
బలూచిస్తాన్ మిలిటెంట్ల ప్రకటన
ఇస్లామాబాద్: తాము హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లోని 214 మందిని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) మిలిటెంట్లు ప్రకటించారు. మృతుల్లో పాకిస్తాన్ సైనికులతోపాటు సాధారణ ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. పాక్ జైళ్లలో ఖైదీలుగా ఉన్న తమ సహచరులను విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లు పేర్కొ న్నారు. వారి విడుదల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తమ వద్ద బందీలుగా ఉన్న 214 మందిని అంతం చేసినట్లు తెలియజేశారు. అయితే, దీనికి వారు ఎలాంటి ఆధారాలు చూపలేదు.
క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్‌ఏ మిలిటెంట్లు మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైలులో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. మిలిటెంట్ల దాడిలో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించినట్లు తొలుత వార్తలొచ్చాయి.
రైలును హైజాక్ చేసిన మిలిటెంట్లందరినీ హతమార్చి ప్రయాణికులను విడుదల చేసినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. అయితే, సైన్యం ప్రకటనను మిలిటెంట్లు కొట్టిపారేశారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టంచేశారు. మరోవైపు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ... 33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 354 మంది ప్రయాణికులను రక్షించామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు.. మొత్తం 31 మంది మృతిచెందారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment