goodness
-
శుభమే జరిగేట్టు శ్రద్ధ వహిద్దాం!
ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏమిటి? ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ఎలాంటి వ్యక్తి ఐనా, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఐనా పొందాల్సింది ఏమిటి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి ఆశయాలు వారివి. మన అందరికీ అందాల్సిన వాటిల్లో ఏది అగ్రగణ్యమైంది? ఏది మనల్ని ఎప్పటికీ వీడిపోకుండా ఉండాలి? శుభం... శుభం... శుభం... ‘అథాతో బ్రహ్మ జిజ్ఞాస‘ అని బ్రహ్మ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం తెలియజెప్పింది. అంటే శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అని అర్థం. ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మం గురించిన జిజ్ఞాస ఎందుకు అంటే అది శుభం కాబట్టి. లౌకిక జీవనానికైనా, ఆధ్యాత్మిక జీవనానికైనా శుభమే మనిషికి లక్ష్యం; ఆ లక్ష్యానికి మనిషి లక్షణం. లక్ష్య, లక్షణ సమన్వితం జరగాలి. అంటే మనిషికి శుభం సమన్వితం అవ్వాలి. క్షేమం, మంగళం, మేలు, సౌఖ్యం ఇవి అన్నీ శుభం ఔతాయి. శుభం మనకు నిండుగా ఉండాలి. మనకు శుభం కలగడానికి, మనం శుభంతో మెలగడానికి మనకు మనమే ఆధారం. కనుక మనంత మనమై శుభం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం శుభం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి; మన ప్రయత్నాలకు ఫలితంగా మనం శుభాన్ని పొందుతూ ఉండాలి. శుభాలు ప్రభవించాలని ఎప్పుడైనా అకాంక్షించవచ్చు; ప్రభవించిన శుభాలు విభవాన్నివ్వాలని ఎవరైనా ఆశించవచ్చు. కానీ ఇంత వరకూ ఆ పని సరిగ్గా జరగలేదు. ఎవరూ ఆ పనిని సరిగ్గా చేసేందుకు ముందుకు రాలేదు. మనం శుభం కోసం పని చెయ్యాలి. మన కోసం శుభం పంట పండాలి. ఇకపైనైనా మనం శుభం కోసం పని చేద్దాం; ఇక అంతా శుభమయం కావడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ఆశపడి, ఆకాంక్షించి, ఆశించి మనం శుభాన్ని సాధించుకుందాం. కుత్సతం, మత్సరం, దాష్టీకం, దుర్మార్గం, ద్రోహం, వైరం, అసూయ, అక్కసు, బద్ధకం, నీరసం, అభిప్రాయాలు, మనో భావాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, అపార్థాలు, అవిద్య, మూర్ఖత్వం, దుశ్చింతన, బుద్ధిమాంద్యం ఇవన్నీ శుభాన్ని మనకు లేకుండా చేశాయి. వీటిని మనం వెనువెంటనే వదిలించేసుకోవాలి. మన చెడు నడతను మనం మార్చుకోవాలి; మనం మనస్తత్త్వంలో మానవత్వాన్ని చేర్చుకోవాలి; మనం మస్తిష్కంలో మంచితనాన్ని కూర్చుకోవాలి. శుభం కోసం మనం ఇకపై సవ్యంగా ఉండాలి. మనమే కాదు, మన పెద్దలు చేసిన తప్పులూ మనకు శుభాన్ని లేకుండా చేస్తున్నాయి; అవి మన సమాజంలో అశుభాన్ని రగిలిస్తున్నాయి; ఎప్పుడో ఎవరో చేసిన కుట్రలు ఇప్పటికీ శుభాన్ని రానివ్వకుండా ఇలాతలాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఈ స్థితిని సరిదిద్దుకుందాం; రానున్న ఆపదల్ని తొలగించుకుందాం; శుభాన్ని ఆవాహన చేసుకుని అందుకుందాం. ‘శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు తెలియజెప్పాక ‘సుఖ విశిష్టాభిధానాదేవ చ’ అని మరో బ్రహ్మసూత్రం మనకు ఉండాల్సిన తెలివిడిని ఇస్తూ ఉంది. విశిష్టమైన సుఖం ఇస్తుందని నిశ్చయంగా చెప్పబడినందువల్లే అది బ్రహ్మం అని ఆ సూత్రానికి అర్థం. సుఖం లేదా శుభం విశిష్టమైంది అన్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ విశిష్టమైన శుభాన్ని మనం పొందుతున్నామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని సరైన జవాబుగా మనం శుభాన్ని పొందాలి; పొందుదాం. సర్వత్రా శుభం నెలకొనాలి;సర్వులకూ శుభం వెల్లివిరియాలి.శుభం భూయాత్. ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు వీటివల్ల శుభం కలుగుతుంది, జరుగుతుంది అని మనం మన మనసు, మెదడులతో తెలుసుకోవాలి. మన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల వల్ల శుభం మాత్రమే జరిగేట్టు మనం శ్రద్ధ వహించాలి. శుభం కోసం మనం పూనుకోవాలి; శుభంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి – రోచిష్మాన్ -
మంచి మాట: ఉండాల్సిన లక్షణం
మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం. మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు. మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము. మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో? మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు. మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి. ‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది; నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది. మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. – రోచిష్మాన్ -
మంచి మాట: మౌనం మంచి భాషణం
మనిషిని అత్యంత శక్తిమంతునిగా చేసే ప్రక్రియలలో మౌనం ఒకటి. మాటలతో సాధించలేనిది, మౌనంతో సాధించవచ్చంటారు. వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి చెబుతోంది. వాక్కుని నియంత్రించడం, మాట్లాడటం తగ్గించడమే మౌనం. ఇది ఓ అపూర్వమైన కళ. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దివ్య శక్తినిస్తుంది. బాహ్య, ఆంతర్గత సౌందర్యాలను పెంచి, మనోశక్తులను వికసింప చేస్తుంది. ఎదుటివారిలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా, ఆధ్యాత్మికశక్తి ఉత్పన్నమై మనస్సుకి శాంతినిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. మౌనేన కలహం నాస్తి’ అన్నారు పెద్దలు. అంటే ‘మాట్లాడకుండా ఉండేవారికి గొడవలు రావు’ అని అర్థం. మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఓ సామెత కూడా ఉంది. మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకోవడం కంటే మౌనంతో ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని స్వామి వివేకానంద చెప్పారు. మౌనం ఇన్ని మహత్తర శక్తులనివ్వడం వల్లనే యోగసిద్ధాంతంలో పతంజలి మహర్షి మౌనానికి ప్రాధాన్యాన్నిచ్చారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారెందరో మౌనాన్నే ఆభరణంగా చేసుకుని భాసించారు. మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు సెలవిచ్చారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అనేక సంవత్సరాలు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరని ఆయన స్పష్ట్టం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ, టీవీలో కార్యక్రమాన్నిచూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ చేసేది మౌనం అనిపించుకోదు. ఆయా పనులు చేస్తున్నపుడు మన మనసు మన అధీనంలో ఉండదు. ఫలితంగా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి. ఇలా ఏదో పని చేస్తూ మౌనం పాటించడం వల్ల ఫలితం శూన్యం. మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండడం. కళ్ళుమూసుకుని మాటని, మనసుని ఓ పది నిమిషాల పాటు మౌనంలోకి జార్చడం. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనం రోజంతా రకరకాల మనుషులతో మాట్లాడతాం. ఈ క్రమంలో అనేక మాటలు, వాదనలు, కోపాలు, అరుపులతో గడిపేస్తాం. అక్కడితో అయిపోతుందా అంటే ఆగదు. అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటిని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని వదిలించుకోవచ్చు. అయితే ఇలా కనులు మూసుకున్నపుడు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు‘ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకుని మసలుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బుద్ధుని మాటల్లో చెప్పాలంటే, ‘మౌనం’ అంటే మంచి భాషణం. మంచి భావం. అంతేకాని మాట్లాడకపోవడం కాదు’. అందుకే మౌనం అనేది దైవభాషగా కొనియాడబడుతోంది. దీనిని లిపి లేని విశ్వభాషగా, ధార్మిక దివ్యత్వానికి ద్వారంగా చెబుతారు. మౌనమే దివ్యత్వ దర్శనానికి ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుందని జగద్గురు శంకరాచార్యుల వారు ప్రవచించారు. మానవుని ఆత్మశక్తిని పెంచే ఈ మౌనాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటిది వాగ్ మౌనం. వాక్కును నిరోధించడమే వాగ్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. దీని వల్ల పరుషమైన మాటలు, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు, అసందర్భ ప్రేలాపాలు హరించబడతాయి. రెండోది అక్షమౌనం. ఇది ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. మూడవది కాష్ఠమౌనం. ఇది మానసిక మౌనం. మౌన ధారణలో కూడా మనస్సు అనేక మార్గాలలో పయనిస్తుంది. దానిని కూడా నియంత్రించినప్పుడే కాష్ఠమౌనానికి మార్గం లభిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచడం దీని ముఖ్యోద్దేశం. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం. ఇలా మౌనంగా ఉండటం వల్ల చేయాల్సిన పనిమీద ఎక్కువ ఏకాగ్రత పెరుగుతుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
మంచితనాన్ని వాడేసుకుంటే ఎలా?
జీవన గమనం నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. నాకు జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆచార వ్యవహారాలన్నీ మా చెల్లెలు, బావగారి చేత చేయించాను. దుర దృష్టవశాత్తూ కొద్ది రోజుల తర్వాత మా బావ గారు ఓ ప్రమాదంలో చనిపోయారు. అందుకు కారణం నా పెళ్లి బాధ్యతలు తీసుకోవడమేనని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. అల్పజ్ఞానులు అనుకుందామంటే అమ్మాయి తండ్రి విద్యుత్ సంస్థలో మంచి స్థాయిలో ఉన్నవారు. ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి. - కృష్ణ, వికారాబాద్ ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నాడా, కింద స్థాయిలో ఉన్నాడా అన్నది కాదు చర్చ. మానసిక స్థాయి, హేతుదృష్టి (రేషనలిజం), పరిస్థితిని అర్థం చేసుకునే విధానం మొదలైనవన్నీ ఉద్యోగం మీద ఆధారపడి ఉండవు. ఆ సంగతి పక్కన పెడదాం. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... రేపు వాళ్ల ఇంట్లో ఏ అనర్థం జరిగినా, దానికి మిమ్మల్నే కారణ భూతుల్ని చేస్తారు. అంత దేబిరించుకుని వివాహం చేసుకోవలసిన అవసరం మీకుందా? లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి, మరొకరిని వివాహం చేసుకోవడానికి మీ మనసు అంగీకరించపోతుంటే... ఆమెతో డెరైక్ట్‌గా మాట్లాడండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి వచ్చి వివాహం చేసుకునే ధైర్యం ఆమెకు ఉంటే, ఆపై ఏం చేయాలా అని మీరు ఆలోచించుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. మీరన్నట్టు వాళ్లు అల్ప జనులే. మూర్ఖుల మనసు రంజింపజాలము అన్నాడో ప్రముఖ కవి. కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండటమే మంచిది. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. మరేదైనా చేయాలని పిస్తోందా అంటే అదీ లేదు. నా లక్ష్యం ఏమిటో, అసలు నాకు దేనిమీద ఆసక్తి ఉందో కూడా అర్థం కావడం లేదు. నా మెదడు ఎందుకిలా తెల్ల కాగితంలా తయారయ్యిందో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? - అంకిత్, చెన్నై మనం చేస్తున్న పని మీద ఉత్సాహం లేనప్పుడు మెదడు తెల్ల కాగితంలానే తయారవు తుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం తప్పు కాదు కానీ ఏ గమ్యం లేక పోవడం తప్పు. ప్రతి మనిషిలోనూ మరో మనిషి నిద్రిస్తూ ఉంటాడు. అతడిని నిద్ర లేపాలి. అతడికి ఇష్టమైన పనేదో తెలుసు కుని, దాన్ని హాబీగా పెట్టుకుంటే అప్పుడు గమ్యంవైపు ఆనందంగా వెళ్లవచ్చు. మీలో ఏ కళ ఉన్నదో ఒక నిర్ణయానికి రండి. దాని సాధన ప్రారంభించండి. జీవితం బాగుండటానికి అదే మొదటి మెట్టు. నేనో మధ్య తరగతి వ్యక్తిని. బంధాలకు విలువిస్తాను. బాధ్యతలను ఇష్టంగా మోస్తాను. అలా అని నా మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్‌గా తీసుకుంటే తట్టుకోలేకపోతు న్నాను. బంధువులంతా ఎప్పుడూ ఏదో ఒక సహాయం అడుగుతూనే ఉంటారు. పనుల్లో సహాయమైతే ఫర్వాలేదు. కానీ ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పినా విని పించుకోరు. నువ్వయితే కాదనవనే నీ దగ్గరకు వచ్చాం అంటూ ఇబ్బంది పెట్టేస్తుం టారు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి. - రంగనాయకులు, నెల్లూరు భయం తర్వాత మనిషికి అత్యంత ప్రమాదకరమైన జబ్బు మొహమాటం. ఒకమ్మాయి క్లాస్మేట్స్ చాలామందికి వేసవి సెలవుల్లో పెళ్లిళ్లయ్యాయి. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఫ్రెండ్ పెళ్లికీ ఆమె వెళ్లింది. కొన్ని నిశ్చితార్థాలకి కూడా అటెండ్ అవ డంతో చదువులో వెనకబడింది. గ్రాడ్యు యేషన్లో మంచి మార్కులతో పాసయినా సివిల్స్ ప్రిలిమ్స్‌లో దారుణంగా ఫెయిలైంది. ఇటువంటి సందర్భాల్లో ‘నో’ చెప్ప లేని బలహీనత, ఎవరేమనుకుంటారో అన్న మొహమాటం, ఆత్మ న్యూనత, ఐడెంటిటీ క్రైసిస్ మిళితమై ఉంటాయి. ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కన్నా... కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని ‘మొహమాటం’ అంటారు. కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం కంటే, ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని ‘దాతృత్వం’ అంటారు. అవతలివారు మనతో ఎలావుంటే మనకి బావుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇతరులకి ‘నో’ చెప్పడం మనల్ని వారికి దూరం చేయవచ్చు. కానీ ‘ఎస్’ చెప్పడం మనల్ని మనకి దూరం చేస్తుంది. ఇతరుల కోరికలకీ మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మానవ సంబంధాలు బావుంటాయి. ఈ ప్రశ్న మీ పేరు మీదే పంపించారో, మరో పేరు పెట్టారో తెలియదు. మీ పేరు రంగనాయకులై, మీరు నెల్లూరు నుంచే రాసి ఉంటే కనుక ఈ పత్రిక కాపీని జిరాక్స్ తీయించి మీ బంధువులందరికీ పంపించండి చాలు. - యండమూరి వీరేంద్రనాథ్ -
హీరోలంతా మంచివాళ్లు కారు!
టీవీక్షణం హీరో అంటే... మంచితనం, మానవత్వం, అందరినీ ఆదుకోవడం... ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలనుకుంటాం. కానీ కాలంతో పాటు అన్నీ మారినట్టు, హీరోకి నిర్వచనం కూడా మారిపోయింది. ముఖ్యంగా సీరియళ్లు తీసేవారు హీరో మంచివాడే కానక్కర్లేదంటున్నారు. నెగిటివ్ షేడ్స్‌తో హీరో పాత్రలను సృష్టిస్తున్నారు. అదేంటోగానీ... మానవతా మూర్తులుగా కంటే... అన్ని అవలక్షణాలనూ కలిగివుండే హీరోలు నచ్చుతున్నారు ప్రేక్షకులకీ మధ్య. అందుకే అలాంటి పాత్రలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా హిందీ సీరియళ్లలో నెగిటివ్ హీరోలు కోకొల్లలు. ‘మధుబాల’ హీరో రిషభ్ పరమ మూర్ఖుడు, గర్విష్టి, కుసంస్కారి. స్వార్థం, అసూయ, ఆవేశం... లేని అవలక్షణం లేదు. అయినా రిషభ్గా చేసిన వివియన్ స్టార్ అయిపోయాడంటే, ఆ పాత్ర అందరినీ ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్లోని మరో పాత్ర సుల్తాన్. కావాలనుకున్నదాన్ని సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇక ‘బానీ’లో పర్మీత్ పాత్ర అసహ్యాన్ని కలిగించేంత నెగిటివ్‌గా ఉంటుంది. ‘బాలికావధు’లో జగదీష్ సింగ్ చాలా స్వార్థపరుడు. ‘బైరీ పియా’లో శరద్ ఖేల్కర్ చేసిన పాత్ర కర్కశమైనది. ఈ పాత్రలన్నీ స్వతహాగానే చెడ్డవి. కానీ చాలా మంచివారై ఉండి, కొన్ని చెడు లక్షణాలతో ఉండే హీరోలు ఉన్నారు. స్టార్‌ప్లస్ వారి‘యే హై మొహొబ్బతే’లో రమణ్‌కుమార్ భల్లా మంచివాడు. కానీ ఆవేశపరుడు. ‘రంగ్ రసియా’లో రుద్రప్రతాప్ సిన్సియర్ పోలీస్. కానీ పరమ కోపిష్టి. ‘పరిచయ్’లో కునాల్ చోప్రా కూడా ఇదే టైపు. ‘భాగ్యవిధాత’లో వినయ్సిన్హా, తుమ్హారీ పాఖీ’లో అన్షుమన్లు కూడా కాస్త చెడును కలిగిన మంచి పాత్రలు. ఇక దక్షిణాది సీరియళ్ల విషయానికొస్తే... అప్పట్లో ‘మెట్టెల సవ్వడి’లో గాయత్రికి భర్తగా నటించిన చేతన్ ప్రేక్షకులకు విపరీతమైన కోపం తెప్పించాడు. ‘ముత్యాల ముగ్గు’లో అభిషేక్ చేసిన భాస్కర్ పాత్ర, ‘సుందరకాండ’లో రిషి పాత్ర కూడా నెగిటివే. ‘చక్రవాకం’లో సెల్వరాజ్ చేసిన ఇక్బాల్ పాత్ర, ‘మొగలి రేకులు’లో సాగర్ చేసిన మున్నా పాత్రలు మొదట్లో రౌడీల మాదిరిగా ఉంటాయి. తర్వాత్తర్వాత మంచిగా మారాయి. ఏదేమైతేనేం, వీళ్లందరినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆయా పాత్రలకి పట్టం కట్టారు. హీరో అంటే మహోన్నతుడు కానక్కర్లేదు, మామూలుగా కూడా ఉండొచ్చు అన్న కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని సీరియళ్లు తీసేవాళ్లు అద్భుతంగా ఫాలో అయిపోతున్నారు! -
వివేకాన్ని ఉపయోగించాలి
వెలుగు బాట మంచిని, మానవత్వాన్ని బోధించడమే అన్ని మతాలు చేయవలసిన పని. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలేకావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి, మతం అనిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే, అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం. కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే. నిన్ను వలె నీపొరుగు వారిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. సర్వేజనా సుఖినోభవంతు అంటుంది హిందూ మతం. ‘నువ్వు నీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటి వారి కోసం కూడా అలాంటి స్థితినే కోరుకో’మన్నారు మహమ్మద్ ప్రవక్త (స). సమస్త మానవాళీ పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం అంటోంది ఇస్లాం ధర్మం. కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మత ధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పంచుకోవాలి. మత ధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనాలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేగాని దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది. గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురిచేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ కూడా ఇలా చెబుతుంది. ‘మంచికి, దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో అత్యాచారాల్లో ఎవ్వరితో సహకరించకండి, దైవానికి భయపడండి, దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’ (పవిత్ర ఖురాన్) - మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మంచి ఇంకా మిగిలే ఉంది!
మానవ సంబంధాలకు విలువ తగ్గిందని, పట్టణ సంస్కృతి పెరిగాక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా తయారైందని, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఓదార్చే చెయ్యి కూడా కరువవుతోందని కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ అందరూ అలానే లేరు. కొందరిలో మంచితనం ఇంకా మిగిలేవుంది. అందుకు ఉదాహరణే ఇది. అమెరికాలోని మిసోరీలో నివసించే శాండ్రా అనే మహిళకు, స్థానిక రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటు అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అక్కడికి వెళ్లేది. ముఖ్యంగా తన పెళ్లి రోజును అక్కడే చేసుకునేది. ఒకటీ రెండుసార్లు కాదు... 31 ఏళ్లపాటు ఆ రెస్టారెంటులోనే చేసుకుంది. కానీ ఈ సంవత్సరం అందుకు అవకాశం లేదు. ఎందుకంటే... ఆమె భర్త హఠాన్మరణం చెందాడు. అది కూడా తమ 32వ పెళ్లి రోజు మరికొద్ది రోజులు ఉందనగా. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది శాండ్రా. వేదనలో మునిగిపోయి బయటకు వెళ్లడమే మానేసింది. ఆమెను సంతోషపెట్టేందుకు ఆమె పిల్లలు రకరకాల ప్రయత్నాలు చేశారు. కూతురైతే తల్లికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి పెట్టాలని రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ వెయిట్రస్‌తో తన తల్లి పడు తోన్న బాధ గురించి చెప్పింది. ఆ వెయిట్రస్ వెంటనే విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసింది. వారు ఆ వెయిట్రస్‌తో కలిసి శాండ్రాకు ఓ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘మీకు కలిగిన వేదనకు మేము ఎంతో చింతిస్తున్నాం. 31 సంవత్సరాల పాటు మీరు మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజును మా రెస్టారెంటులో గడిపారు. వచ్చే పెళ్లిరోజు నాడు కూడా మా దగ్గరకు వచ్చి, మా రెస్టారెంటులో భోజనం చేసి వెళ్లండి’. ఉత్తరం చదివి కన్నీటి పర్యంతమైన శాండ్రా, 32వ పెళ్లి రోజున రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె ఎప్పుడూ తన భర్తతో కలసి కూర్చునే టేబుల్‌నే కేటాయించారు. మంచి విందును ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు... ప్రతి ఏటా ఆ రోజున వచ్చి తాము ఇచ్చే విందును ఆరగించమని కూడా కోరారు. అందుకే అనేది... మంచితనం ఇంకా మిగిలే ఉందని! -
పనిచేసేదాకా వదలను... ప్రశ్నిస్తా..!
సినిమా హీరో... వెండితెరపై అన్యాయాలను ప్రశ్నిస్తాడు... అక్రమాలను ఎదిరిస్తాడు... కానీ, నిజజీవితంలోనూ ఆ పని చేస్తాడా? అనుమానమే... కాదు, కాదు..ఆశించను కూడా ఆశించలేం...కానీ, శివాజీ మాత్రం ఆ పని చేశాడు... చేస్తున్నాడు... ఇకపై కూడా చేస్తానంటున్నాడు... అది మొన్న పాలెం బస్సు ప్రమాద బాధితుల పక్షాన ప్రభుత్వంతో పోరాటం కావచ్చు...నిన్న తిరుమలలో అధికారుల అహంకారం వల్ల కేసుల పాలైన భక్తుల తరఫున గళమెత్తడం కావచ్చు... శివాజీ ఇప్పుడు రియల్ హీరో. మంచితనం, గుండెలోని మనిషితనం పోగొట్టుకోకుండా,మనసుకు మేకప్ లేకుండా మాట్లాడుతున్నాడు... ఇది ఓ సామాన్యుడి ధర్మాగ్రహం...ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద ప్రజల మనసులోని మాటకు నిలువుటద్దం.. పాలెం బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆ నలభై అయిదుగుర్నీ మరచిపోలేకపోతున్నాను. కళ్లు మూసినా... కళ్లు తెరిచినా వాళ్లే గుర్తొస్తున్నారు. బంధాలన్నింటినీ తెంచేసుకొని వెళ్లిపోయారు. అయినవారికి తీవ్ర శోకాన్ని మిగిల్చారు. నిజంగా అన్నెం పున్నెం ఎరుగరు వాళ్లు. ఇది ఏ దేవుడి శాపమూ కాదు. పాలెం బస్ ఘటన పాలకుల పాపం. కేవలం ఓ నలభై అయిదుమందికి న్యాయం చేయలేని ఈ నాయకులు కోట్లాది ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అరవై రోజుల నుంచి ఉడికిపోతున్నాను. అడుగుదామా వద్దా? ఇదే మీమాంస. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పల్లెటూరి వాణ్ణి. తప్పు మీద తప్పు. ఎన్నాళ్లు చూస్తూ కూర్చోవాలి? దేవుణ్ని చూడ్డానికొచ్చిన భక్తుల్ని అరెస్ట్ చేయమన్న నీచ సంస్కృతి ఇక్కడుంది. వాళ్ల కానుకలతో బతుకుతూ వాళ్లనే అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? తంతారు. అదే చెప్పా. నిర్ణయాన్ని వెనక్కుతీసుకోకపోతే... తిరుమల వెళ్లి కూర్చునేవాణ్ణి. నిజానికి సినిమాలకంటే... రాజకీయాలే ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. అయితే... ప్రజలు అనుభవిస్తోంది విరక్తితో కూడుకున్న వినోదం. ఈ నాయకుల్ని నేనడిగేది ఒక్కటే... మీ నియోజక వర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మిమ్మల్ని కలవడానికి కనీసం మీ నియోజక వర్గాల్లో ఒక క్యాంప్ ఆఫీస్‌నైనా మీరు ఏర్పాటు చేసుకున్నారా? ప్రతి విషయాన్నీ రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటుంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మొన్నే కేన్సర్ హాస్పిటల్కెళ్లాను. అక్కడ బాధితుల్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. వంశపారంపర్యంగా వ్యాధి బారిన పడ్డవారు అక్కడ కొందరే. కలుషిత నీటి కారణంగా వ్యాధి బారిన పడ్డవారే ఎక్కడ చూసినా. దీనికి కారణం ఎవరు? నాయకులు కాదా? విలాసవంతమైన జీవితాలను వాళ్లు అనుభవిస్తున్నారు. ఎన్నుకున్న జనాలకు విచిత్రమైన నరకాన్ని చూపిస్తున్నారు. జనాలకు కావాల్సింది మంచి నీళ్లు, మంచిరోడ్లు, మంచి ఆరోగ్యం, మంచి కరెంట్, మంచి విద్య, మంచి సెక్యూరిటీ. ఈ ఆరూ ఉంటే వాళ్లు ఎవర్నీ పట్టించుకోరు. ఎవర్నీ ప్రశ్నించరు. అవి కూడా చేయలేరా? నిజానికి మన విద్యుత్ రంగం బలమైంది. వేల మెగా వోల్టుల మిగులు విద్యుత్ ఉంది మనకు. కానీ ఎక్కడబడితే అక్కడ కరెంట్ కోత. ఏవేవో పథకాలు పెడతారు. దేనికి పెడతారో తెలీదు. దాని లక్ష్యం ఏమిటో తెలీదు. మనిషికి కావాల్సినవన్నీ వదిలేసి ఏంటేంటో చేస్తున్నారు. కాంట్రాక్టులతో దండుకోవడమే పరమావధి అయిపోయింది. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా కలుషితం చేస్తున్నారు. అవసరమైతే పంపించేస్తున్నారు. వ్యవస్థలను నడిపిచేవాళ్లను పాడుచేస్తున్నారు. ఏ వ్యక్తిని, ఏ పార్టీని నేను వేలెత్తి చూపడం లేదు. ఎవరైతే జనాలతో ఎన్నుకోబడ్డారో ఆ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. ముందు ఓటరు ఆలోచనా ధోరణి కూడా మారాలి. ప్రతి నియోజకవర్గంలో అరవై వేల మంది యువకులు ఉన్నారు. వీరందరూ సమాజ క్షేమం గురించి ఆలోచిస్తే... తప్పకుండా మనం అనుకున్నది సాధించగలం. కానీ, ఒక్కరోజులో మార్పు రావాలనుకోవడం మూర్ఖత్వం. 300 ఏళ్లు పోరాడితే కానీ తెల్లవాళ్లు మనల్ని వదల్లేదు. కమ్యూనికేషన్ సరిగ్గా లేనిరోజులు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేని రోజులు, అసలు టీవీ అంటేనే తెలీని రోజులు. అలాంటి రోజుల్లో ఎక్కడి నుంచో ఓ ఉత్తరం వస్తుంది. ‘గాంధీగారు సత్యాగ్రహం చేయమన్నారు’ అని! పొలో... అని అందరూ ఉరకలెత్తారు. బ్రిటీషువారికి వణుకు పుట్టించారు. దటీజ్ మహాత్మా! ఎక్కడో ఉండి... దేశం మొత్తాన్నీ నడిపించాడాయన. ఇన్ని సౌకర్యాలుండి మనం చేయలేకపోతున్నది... ఏమీ లేకుండానే చేసి చూపించాడు. అలాంటి వాడు రావాలి. ఉన్నట్లుండి ఈ శివాజీగాడికి సమాజం గుర్తొచ్చిందేంటి? అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. శవ రాజకీయాలు చేసి ఎదగాలని నాకు లేదు. నేను కళాకారుణ్ణి. స్వతహాగా కళాకారులకు ఆవేశం ఎక్కువ. అందుకే తప్పుల్ని ఎత్తి చూపుతున్నా. ‘రాజకీయాల్లోకి రావడానికే శివాజీ ఇలా మాట్లాడుతున్నాడు...’ అనుకునేవాళ్లకు నేను చెప్పేదొక్కటే. వస్తాను.. తప్పేంటి? నిజంగా ప్రజాసేవే రాజకీయానికి పరమావధి అయితే... నేను పాలిటిక్స్‌లోకి రావాలనుకోవడం తప్పేం కాదే. ప్రజల కోసమే బతుకుతా. నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నా సరే.. లక్ష్యపెట్టను. నేను పల్నాడు ప్రాంతం నుంచి వచ్చినోణ్ణి. ప్రాణాలను లెక్కచేయను. ఇక నుంచి ప్రతి ప్రభుత్వాన్నీ నేను ప్రశ్నిస్తా. ప్రతి వాడూ పనిచేయాల్సిందే. ప్రతి నాయకుడూ పనిచేయాల్సిందే. చచ్చినట్లు పనిచేయాల్సిందే. పనిచేసేదాకా వదలను. ప్రశ్నిస్తా. నేను ఏ స్టెప్ తీసుకున్నా నటనను మాత్రం వదిలి పెట్టను. రీల్‌లైఫ్‌లో నేను స్టార్హీరోని కాకపోవచ్చు. కానీ రియల్‌లైఫ్‌లో మాత్రం హీరోనే. గెలిచా. ఓ జత ప్యాంటు, షర్టు తీసుకొని ఇక్కడకొచ్చా. ‘నాకు ఫలానా పని వచ్చండీ..’ అని చెబితే... కేఎస్.రామారావు అనే మహానుభావుడు ఎనిమిదొందల రూపాయలు జేబులో పెట్టారు. అక్కడ్నుంచి నాకొచ్చిందంతా బోనస్సే. ఒక జఫ్పా కేరక్టర్ నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. యాంకర్‌గా పనిచేశా. ఎడిటర్‌గా చేశా. కెమెరా అసిస్టెంట్‌గా చేశా. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. రకరకాల పనులు చేసి ఇప్పుడు ఇంతదూరం వచ్చా. దర్జాగా తిరగడానికి బ్రాండ్ కారుంది. కావాల్సినంత పేరుంది. నా పిల్లల చదువులకు ఇబ్బంది పడనంత ఆస్తి ఉంది. ఇంతకంటే నాకు ఏం కావాలి. రెండెకరాల పొలం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి నేను. అలాంటి నేను ఇంత సంపాదించానంటే గెలిచినట్టేగా! మా ఆవిడది నిజామాబాద్. తెలంగాణ అమ్మాయి. తనది డాక్టర్స్ ఫ్యామిలీ. ఓ ఫంక్షన్లో కలిశాం. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు మాట్లాడుకున్నారు. పెళ్లయిపోయింది. మాకిద్దరబ్బాయిలు. ఒకడికి పదేళ్లు, ఒకడికి అయిదేళ్లు. ఫ్యామిలీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. నా భార్యే నాకు కొండంత బలం. జయాపజయాలు ఇక్కడ సహజం. విజయాలు లేవని డిప్రెషన్లోకెళితే... ఈ ప్లానెట్ నుంచి మనమే వెళ్లిపోతాం. నష్టపోతాం. ఎన్నో గొప్ప అవకాశాలను మిస్సయిపోతాం. తాత్కాలికమైన విషయాలనే శాశ్వతం అనుకొని డిప్రెషన్లోకి వెళ్లడంలో అర్థమే లేదు. నా సినిమాలు చాలా లాబ్‌లో పురుటినొప్పులు పడుతున్నాయి. శాటిైలైట్ రైట్స్‌ని నమ్ముకొని సినిమాలు తీసినవాళ్లు అది రివర్సయితే... ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారు. ‘వద్దు, ఆలోచించుకోండి. నా డబ్బులు నాకిస్తారు. మీరు తర్వాత ఇబ్బందులు పడతారు’ అని చెప్పాను కూడా. వారు వినలేదు. అది నా తప్పు కాదు.