మౌనంగా ఉండటం చాలా మందికి తెలీదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కొందరు పూజలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మత గ్రంథాలు చదువుతూ ఒక పక్క మాట్లాడుతూ మరోప్రక్క అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఉదయమే చదివితే చాలు అనే ధ్యాసలో ఉంటారు. మరి కొంతమంది ఎటువంటి పూజలు కాని మత గ్రంథాలు చదవటం కాని చేయరు. అనునిత్యం పైకి అనకుండా మనసులోనే తమ దైవాన్ని స్మరించుకుంటారు.
వారు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా ఎవరు ఏమైనా అంటే దానికి సమాధానం ఇవ్వకుండా ఉంటే మేలు. లేకపోతే మాటకు మాట పెరిగి వాగ్వివాదం పెరిగి చూసేవారికి అసహనం కలుగుతుంది. సమాధానం ఇవ్వకుండా ఉంటే మౌనంగా ఉండొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.
కొందరికి అన్ని కావాలి. ఎవరు, ఏమిటీ అని ఆరా తీస్తారు. అది వారి పెద్దరికానికి తగదు. పూజలు చేస్తేనే పుణ్యం అనే భ్రమలోనుంచి వారు బయటకు రావాలి. చేత కానప్పుడు మదిలోనే భగవంతుని స్మరించవచ్చు. అంతేకాని వితండవాదం చేయకూడదు. మన మాట పిల్లలు విననప్పుడు మనం మారు మాటాడకూడదు.
వారు ఏదయినా అడిగితేనే మనం సలహా ఇవ్వాలి. అయినా ఈ రోజులలో పెద్దల మాట ఎవరూ పట్టించుకోరు. మనం సాధ్యమైనంత వరకు మనసులోనే మౌనంగా మన ఇష్టదైవాన్ని తలచుకుంటే అదే పదివేలు. మౌనమే మనం అలవర్చుకోవాలి. మౌనాన్ని మించిన విద్య లేదు. మౌనం అన్నిటికి పరిష్కారం.
– కనుమ ఎల్లారెడ్డి, విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు
(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం)
Comments
Please login to add a commentAdd a comment