మంచి ఇంకా మిగిలే ఉంది!
మానవ సంబంధాలకు విలువ తగ్గిందని, పట్టణ సంస్కృతి పెరిగాక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా తయారైందని, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఓదార్చే చెయ్యి కూడా కరువవుతోందని కొందరు ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ అందరూ అలానే లేరు. కొందరిలో మంచితనం ఇంకా మిగిలేవుంది. అందుకు ఉదాహరణే ఇది.
అమెరికాలోని మిసోరీలో నివసించే శాండ్రా అనే మహిళకు, స్థానిక రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటు అంటే చాలా ఇష్టం. చాలాసార్లు అక్కడికి వెళ్లేది. ముఖ్యంగా తన పెళ్లి రోజును అక్కడే చేసుకునేది. ఒకటీ రెండుసార్లు కాదు... 31 ఏళ్లపాటు ఆ రెస్టారెంటులోనే చేసుకుంది. కానీ ఈ సంవత్సరం అందుకు అవకాశం లేదు. ఎందుకంటే... ఆమె భర్త హఠాన్మరణం చెందాడు.
అది కూడా తమ 32వ పెళ్లి రోజు మరికొద్ది రోజులు ఉందనగా. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది శాండ్రా. వేదనలో మునిగిపోయి బయటకు వెళ్లడమే మానేసింది. ఆమెను సంతోషపెట్టేందుకు ఆమె పిల్లలు రకరకాల ప్రయత్నాలు చేశారు. కూతురైతే తల్లికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి పెట్టాలని రెడ్ లాబ్‌స్టర్ రెస్టారెంటుకు వెళ్లింది.
అక్కడ వెయిట్రస్‌తో తన తల్లి పడు తోన్న బాధ గురించి చెప్పింది. ఆ వెయిట్రస్ వెంటనే విషయాన్ని యాజమాన్యానికి తెలియజేసింది. వారు ఆ వెయిట్రస్‌తో కలిసి శాండ్రాకు ఓ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘మీకు కలిగిన వేదనకు మేము ఎంతో చింతిస్తున్నాం. 31 సంవత్సరాల పాటు మీరు మీ జీవితంలోని అతి ముఖ్యమైన రోజును మా రెస్టారెంటులో గడిపారు. వచ్చే పెళ్లిరోజు నాడు కూడా మా దగ్గరకు వచ్చి, మా రెస్టారెంటులో భోజనం చేసి వెళ్లండి’.
ఉత్తరం చదివి కన్నీటి పర్యంతమైన శాండ్రా, 32వ పెళ్లి రోజున రెస్టారెంటుకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె ఎప్పుడూ తన భర్తతో కలసి కూర్చునే టేబుల్‌నే కేటాయించారు. మంచి విందును ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు... ప్రతి ఏటా ఆ రోజున వచ్చి తాము ఇచ్చే విందును ఆరగించమని కూడా కోరారు. అందుకే అనేది... మంచితనం ఇంకా మిగిలే ఉందని!