సృష్టిస్తుంది. అప్పటిదాకా నంబర్లుగా మిగిలిన పిల్లల పేర్లు ఇప్పుడు అందరికీ సుపరిచితం. ఆనందం పట్టలేక పిల్లల కోసం చాక్లెట్లూ, స్వీట్లూ పంపించారు తల్లులు. అవన్నీ ఏం చేసుకోవాలో తెలియక చివరికి సైనిక కమాండ్ అందరికీ విజ్ఞాపన చెయ్యాల్సి వచ్చింది. మరీ ఎక్కవగా తింటే యుద్ధపటిమ తగ్గిపోదూ! అపజయాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది.శత్రు భూభాగంలో బాగా లోపలిదాకా పురోగమించింది బాలసైన్యం. అక్కడక్కడా కొంత ప్రతిఘటన ఎదురు కాలేదని కాదు. అలాంటి సందర్భాల్లో వ్యూహరీత్యా బాల సైన్యం వెనక్కు తగ్గి తిరిగి మెరుపు దాడులు చేసింది.
జూలై నెలలో చివరిసారిగా చావు దెబ్బకు సర్వసన్నద్ధమైంది సైన్యం. రిజర్వు బలగాలు కూడా వచ్చి చేరాయి. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లలకు ఉత్సాహమెక్కువ. మృత్యుభయం ఉండదు. ఈ పర్యాయం నిర్ద్వంద్వంగా విజయం వరించింది. కాని భారీ నష్టం జరిగింది. పరాజితులైన శత్రువులు కాలికి బుద్ధి చెప్పారు. సైన్యం వాళ్లను తరిమి తుదముట్టించాల్సింది. శత్రువులు యువకులు. మధ్య వయస్కులు. వాళ్ల కాళ్లు పొడుగు. అంగలు పెద్దవి. పిల్లలకందకుండా తప్పించుకున్నారు. మొత్తమ్మీద యుద్ధంలో గుండెకాయ లాంటి సెంట్రల్ సెక్టార్ వీళ్ల వశమైంది. ఇక అవలీలగా రాజధానిని ముట్టడించవచ్చు.
భీకర యుద్ధం జరిగింది. ప్రతి పత్రికలోనూ యుద్ధ వార్తలే పతాక శీర్షికలు. రేడియోలో మిగతా కార్యక్రమాలన్నీ రద్దు చేసి గంటగంటకూ మారిన పరిస్థితిని ప్రసారం చేశారు. యుద్ధ విలేకరులు నిర్విరామంగా రిపోర్టు చేస్తూనే ఉన్నారు. బాలల పరాక్రమం వర్ణించనలవి కాదు. వీళ్ల ముందు పెద్దవాళ్ల ధైర్య సాహసాలు దిగదుడుపు. ఇందులో అత్యుక్తి ఎంత మాత్రం లేదు. ఎంత క్రమశిక్షణ! మృత్యువు వాళ్లకు భయపడి పారిపోయింది. కాళ్లు తెగిన వాళ్లు, పొట్టలు చీలి పేగులు బైటపడిన వాళ్లు ఎందరో! కాని ఎవరి మొహంలోనూ బాధలేదు. తుదిశ్వాస విడుస్తున్నప్పుడు కూడా శత్రు నిర్మూలనే లక్ష్యంగా ముందుకు లంఘించారు బాల సైనికులు. తమను పొడిచిన బాయ్‌నెట్లు లాక్కుని శత్రువు గుండెలు చీల్చారు. మాతృభూమి మీద జయకేతనం ఎగరవేయాలని చిరునవ్వుతో చివరి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఎదురెదురుగా యుద్ధం చేసినప్పుడు హతులైన పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. నాలుగు వేల మంది శత్రువులూ, ఏడు వేలమంది బాల సైనికులూ నేలకొరిగారు. ఇదంతా రహస్య నివేదికల అంచనా. విజయం దక్కింది గాని చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఈ యుద్ధం గురించి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయొచ్చు. దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమది. పిల్లలు పెద్దవాళ్ళ కన్నా చాలా సమర్థంగా యుద్ధం చెయ్యటమే కాదు, వ్యూహ రచనల్లో కూడా తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. అయితే తాత్కాలికంగా పరాజయం అంగీకరించి, వెనక్కు తగ్గిన శత్రువును తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించిన వారూ ఉన్నారు. నిజమే. చివరి దశలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. విజయం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారినంత పనైంది. ఒకరకంగా చూస్తే శత్రువు యుద్ధానికి సన్నద్ధం కాలేదు. కాని పోరాట క్రమంలోనే కొత్త మెలకువలు నేర్చుకున్నట్టు అనిపించింది. ప్రతి యుద్ధమూ క్రితం దానికన్నా క్లిష్టతరంగా తయారైంది. ఎంత ధైర్య సాహసాలున్నా పిల్లలు పిల్లలే. ఒక బాయ్‌నెట్ పోటుతో ఇద్దరు ముగ్గుర్ని నేల కూల్చవచ్చు. ఇక ఎదురెదురు పోరాటంలో గట్టిగా తన్నినా పిల్లలు కింద పడక తప్పదు.
అయితే బాల సైన్యానికి సంఖ్యాబలం ఎక్కువ. అందువల్ల యుద్ధ రంగంలో ఎటుచూసినా వాళ్లే అన్నట్టుగా పోరాటం చేశారు. బుడతలు కదా. శత్రువుల కాళ్ల కిందికి దూరి గాయపర్చారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఎలాగో యుద్ధవ్యూహంలో వాళ్లు నేర్చుకోవడం వేరు. ఎదిరించటం వేరు. చిన్న చిన్న క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడం వేరు. పిల్ల రాక్షసులని వాళ్లకు పేరొచ్చిందంటే కారణముంది మరి.
బాల సైనికుల జయజయ ధ్వానాలతో పొరుగు దేశం మార్మోగిపోయింది. అక్కడి జనాభాకు ముద్దొచ్చే పసిపిల్లలేం కాదు వీళ్లు. ‘వయసుతో ప్రమేయమేముంది? శత్రువు శత్రువే– వీధుల్లో విజయ విహారం చేస్తున్నప్పుడు కాల్పులు జరిపారు. కొందర్ని పట్టుకుని శూలాలకు గుచ్చి ఎగరేశారు. మరి కొందరి కళ్లు పీకారు’ అని చెప్పుకున్నారు. యుద్ధంలో ‘నిజం’ ఎప్పుడూ ఎవరికీ తెలియదు. ఓడిపోయిన వాళ్లకు క్రౌర్యమెక్కువ. అణచుకోలేని కోపాన్ని, ద్వేషాన్ని అనేక వికృత పద్ధతుల్లో ప్రదర్శిస్తారు. తేళ్ల లాగ, జెర్రుల్లాగ, విషనాగుల్లాగ నేల ఈనినట్టుగా పిల్లలు! ఎంత మందిని చంపగలరు? కాలరాచినా మళ్ళీ మళ్ళీ పుట్టే కీటకాల్లాగ పడుతూ లేస్తూ పరిగెత్తుకొస్తూనే ఉన్నారు పిల్లలు. పసివాళ్లకు మాత్రం కోపం రాదా! ఊళ్లకు వూళ్లే తగలపెట్టారు. జనం గుమిగూడిన చోటల్లా తూటాలు కురిపించారు. కాని హింసవల్ల ఎప్పుడూ సద్దుమణగదు.
తమ పిల్లలు వీరమరణం పొందారని తెలిసి తల్లిదండ్రులకు నెత్తురు సలసలా కాగింది. పైన పరదేశంలో పరాజితులైన సైనికుల స్థానంలో గెరిల్లాలు పుట్టుకొచ్చారు. గెరిల్లాలు ఎదిరించి యుద్ధం చెయ్యరు. పొంచి ఉండి దొంగ దెబ్బ తీస్తారు. ఇలాంటి సంఘటనలు రోజూ పునరావృతమవుతున్నప్పుడే, ఆక్రమిత ప్రాంతంలో జరిగిన ఒక దారుణంతో దేశప్రజల కోపం హద్దులు తెంచుకుంది.గ్రామప్రాంతంలో గస్తీకి వచ్చిన ఒక బాల లెఫ్ట్‌నెంట్ కాలువ దగ్గర బట్టలుతుకుతున్న ఒక స్త్రీని ‘ఊరికి దారెటు?’ అంటూ అడిగాడు. అసలే సైనికుడు. చెబితే ఏం ఘాతుకం చేస్తాడోనని భయపడి,‘‘నీకెందుకు నాయనా? ఇంకా మీసాలైనా మొలవలేదు. మీ అమ్మ దగ్గరకెళ్లు’’ అంటూ మందలించింది ఆవిడ. కోపంతో రెచ్చిపోయిన లెఫ్ట్‌నెంట్ చంపటానికి కత్తి దూశాడు. కాని ఆమె ఆ కుర్రాణ్ణి ఒడుపుగా పట్టుకుని, మోకాళ్ల మీదికి వంచి దుడ్డుకర్రతో ముడ్డిమీద నాలుగు తగిలించింది. ఆ తర్వాత మన సైనికుడు చాలా రోజులపాటు కూర్చోవటానికి ఇబ్బంది పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి సిగ్గుతో ముడుచుకుపోయిన కుర్రాడు ఆమె వదిలిన తర్వాత తల వంచుకుని పరిగెత్తాడు. అవమానంతో ఎవరి కంటా పడలేదు. కాని ఆక్రమిత ప్రాంతంలో ప్రజల దుందుడుకు చర్యల గురించి కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపించాలని ఓ రూలుంది. అందువల్ల లెప్టినెంట్ అయిష్టంగానైనా ఈ సమాచారం చేరవేయక తప్పలేదు. యుద్ధంలో మరణం అనివార్యం. రెండు వైపులా నష్టాలుంటాయి. కాని ఇలాంటి అవమానాన్ని భరించడం అసాధ్యం.
‘విజేత’ మీద చేయి చేసుకున్న ఆ మహిళ శత్రుదేశ పౌరులకు హీరోయిన్‌గా మారింది. ఆమె ధీరోదాత్త చర్య జాతికి గర్వకారణమన్నారు. ఆమె గురించి గేయాలు, స్పెషల్ ఫీచర్స్, కథలు రాశారు. ఆదర్శమహిళగా కీర్తించారు. శత్రువులు ఆమెను వెంటనే కాల్చి చంపారని ఒక కథనమూ, దీర్ఘకాలం జీవించి అందరి మన్ననలూ అందుకున్నదని మరో కథనమూ ప్రచారంలో ఉన్నాయి. మొత్తం మీద ఈ సంఘటన వల్ల రెండు దేశాల మధ్య వైరం మరింత తీవ్రరూపం దాల్చింది. అంటే యుద్ధనీతిని మరిచి పరస్పరం వినాశనమే తమ లక్ష్యరూపం దాల్చింది. అంటే యుద్ధనీతిని మరిచి పరస్పరం వినాశనమే తమ లక్ష్యమని ప్రకటించుకున్నాయి. ఆకురాలు కాలం మధ్యలో హింస పరాకాష్ఠకు చేరుకుంది. అనేక సెక్టార్లలో ఒకర్నొకరు తెగనరుక్కున్నారు. కొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా మిగలలేదు. ఎక్కడా సైనికులు కనిపించకపోవటంతో యుద్ధం ముగిసింది కాబోలుననుకున్నారు సామాన్య పౌరులు. కాని అంతలోనే కొత్త బలగాలు వచ్చాయి. సమరం పునఃప్రారంభమైంది. కొన్నిసార్లు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శత్రువులను గుర్తించలేక సైనికులు తమవాళ్లనే చంపుకున్న సంఘటనలూ లేకపోలేదు. ఎవరి తూటాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. నలుదిశలూ శవాల గుట్టలు దర్శనమిచ్చాయి.యుద్ధం ముగిసింది. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. పైగా అదో ఆట. చీకట్లో, బురదలో, మురికిలో ఆడుతూ పాడుతూ గడిపారు.
శత్రువులకు మాత్రం ఇదంతా సుఖంగా లేదు. పెద్ద శరీరాలు కలుగుల్లో ముడుచుకుని ఎంతకాలం ఉండగలవు? బూడిదరంగు యూనిఫారాల్లో, మొహాలకు గ్యాస్ మాస్క్‌లతో ఇలాగే పుట్టాం కాబోలు అన్నట్టుగా నిర్విరామంగా కేరింతలు కొట్టారు పిల్లలు. ఎలుకల్లా చిన్న శరీరాలు. ఉన్న కాసింత చోటులో ఆటలాడుకున్నారు. దాడి జరిగినప్పుడు క్షణంలో తిరుగుకాల్పులు జరిపారు.శత్రువుకు అసలేం జరుగుతున్నదో అంతుపట్టలేదు. చిన్న పిల్లలకా సమస్య లేదు. వాళ్లు అర్థం చేసుకోకుండానే ప్రతిస్పందిస్తారు. అంటే పెద్దలకన్నా పిల్లలే మంచి సైనికులు. మృత్యుభయం కాదు, వినోదం ముఖ్యం వాళ్లకు. వార్ ఈజ్ ఫన్. సైనికుల్లో ఐకమత్యం అవసరం. జత కట్టడం బాలలకు సహజలక్షణం.చలికాలం మాత్రం కష్టాలు తప్పలేదు. శీతగాలికి తోడు కుండపోతగా వర్షం. కాని కష్టాల్లో ఉన్నామని కూడా చెప్పుకోలేని పసిపిల్లలు. దేశం మాత్రం వాళ్లకు బ్రహ్మరథం పట్టింది. సినిమా హాళ్లలో రోజూ బాలసైనికుల కవాతు దృశ్యాలు, కమాండర్ ఇన్ చీఫ్‌తో ఇంటర్వ్యూలు. జనం ఎగబడి చూశారు. క్రిస్మస్ సీజన్‌లో తల్లిదండ్రుల హృదయాలు పిల్లలకోసం తపించాయి. క్రిస్మస్ చెట్ల మీద ఎన్ని దీపాలు వెలగనీ–వాళ్లు లేని ఇల్లు ఎడారి. పిల్లలకు పండగ స్పృహ కూడా లేదు. సాయంత్రానికి గాని క్రిస్మస్ బహుమతుల పార్శెళ్లను తెరచి చూడలేదు. యుద్ధానుభవం వాళ్లలో బాల్యాన్ని హరించి వేసింది. శత్రువుల శరీరాలను తూటాలతో జల్లెడ చెయ్యటమే ఏకైక లక్ష్యం. అదే జీవితం. అందుకే మరణం. ఓ కుర్రాడు పాత జ్ఞాపకాలతో ఏడ్చాడు. వాణ్ణందరూ ‘పాలపీక’ అంటూ ఆట పట్టించారు. ఆ తర్వాత కోర్ట్ మార్షల్ చేశారు.
సుదీర్ఘ యుద్ధంలో శత్రువు మనోస్థైర్యం తగ్గింది. ఎన్నాళ్లు గడిచినా ‘విజయం’ కనుచూపు మేరలో కనిపించలేదు. కొత్త సంవత్సరం వచ్చింది. యుద్ధంలో నిర్ణాయకమైన దశ వచ్చింది. అత్యాధునిక సామూహిక మారణాయుధాలను సమకూర్చుకుంది బాలసైన్యం. రాత్రనక, పగలనక దళాల కదలికలు కొనసాగాయి. పిల్లలు ఓ సంవత్సరం ఎదిగారు. అంటే యుద్ధ విద్యలో మరింత ఆరితేరారు. శత్రువు కూడా చివరి ప్రయత్నంగా ప్రతిఘటన ప్రారంభించింది. అతి భీకర యుద్ధం జరిగింది. శవాలు, క్షతగాత్రులు, శతఘ్నులు, క్షిపణలు, ట్యాంకులు, ఇతర సాయుధ శకటాలు శత్రువును నిలబడనీయలేదు. ఇక శత్రువుది ఓటమినంగీకరించక తప్పని పరిస్థితి. కాని ఇంత త్యాగం చేసిన బాలసైన్యం లొంగిపోయిన వాళ్లను యుద్ధ ఖైదీలుగా అంగీకరించటానికి ఇష్టపడలేదు. బందీలలో చాలామందిని కాల్చివేశారు.ఆధునిక చరిత్రలో ఇది అత్యంత ప్రముఖ యుద్ధం. మిలటరీ అకాడమీలలో దీన్ని పాఠ్యాంశంగా చేర్చారు. వ్యూహ ప్రతివ్యూహాల్ని గురించి చర్చలు, పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా ‘శత్రువును చుట్టుముట్టి చంపటం ఎలా?’ అన్నది సైనికులందరూ తప్పక నేర్చుకోవల్సిన విషయం. డెబ్భై ఏళ్ల తర్వాత 2048లో జరిగిన యుద్ధంలో జనరల్ స్లడెల్‌స్నార్ప్ ఈ వ్యూహంతోనే స్లివోక్‌వార్క్‌ల మీద విజయం సాధించాడు.యుద్ధం ముగిసింది. మిగిలిన ఖైదీలతో బాలసైన్యం రాజధానిలో ప్రవేశించింది. స్వాగత తోరణాలు అలంకరించారు. వీధులలో విజయగీతాలు గానం చేశారు. పరాజితులకు ‘శాంతి షరతులు’ విధించవలసిన సమయం వచ్చింది. తల వొంచుకున్న శత్రు సైనికుల మీద, విజయోత్సాహంతో వెలిగిన బాలల మీద కెమెరాలు లెన్సులు గురి చేశాయి. రేడియోలో వీరి ఆగమన సందోహమంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కమాండర్ ఇన్ చీఫ్ షరతులొక్కొక్కటి చదివాడు.
పరాజితులు దేశం మీది సార్వభౌమాధికారం తమకు ధారాదత్తం చేయాలి. బందీల రక్షణ, పోషణ ఖర్చులు వాళ్లే భరించాలి. రెండు దేశాల యుద్ధ వ్యయం కూడా వాళ్లే చెల్లించాలి. ఆ ప్రభుత్వ తలబిరుసు నిర్ణయం వల్లే యుద్ధం జరిగింది గనుక ఇది తప్పదు. హాలులో çశ్మశాన నిశ్శబ్దం వ్యాపించింది. పెట్టమన్న చోటల్లా పరాజితులు సంతకాలు పెట్టారు. అప్పుడు వినిపించిన ఒకే ఒక శబ్దం బంగారు పాళీ కాగితం మీద చేసిన బరబర.ఇంత చరిత్రాత్మకమైన డాక్యుమెంటును జాతీయ మ్యూజియంలో భద్రపరచారు. యుద్ధం తర్వాత బాల సైనికులకు సెలవులిచ్చారు. ఇప్పుడు వాళ్ల అవసరం కూడా లేదు. చివరిగా రాజధాని వీధుల గుండా వాళ్లు చేసిన కవాతులో పిల్లలు ఎలుగెత్తి జై కొట్టారు. ముఖ్యంగా అంధులై కొందరు, కాళ్లూ చేతులూ తెగి కృత్రిమ అవయవాలు పెట్టుకున్న వాళ్లు కొందరు, అత్యంత సహజంగా ఉన్న ఈ అవయవాలను ప్రేక్షకులు గుర్తించలేకపోయారు.ఒక దేశ చరిత్రలో సువర్ణ ఘట్టాలనేకం ఉండొచ్చు కాని ఇంత అత్యద్భుతమైన, జాతికే గర్వకారణమైన క్షణం మరొకటి రాదు. ఆ రోజును ‘విజయదివస్’గా పండుగ చేసుకుంది దేశం.ప్రతి ఏడూ స్కూల్ పిల్లలు చేతుల్లో జాతీయ జెండాలతో మరసైనికుల సమాధులను దర్శిస్తారు. పిల్లలుగదా అతి చిన్న తెల్లటి శిలువలు.పూలు చల్లి, వాళ్ల త్యాగాన్ని గుర్తు చేసుకుని వస్తారు సందర్శకులు. మరో కొత్త యుద్ధం వస్తే సైన్యంలో చేరటానికి కొత్త తరం పిల్లలు సిద్ధంగా ఉన్నారు.
బాలసైన్యం
Published Sun, Mar 25 2018 1:10 AM | Last Updated on Sun, Mar 25 2018 1:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment