కరీంనగర్ సిటీ : గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసే పన్నుల వసూళ్లు జిల్లాలో ముందుకు సాగడంలేదు. గ్రామస్థాయి రాజకీయాలు, ప్రజప్రతినిధుల స్వప్రయోజనాలు, అధికారుల అలసత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. వెరసి గ్రామాల్లో పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. పన్నుల వసూళ్లతో గ్రామాభివృద్ధి చేపట్టాల్సిన గ్రామపంచాయతీలు అది మానేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకాల వైపు ఆశగా చూస్తున్నాయి.
దృష్టిసారించని అధికారులు..
జిల్లాలోని 1,207 గ్రామపంచాయతీలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.22కోట్ల పన్నుల బకాయిలు ఉన్నాయి. దీంతో సాధారణంగా సాగాల్సిన పరిపాలనలో ఆర్థిక పరమైన పనులు కుంటుపడిపోతున్నాయి. ఇంటిపన్ను, నల్లాపన్ను, గృహనిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఫీజు రూపంలో గ్రామపంచాయతీలకు స్థానికంగా ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంతో సంబంధిత గ్రామాల్లో అత్యవసర పనులను పూర్తి చేస్తుంటారు. ప్రత్యేక అభివృద్ధి కోసం ప్రభుత్వాల నిధులను వినియోగిస్తుంటారు.
కొన్నేళ్లుగా పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టిసారించకపోవడంతో పంచాయతీలు పూర్తిగా ప్రభుత్వాలనుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాకు సంబంధించి ఆగస్టు నాటికి గత ఆర్థిక సంవత్సరం బకాయిలు రూ12.90 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ.13.17 కోట్లు ఉన్నాయి. ఇందులో ఏరియర్స్ రూ.2.08కోట్లు, ఈ సంవత్సరం బకాయిల్లో రూ2.06కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ప్రస్తుతం గతేడాది బకాయిలు రూ10. 81కోట్లు, ఈ సంవత్సరం పన్నులు రూ11.10 కోట్లు, మొత్తం సుమారు రూ 22 కోట్ల పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది.
ఎన్నికలప్పుడే వసూళ్లు..
గ్రామపంచాయతీల్లో పన్నుల వసూలు ప్రహసనంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. స్థానికంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే కాస్తరుు నా పన్నులు వసూలు అవుతుంటాయి. స్థానికం గా ఎన్నికల్లో పోటీచేయాలంటే గ్రామపంచాయతీలకు బకాయిలు ఉండరాదనే నిబంధన ఉండడంతో అప్పుడు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తుంటారు. పోటీచేసే అభ్యర్థి, ప్రతిపాదకుల ఇంటిపన్ను, నల్లాపన్ను బాకీ ఉండరాదు. దీంతో కుప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఆ తర్వాత పన్నుల వసూళ్ల ఊసు కూడా పంచాయతీ కార్యదర్శులు ఎత్తడం లేదు.
కరీంనగర్ టాప్
మండలాల వారీగా చూస్తే పన్నుల బకాయిల్లో కరీంనగర్ మండలం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. 30 గ్రామాలున్న ఈ మండ లంలో రూ.కోటి 77 లక్షల రూపంలో ఆయా గ్రామాలకు రావాల్సి ఉంది. మరో 16 మండలాలు రూ.50 లక్షలకు పైబడి బకాయిలు ఉండడం విశేషం. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్న గ్రామపంచాయతీల్లో ఈ పన్నుల ఆదాయం అధికంగా ఉంటుంది. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు పెద్దల చేతుల్లో ఉండడంతో ఆయా సర్పంచులు వసూళ్లపై నిరాసక్తి చూపుతున్నారు. దీంతో నగరాలు, పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో లక్షల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే కేవలం 30 గ్రామాలకు సంబంధించి సుమారు రూ.2 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.
సర్కారు నజర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామపంచాయతీల ఆర్థిక బలోపేతంపై దృష్టిసారించిన ప్రభుత్వం, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించింది. సంవత్సరాలుగా ఆయా గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను వసూళ్లు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. అందుకు అనుగుణంగా అధికారులకు ఆదేశాలు అం దాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు పన్నుల బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు, ఇటీవల సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు.
పన్నులు వసూళ్లు అయితే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ పథకాలకు, తోడవుతాయనే భావనతో మంత్రి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పన్నుల వసూళ్లు వేగవంతమయ్యాయి. రాజకీయ లబ్ధి, స్వప్రయోజనాలు పక్కనపెట్టి సామాజిక బాధ్యతగా పన్నుల వసూళ్లకు శ్రీకారం చుడితే, గ్రామ స్వరాజ్యం మరింత మెరుగు పడుతుంది.
పన్ను బకాయిలు రూ.22 కోట్లు
Published Mon, Nov 10 2014 3:58 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement