తన కోపమే తన శత్రువు | His anger His enemy | Sakshi
Sakshi News home page

తన కోపమే తన శత్రువు

Published Sun, Apr 20 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM

తన కోపమే తన శత్రువు

తన కోపమే తన శత్రువు

 ప్రేరణ
 
 ‘తన కోపమే తన శత్రువు’ అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. కోపంతో శత్రువులను పెంచుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. క్షణికావేశం అంతులేని అనర్థాలకు దారితీస్తుంది. నిరర్థకమైన ఆగ్రహం నుంచి విముక్తి కోసం ప్రయత్నించాలి. తన శాంతమే తనకు రక్ష అనే సూక్తిని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆచరించాలి. ఎప్పుడూ కోపంతో మండిపడే తన కుమారుడికి ఓ తండ్రి ఎలా జ్ఞానోదయం కలిగించాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అతడి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకుందాం..
 
 ప్రతి చిన్న విషయానికి ఆవేశమొద్దు:

 న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరానికి సమీపంలో ఉండే నవయువకుడు మార్టిన్ ఎంతో చురుకైనవాడు. ఒళ్లు దాచుకోకుండా కష్టపడతాడు. కానీ అతడిలో ఉన్న దుర్గుణం ఏమిటంటే.. విపరీతమైన కోపం. ప్రతిచిన్న విషయానికీ తీవ్ర ఆవేశానికి లోనవుతుంటాడు. కోపంతో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. స్నేహితులను, కుటుంబ సభ్యులను కఠినమైన పదజాలంతో దూషిస్తుంటాడు. అలాంటి మాటలు ఎంత చేటు చేస్తాయో కూడా కోపం కోరల్లో చిక్కిన మార్టిన్ గుర్తించలేడు. తన కుమారుడి కోపావేశాలు బాగా తెలిసిన మార్టిన్ తండ్రి.. అతడిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. మార్టిన్‌కు ఓ సంచి నిండా మేకులు ఇచ్చాడు. ఇకపై కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఇంటి వెనకున్న చెక్కలోకి దిగగొట్టమని సూచించాడు. అప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడోగానీ మార్టిన్ దీనికి వెంటనే అంగీకరించాడు. మొదటిరోజు అతడి ప్రకోపానికి 35 మేకులు ఖర్చయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ చెక్కలోకి దిగుతున్న మేకుల సంఖ్య క్రమంగా తగ్గసాగింది. ఎందుకంటే.. కోపం వచ్చిన ప్రతిసారీ మేకు, సుత్తి తీసుకొని ఇంటి వెనక్కి వెళ్లడం మార్టిన్‌కు కష్టంగా తోచసాగింది. దీనికంటే కోపాన్ని తగ్గించుకోవడమే సులభం అని అనిపించింది. దీనివల్ల అతడు ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు తగ్గాయి. చివరగా ఒకరోజు ఒక్క మేకుకు కూడా పనిచెప్పే పరిస్థితి రాలేదు. అంటే.. ఆ రోజు అతడికి ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఈ పరిస్థితి మార్టిన్‌కు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. తనలో వచ్చిన మార్పును నమ్మలేకపోయాడు. వెంటనే తండ్రికి ఈ విషయాన్ని తెలిపాడు.
 
అనకూడని మాటలతో ప్రతికూల ప్రభావాలెన్నో:

 
కుమారుడికి నేర్పాల్సిన పాఠం ఇంకా మిగిలే ఉండడంతో.. తండ్రి ఇప్పుడు మార్టిన్‌కు మరో పని అప్పజెప్పాడు. అదేమిటంటే.. ఒక్కసారి కూడా కోపం రాని రోజు ఒక్కో మేకును చెక్కలోంచి బయటకు తీయమని సూచించాడు. మార్టిన్ తన తండ్రి చెప్పినట్టే చేశాడు. రోజురోజుకి అతడు తీస్తున్న మేకుల సంఖ్య పెరగసాగింది. కొన్ని నెలల తర్వాత అన్ని మేకులు తిరిగొచ్చాయి. మార్టిన్‌కు ఇది మళ్లీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. మార్టిన్‌ను తండ్రి తమ ఇంటి వెనకున్న చెక్క దగ్గరికి తీసుకెళ్లాడు. ‘‘మార్టిన్! నువ్వు నేను చెప్పినట్లే చేశావు. నీవు చేసిన పనికి నేనెంతగా గర్విస్తున్నానో మాటల్లో చెప్పలేను. నీవు కొట్టిన మేకుల వల్ల చెక్కలో ఏర్పడిన రంధ్రాలను చూశావా? రంధ్రాలతో అందవిహీనంగా మారిన చెక్కను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమా? నీ కోపం కూడా అలాంటిదే. ఆవేశంలో ఒళ్లు మరిచి మాట్లాడే మాటలు వికృతమైన మరకలను సృష్టిస్తాయి. తర్వాత ఎన్నిసార్లు క్షమాపణలు కోరుకున్నా.. ఆ మరకలను చెరిపివేయలేం. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావని ఆశిస్తున్నా...’’ అంటూ మార్టిన్ తండ్రి తన హితబోధను పూర్తిచేశాడు. ఈ ఆచరణాత్మక బోధనతో మార్టిన్‌లో పూర్తిగా మార్పు కలిగింది.
 
 ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు:
 
మార్టిన్‌కు అతడి తండ్రి నేర్పిన పాఠం మనకు సైతం విలువైనదే. ఇది మనసులో నాటుకుపోతే ఇకపై అనర్థదాయకమైన కోపానికి గురయ్యే అవకాశం ఉండదు. ప్రశాంతచిత్తంతో వ్యవహరిస్తే అనుబంధాలు మెరుగవుతాయి. ఇరుగుపొరుగు మిమ్మల్ని కచ్చితంగా ఇష్టపడతారు. మిమ్మల్ని అమితంగా గౌరవిస్తారు. మీరు ప్రశాంతంగా ఉంటే ఇతరులు సైతం మీతో అలాగే ఉంటారు. ఈసారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. మార్టిన్ లాగా మేకులు దిగగొట్టడం లాంటి ఏదైనా ఒక చిన్న శిక్ష వేసుకోండి. ఆ శిక్ష అనుభవించడం కంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే సులభమని మీరు తప్పకుండా గుర్తిస్తారు. కోపంలో, ఆవేశంలో ఉన్నప్పుడు అనుకున్నది సాధించలేమన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
 
ఆవేశానికి లోనుకాకూడదు:
 
కాగితంపై పెన్సిల్‌తో రాసిన దాన్ని చెరిపేయాలనుకుంటే రబ్బర్(ఎరేజర్) ఉపయోగిస్తాం. అక్షరాలను చెరిపేసినా అక్కడ మరక మాత్రం పూర్తిగా పోదు. ‘క్షమాపణ’ కూడా ఎరేజర్ లాంటిదే. ఆవేశంలో తప్పుగా మాట్లాడి క్షమాపణలు కోరినంత మాత్రాన వ్యక్తులపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోనుకాకుండా అప్రమత్తంగా ఉండడమే సదా మంచిది.
 
 ఆవేశం వల్ల అనర్థాలెన్నో:
 
ఆధునిక ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుండడంతో మనుషులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అనకూడని మాటలు అంటే అవి వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతో నష్టాన్ని తెస్తున్నాయి. సెల్‌ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్ల వంటి వాటి విషయంలో జాగరూకత అవసరం. ఇతరులపై ఉన్న కోపంతో వారికి వ్యతిరేకంగా ఏదైనా సందేశాన్ని టైప్ చేసినప్పుడు వెంటనే పంపించకుండా కొద్దిసేపు ఓపిక పట్టండి. దాన్ని ‘డ్రాఫ్ట్ బాక్స్’కే పరిమితం చేయండి. ఆవేశపడి ‘సెండ్’ చేయొద్దు, దాని ఫలితం అనుభవించొద్దు. సహనం కోల్పోతే జీవితంలో ఎంతో పోగొట్టుకుంటామన్న విషయాన్ని తెలుసుకోవాలి.
 
 కోపం తెచ్చుకోనని బలంగా అనుకోండి:
 
ఈసారి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కొద్దిసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పండి. ఇకపై ఎప్పుడూ కోపగించుకోనని తీర్మానించుకోండి. కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం మీకు శత్రువుల్ని సృష్టించకుండా జాగ్రత్తపడండి. మీలో రావాల్సిన మార్పును ఈరోజే ప్రారంభించండి.
                          
‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement