పనిచేసేదాకా వదలను... ప్రశ్నిస్తా..! | sivaji interview | Sakshi
Sakshi News home page

పనిచేసేదాకా వదలను... ప్రశ్నిస్తా..!

Published Sat, Feb 15 2014 11:25 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

పనిచేసేదాకా వదలను... ప్రశ్నిస్తా..! - Sakshi

పనిచేసేదాకా వదలను... ప్రశ్నిస్తా..!

సినిమా హీరో... వెండితెరపై అన్యాయాలను ప్రశ్నిస్తాడు... అక్రమాలను ఎదిరిస్తాడు... కానీ, నిజజీవితంలోనూ ఆ పని చేస్తాడా? అనుమానమే... కాదు, కాదు..ఆశించను కూడా ఆశించలేం...కానీ, శివాజీ మాత్రం ఆ పని చేశాడు... చేస్తున్నాడు... ఇకపై కూడా చేస్తానంటున్నాడు... అది మొన్న పాలెం బస్సు ప్రమాద బాధితుల పక్షాన ప్రభుత్వంతో పోరాటం కావచ్చు...నిన్న తిరుమలలో అధికారుల అహంకారం వల్ల కేసుల పాలైన భక్తుల తరఫున గళమెత్తడం కావచ్చు... శివాజీ ఇప్పుడు రియల్ హీరో. మంచితనం, గుండెలోని మనిషితనం పోగొట్టుకోకుండా,మనసుకు మేకప్ లేకుండా మాట్లాడుతున్నాడు... ఇది ఓ సామాన్యుడి ధర్మాగ్రహం...ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద ప్రజల మనసులోని మాటకు నిలువుటద్దం..
 
పాలెం బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆ నలభై అయిదుగుర్నీ మరచిపోలేకపోతున్నాను. కళ్లు మూసినా... కళ్లు తెరిచినా వాళ్లే గుర్తొస్తున్నారు. బంధాలన్నింటినీ తెంచేసుకొని వెళ్లిపోయారు. అయినవారికి తీవ్ర శోకాన్ని మిగిల్చారు. నిజంగా అన్నెం పున్నెం ఎరుగరు వాళ్లు. ఇది ఏ దేవుడి శాపమూ కాదు. పాలెం బస్ ఘటన పాలకుల పాపం. కేవలం ఓ నలభై అయిదుమందికి న్యాయం చేయలేని ఈ నాయకులు కోట్లాది ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అరవై రోజుల నుంచి ఉడికిపోతున్నాను. అడుగుదామా వద్దా? ఇదే మీమాంస. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పల్లెటూరి వాణ్ణి. తప్పు మీద తప్పు. ఎన్నాళ్లు చూస్తూ కూర్చోవాలి? దేవుణ్ని చూడ్డానికొచ్చిన భక్తుల్ని అరెస్ట్ చేయమన్న నీచ సంస్కృతి ఇక్కడుంది. వాళ్ల కానుకలతో బతుకుతూ వాళ్లనే అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? తంతారు. అదే చెప్పా. నిర్ణయాన్ని వెనక్కుతీసుకోకపోతే... తిరుమల వెళ్లి కూర్చునేవాణ్ణి.
     
నిజానికి సినిమాలకంటే... రాజకీయాలే ప్రజలకు వినోదాన్నిస్తున్నాయి. అయితే... ప్రజలు అనుభవిస్తోంది విరక్తితో కూడుకున్న వినోదం. ఈ నాయకుల్ని నేనడిగేది ఒక్కటే... మీ నియోజక వర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మిమ్మల్ని కలవడానికి కనీసం మీ నియోజక వర్గాల్లో ఒక క్యాంప్ ఆఫీస్‌నైనా మీరు ఏర్పాటు చేసుకున్నారా? ప్రతి విషయాన్నీ రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటుంటే ప్రజలు ఎలా నమ్ముతారు?  
 
మొన్నే కేన్సర్ హాస్పిటల్‌కెళ్లాను. అక్కడ బాధితుల్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. వంశపారంపర్యంగా వ్యాధి బారిన పడ్డవారు అక్కడ కొందరే. కలుషిత నీటి కారణంగా వ్యాధి బారిన పడ్డవారే ఎక్కడ చూసినా. దీనికి కారణం ఎవరు? నాయకులు కాదా? విలాసవంతమైన జీవితాలను వాళ్లు అనుభవిస్తున్నారు. ఎన్నుకున్న జనాలకు విచిత్రమైన నరకాన్ని చూపిస్తున్నారు. జనాలకు కావాల్సింది మంచి నీళ్లు, మంచిరోడ్లు, మంచి ఆరోగ్యం, మంచి కరెంట్, మంచి విద్య, మంచి సెక్యూరిటీ. ఈ ఆరూ ఉంటే వాళ్లు ఎవర్నీ పట్టించుకోరు. ఎవర్నీ ప్రశ్నించరు. అవి కూడా చేయలేరా? నిజానికి మన విద్యుత్ రంగం బలమైంది. వేల మెగా వోల్టుల మిగులు విద్యుత్ ఉంది మనకు. కానీ ఎక్కడబడితే అక్కడ కరెంట్ కోత. ఏవేవో పథకాలు పెడతారు. దేనికి పెడతారో తెలీదు. దాని లక్ష్యం ఏమిటో తెలీదు. మనిషికి కావాల్సినవన్నీ వదిలేసి ఏంటేంటో చేస్తున్నారు. కాంట్రాక్టులతో దండుకోవడమే పరమావధి అయిపోయింది. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా కలుషితం చేస్తున్నారు. అవసరమైతే పంపించేస్తున్నారు. వ్యవస్థలను నడిపిచేవాళ్లను పాడుచేస్తున్నారు. ఏ వ్యక్తిని, ఏ పార్టీని నేను వేలెత్తి చూపడం లేదు. ఎవరైతే జనాలతో ఎన్నుకోబడ్డారో ఆ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా.
     
ముందు ఓటరు ఆలోచనా ధోరణి కూడా మారాలి. ప్రతి నియోజకవర్గంలో అరవై వేల మంది యువకులు ఉన్నారు. వీరందరూ సమాజ క్షేమం గురించి ఆలోచిస్తే... తప్పకుండా మనం అనుకున్నది సాధించగలం. కానీ, ఒక్కరోజులో మార్పు రావాలనుకోవడం మూర్ఖత్వం. 300 ఏళ్లు పోరాడితే కానీ తెల్లవాళ్లు మనల్ని వదల్లేదు.
 
కమ్యూనికేషన్ సరిగ్గా లేనిరోజులు, ట్రాన్స్‌పోర్ట్ సరిగ్గా లేని రోజులు, అసలు టీవీ అంటేనే తెలీని రోజులు. అలాంటి రోజుల్లో ఎక్కడి నుంచో ఓ ఉత్తరం వస్తుంది. ‘గాంధీగారు సత్యాగ్రహం చేయమన్నారు’ అని! పొలో... అని అందరూ ఉరకలెత్తారు. బ్రిటీషువారికి వణుకు పుట్టించారు. దటీజ్ మహాత్మా! ఎక్కడో ఉండి... దేశం మొత్తాన్నీ నడిపించాడాయన. ఇన్ని సౌకర్యాలుండి మనం చేయలేకపోతున్నది... ఏమీ లేకుండానే చేసి చూపించాడు. అలాంటి వాడు రావాలి.
 
ఉన్నట్లుండి ఈ శివాజీగాడికి సమాజం గుర్తొచ్చిందేంటి? అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. శవ రాజకీయాలు చేసి ఎదగాలని నాకు లేదు. నేను కళాకారుణ్ణి. స్వతహాగా కళాకారులకు ఆవేశం ఎక్కువ. అందుకే తప్పుల్ని ఎత్తి చూపుతున్నా. ‘రాజకీయాల్లోకి రావడానికే శివాజీ ఇలా మాట్లాడుతున్నాడు...’ అనుకునేవాళ్లకు నేను చెప్పేదొక్కటే. వస్తాను.. తప్పేంటి? నిజంగా ప్రజాసేవే రాజకీయానికి పరమావధి అయితే... నేను పాలిటిక్స్‌లోకి రావాలనుకోవడం తప్పేం కాదే. ప్రజల కోసమే బతుకుతా. నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నా సరే.. లక్ష్యపెట్టను. నేను పల్నాడు ప్రాంతం నుంచి వచ్చినోణ్ణి. ప్రాణాలను లెక్కచేయను. ఇక నుంచి ప్రతి ప్రభుత్వాన్నీ నేను ప్రశ్నిస్తా. ప్రతి వాడూ పనిచేయాల్సిందే. ప్రతి నాయకుడూ పనిచేయాల్సిందే. చచ్చినట్లు పనిచేయాల్సిందే. పనిచేసేదాకా వదలను. ప్రశ్నిస్తా.
 
నేను ఏ స్టెప్ తీసుకున్నా నటనను మాత్రం వదిలి పెట్టను. రీల్‌లైఫ్‌లో నేను స్టార్‌హీరోని కాకపోవచ్చు. కానీ రియల్‌లైఫ్‌లో మాత్రం హీరోనే. గెలిచా. ఓ జత ప్యాంటు, షర్టు తీసుకొని ఇక్కడకొచ్చా. ‘నాకు ఫలానా పని వచ్చండీ..’ అని చెబితే... కేఎస్.రామారావు అనే మహానుభావుడు ఎనిమిదొందల రూపాయలు జేబులో పెట్టారు. అక్కడ్నుంచి నాకొచ్చిందంతా బోనస్సే. ఒక జఫ్పా కేరక్టర్ నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. యాంకర్‌గా పనిచేశా. ఎడిటర్‌గా చేశా. కెమెరా అసిస్టెంట్‌గా చేశా. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. రకరకాల పనులు చేసి ఇప్పుడు ఇంతదూరం వచ్చా. దర్జాగా తిరగడానికి బ్రాండ్ కారుంది. కావాల్సినంత పేరుంది. నా పిల్లల చదువులకు ఇబ్బంది పడనంత ఆస్తి ఉంది. ఇంతకంటే నాకు ఏం కావాలి. రెండెకరాల పొలం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి నేను. అలాంటి నేను ఇంత సంపాదించానంటే గెలిచినట్టేగా!
 
మా ఆవిడది నిజామాబాద్. తెలంగాణ అమ్మాయి. తనది డాక్టర్స్ ఫ్యామిలీ. ఓ ఫంక్షన్లో కలిశాం. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు మాట్లాడుకున్నారు. పెళ్లయిపోయింది. మాకిద్దరబ్బాయిలు. ఒకడికి పదేళ్లు, ఒకడికి అయిదేళ్లు. ఫ్యామిలీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది. నా భార్యే నాకు కొండంత బలం.
 
జయాపజయాలు ఇక్కడ సహజం. విజయాలు లేవని డిప్రెషన్‌లోకెళితే... ఈ ప్లానెట్ నుంచి మనమే వెళ్లిపోతాం. నష్టపోతాం. ఎన్నో గొప్ప అవకాశాలను మిస్సయిపోతాం. తాత్కాలికమైన విషయాలనే శాశ్వతం అనుకొని డిప్రెషన్‌లోకి వెళ్లడంలో అర్థమే లేదు. నా సినిమాలు చాలా లాబ్‌లో పురుటినొప్పులు పడుతున్నాయి. శాటిైలైట్ రైట్స్‌ని నమ్ముకొని సినిమాలు తీసినవాళ్లు అది రివర్సయితే... ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారు. ‘వద్దు, ఆలోచించుకోండి. నా డబ్బులు నాకిస్తారు. మీరు తర్వాత ఇబ్బందులు పడతారు’ అని చెప్పాను కూడా. వారు వినలేదు. అది నా తప్పు కాదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement