TV moment
-
స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు!
టీవీక్షణం సోనీ చానెల్ ప్రోగ్రామ్స్‌ని ఫాలో అయ్యేవాళ్ల ఫేవరేట్ షోలలో ‘అదాలత్’ తప్పకుండా ఉంటుంది. 2010 నుంచి నేటి వరకూ కూడా అత్యధిక టీఆర్పీతో సాగిపోతోన్న కార్యక్రమం ఇది. ఈ సక్సెస్‌లో అతి పెద్ద భాగం... అదాలత్ హీరో రోనిత్రాయ్దే. లాయర్ కేడీ పాఠక్‌గా అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరో షోకి కూడా తన కరిష్మాని జతచేశాడు రోనిత్. ఇటీవలే సోనీలో ప్రారంభమైన ‘ఇత్నా కరోనా ముఝే ప్యార్’లో లీడ్ రోల్ చేస్తున్నాడు రోనిత్. ఇన్నాళ్లూ స్ట్రాంగ్ లాయర్‌గా ఆకట్టుకున్నవాడు, ఇందులో సాఫ్ట్ ఫాదర్‌గా కనిపిస్తు న్నాడు. మనస్పర్థల కారణంగా దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ భార్యకు, కూతురికి దగ్గరవ్వాలని తహతహలాడే తండ్రిగా మనసుల్ని పిండుతున్నాడు. తన ఇమేజ్‌తో సీరియల్‌కి భారీ ఓపెనింగ్‌ని ఇచ్చిన రోనిత్... దాని విజయంలో కూడా ప్రధాన పాత్రధారి అవుతాడనడంలో సందేహమే లేదు! -
హీరోలంతా మంచివాళ్లు కారు!
టీవీక్షణం హీరో అంటే... మంచితనం, మానవత్వం, అందరినీ ఆదుకోవడం... ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలనుకుంటాం. కానీ కాలంతో పాటు అన్నీ మారినట్టు, హీరోకి నిర్వచనం కూడా మారిపోయింది. ముఖ్యంగా సీరియళ్లు తీసేవారు హీరో మంచివాడే కానక్కర్లేదంటున్నారు. నెగిటివ్ షేడ్స్‌తో హీరో పాత్రలను సృష్టిస్తున్నారు. అదేంటోగానీ... మానవతా మూర్తులుగా కంటే... అన్ని అవలక్షణాలనూ కలిగివుండే హీరోలు నచ్చుతున్నారు ప్రేక్షకులకీ మధ్య. అందుకే అలాంటి పాత్రలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా హిందీ సీరియళ్లలో నెగిటివ్ హీరోలు కోకొల్లలు. ‘మధుబాల’ హీరో రిషభ్ పరమ మూర్ఖుడు, గర్విష్టి, కుసంస్కారి. స్వార్థం, అసూయ, ఆవేశం... లేని అవలక్షణం లేదు. అయినా రిషభ్గా చేసిన వివియన్ స్టార్ అయిపోయాడంటే, ఆ పాత్ర అందరినీ ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీరియల్లోని మరో పాత్ర సుల్తాన్. కావాలనుకున్నదాన్ని సాధించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇక ‘బానీ’లో పర్మీత్ పాత్ర అసహ్యాన్ని కలిగించేంత నెగిటివ్‌గా ఉంటుంది. ‘బాలికావధు’లో జగదీష్ సింగ్ చాలా స్వార్థపరుడు. ‘బైరీ పియా’లో శరద్ ఖేల్కర్ చేసిన పాత్ర కర్కశమైనది. ఈ పాత్రలన్నీ స్వతహాగానే చెడ్డవి. కానీ చాలా మంచివారై ఉండి, కొన్ని చెడు లక్షణాలతో ఉండే హీరోలు ఉన్నారు. స్టార్‌ప్లస్ వారి‘యే హై మొహొబ్బతే’లో రమణ్‌కుమార్ భల్లా మంచివాడు. కానీ ఆవేశపరుడు. ‘రంగ్ రసియా’లో రుద్రప్రతాప్ సిన్సియర్ పోలీస్. కానీ పరమ కోపిష్టి. ‘పరిచయ్’లో కునాల్ చోప్రా కూడా ఇదే టైపు. ‘భాగ్యవిధాత’లో వినయ్సిన్హా, తుమ్హారీ పాఖీ’లో అన్షుమన్లు కూడా కాస్త చెడును కలిగిన మంచి పాత్రలు. ఇక దక్షిణాది సీరియళ్ల విషయానికొస్తే... అప్పట్లో ‘మెట్టెల సవ్వడి’లో గాయత్రికి భర్తగా నటించిన చేతన్ ప్రేక్షకులకు విపరీతమైన కోపం తెప్పించాడు. ‘ముత్యాల ముగ్గు’లో అభిషేక్ చేసిన భాస్కర్ పాత్ర, ‘సుందరకాండ’లో రిషి పాత్ర కూడా నెగిటివే. ‘చక్రవాకం’లో సెల్వరాజ్ చేసిన ఇక్బాల్ పాత్ర, ‘మొగలి రేకులు’లో సాగర్ చేసిన మున్నా పాత్రలు మొదట్లో రౌడీల మాదిరిగా ఉంటాయి. తర్వాత్తర్వాత మంచిగా మారాయి. ఏదేమైతేనేం, వీళ్లందరినీ ప్రేక్షకులు ఆదరించారు. ఆయా పాత్రలకి పట్టం కట్టారు. హీరో అంటే మహోన్నతుడు కానక్కర్లేదు, మామూలుగా కూడా ఉండొచ్చు అన్న కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతాన్ని సీరియళ్లు తీసేవాళ్లు అద్భుతంగా ఫాలో అయిపోతున్నారు! -
నాన్న ప్రేమ కోసం...
టీవీక్షణం తల్లిదండ్రుల ప్రేమే పిల్లలకు బలం. అలాంటిది తన కన్నతండ్రికి తనమీద ప్రేమే లేదని తెలిస్తే ఆ కూతురి పరిస్థితి ఎలా ఉంటుంది?! మనసు బాధతో కుమిలిపోతుంది. ఆవేదన పొంగి పొరలుతుంది. అంజలికి కూడా అలానే అవుతుంది. 21 ఏళ్ల వయసులో తన తండ్రి ఆడపిల్లను వద్దనుకున్నాడని, అందుకే అతడికి తన మీద ప్రేమ లేదన్న నిజం తెలిసి షాక్ తింటుందామె. అతడి మనసులో ఎలాగైనా చోటు సంపాదించాలని తహతహలాడుతుంది. దానికోసం తీరకుండా మిగిలిపోయిన అతడి కలను తన కలగా చేసుకుంటుంది. ఆయన అందుకోలేకపోయిన లక్ష్యాన్ని తాను అందుకోవాలి, ఆయన సాధించలేకపోయిన విజయాన్ని తాను సాధించి చూపించాలని నిర్ణయించుకుంటుంది. ఏమిటా లక్ష్యం? దాన్ని ఆమె సాధిస్తుందా, తండ్రి ప్రేమను పొందుతుందా అన్నది తెలుసుకోవాలంటే... ‘స్టార్ ప్లస్’లో ప్రసారమయ్యే ‘ఎవరెస్ట్’ సీరియల్ చూడాలి. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అశుతోష్ గోవారికర్ తను రాసిన కథతో నిర్మిస్తోన్న ఈ సీరియల్, ఆదిలోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ తండ్రికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్న వైవిధ్యభరితమైన లక్ష్యాన్ని పెట్టడం, అది తీరకపోవడంతో కూతురు ఎవరెస్ట్ ఎక్కి, తండ్రి కలను నెరవేర్చాలని తపించడం అన్న పాయింట్‌తో కథని అల్లడంలోనే అశుతోష్ సగం విజయాన్ని సాధించేశారు. దానికితోడు అంజలి పాత్రకు షమతా ఆచన్ చక్కగా సరిపోయింది. ఆమె అందం, ఆకర్షణ, నటన కచ్చితంగా సీరియల్‌కి ప్లస్ పాయింట్సే. ఇక తొలిసారిగా రెహమాన్ సంగీతం అందించిన సీరియల్ ఇదే కావడం... ఇంకో పెద్ద ప్లస్. ఇన్ని ప్లస్సులు కలిసినప్పుడు ఆ సీరియల్ సక్సెస్‌ను ఎవరు మాత్రం ఆపగలరు!