హీరోలంతా మంచివాళ్లు కారు!
టీవీక్షణం
హీరో అంటే... మంచితనం, మానవత్వం, అందరినీ ఆదుకోవడం... ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలనుకుంటాం. కానీ కాలంతో పాటు అన్నీ మారినట్టు, హీరోకి నిర్వచనం కూడా మారిపోయింది. ముఖ్యంగా సీరియళ్లు తీసేవారు హీరో మంచివాడే కానక్కర్లేదంటున్నారు. నెగిటివ్ షేడ్స్‌తో హీరో పాత్రలను సృష్టిస్తున్నారు.
అదేంటోగానీ... మానవతా మూర్తులుగా కంటే... అన్ని అవలక్షణాలనూ కలిగివుండే హీరోలు నచ్చుతున్నారు ప్రేక్షకులకీ మధ్య. అందుకే అలాంటి పాత్రలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా హిందీ సీరియళ్లలో నెగిటివ్ హీరోలు కోకొల్లలు. ‘మధుబాల’ హీరో రిషభ్ పరమ మూర్ఖుడు, గర్విష్టి, కుసంస్కారి. స్వార్థం, అసూయ, ఆవేశం... లేని అవలక్షణం లేదు. అయినా రిషభ్‌గా చేసిన వివియన్ స్టార్ అయిపోయాడంటే, ఆ పాత్ర అందరినీ ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సీరియల్‌లోని మరో పాత్ర సుల్తాన్. కావాలనుకున్నదాన్ని సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇక ‘బానీ’లో పర్‌మీత్ పాత్ర అసహ్యాన్ని కలిగించేంత నెగిటివ్‌గా ఉంటుంది. ‘బాలికావధు’లో జగదీష్ సింగ్ చాలా స్వార్థపరుడు. ‘బైరీ పియా’లో శరద్ ఖేల్కర్ చేసిన పాత్ర కర్కశమైనది. ఈ పాత్రలన్నీ స్వతహాగానే చెడ్డవి. కానీ చాలా మంచివారై ఉండి, కొన్ని చెడు లక్షణాలతో ఉండే హీరోలు ఉన్నారు.
స్టార్‌ప్లస్ వారి‘యే హై మొహొబ్బతే’లో రమణ్‌కుమార్ భల్లా మంచివాడు. కానీ ఆవేశపరుడు. ‘రంగ్ రసియా’లో రుద్రప్రతాప్ సిన్సియర్ పోలీస్. కానీ పరమ కోపిష్టి. ‘పరిచయ్’లో కునాల్ చోప్రా కూడా ఇదే టైపు. ‘భాగ్యవిధాత’లో వినయ్‌సిన్హా, తుమ్హారీ పాఖీ’లో అన్షుమన్‌లు కూడా కాస్త చెడును కలిగిన మంచి పాత్రలు.
ఇక దక్షిణాది సీరియళ్ల విషయానికొస్తే... అప్పట్లో ‘మెట్టెల సవ్వడి’లో గాయత్రికి భర్తగా నటించిన చేతన్ ప్రేక్షకులకు విపరీతమైన కోపం తెప్పించాడు. ‘ముత్యాల ముగ్గు’లో అభిషేక్ చేసిన భాస్కర్ పాత్ర, ‘సుందరకాండ’లో రిషి పాత్ర కూడా నెగిటివే. ‘చక్రవాకం’లో సెల్వరాజ్ చేసిన ఇక్బాల్ పాత్ర, ‘మొగలి రేకులు’లో సాగర్ చేసిన మున్నా పాత్రలు మొదట్లో రౌడీల మాదిరిగా ఉంటాయి. తర్వాత్తర్వాత మంచిగా మారాయి.
ఏదేమైతేనేం, వీళ్లందరినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆయా పాత్రలకి పట్టం కట్టారు. హీరో అంటే మహోన్నతుడు కానక్కర్లేదు, మామూలుగా కూడా ఉండొచ్చు అన్న కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని సీరియళ్లు తీసేవాళ్లు అద్భుతంగా ఫాలో అయిపోతున్నారు!