ముంబై: డేటా వినియోగం, 4జీ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. వీటి దన్నుతో క్యూ3లో టెల్కోల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 3-4 శాతం వృద్ధి నమోదు చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒరిస్సా, హర్యానాలో ఆవిష్కరించిన రేట్ల పెంపును భారతి ఎయిర్‌టెల్ మిగతా సర్కిళ్లలోనూ అమలు చేసి, పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పడితే నాలుగో త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయం 5 శాతం పైగా వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు)
దిగువ స్థాయిలో రేట్ల పెంపును ఎయిర్‌టెల్ రెండు సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసిన పక్షంలో టెలికం రంగం ఆదాయ వృద్ధిపై పెద్దగా అర్థవంతమైన ప్రభావమేమీ ఉండకపోవచ్చని బీఎన్‌పీ పారిబా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని ఇతర సర్కిళ్లకూ విస్తరిస్తే, పోటీ కంపెనీలు కూడా అనుసరిస్తే మాత్రం 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయాలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనూ త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) టెలికం పరిశ్రమ ఆదాయాలు 3-4 శాతం స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబర్ ఆఖర్లో అమలు చేసిన రేట్ల పెంపు ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ సానుకూలంగా కొనసాగింది. ఇక రెండో త్రైమాసికంలో కస్టమర్లు పెద్ద డేటా ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఆదాయాల వృద్ధికి కలిసి వచ్చింది.
జియో, వొడా ఐడియా కీలకం..
పరిశ్రమలో పరిస్థితులను అంచనా వేసుకునేందుకు ఎయిర్‌టెల్ ఈ నెల తొలినాళ్లలో ఒరిస్సా, హర్యానాలో కనీస టారిఫ్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ. 155కి చేసిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీల ప్రతిస్పందనను కూడా చూసిన తర్వాత ఈ పెంపును కొనసాగించడం లేదా పూర్వ స్థాయికి తగ్గించడం గురించి తగు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎయిర్‌టెల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ మిగతా కంపెనీలు కూడా అదే బాట పడితే మాత్రం టారిఫ్‌ల పెంపును ఎయిర్‌టెల్ మిగతా సర్కిళ్లకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఎయిర్‌టెల్ చర్యలకు ప్రతిస్పందనగా జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఎంత మేర టారిఫ్‌లు పెంచుతాయనే దానిపై జనవరి–మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి ఆధారపడి ఉంటుందని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌టెల్ తన బేస్ ప్యాక్ టారిఫ్‌ల పెంపును ఎంత వేగంగా మిగతా సర్కిళ్లకు విస్తరిస్తుంది .. జియో, వీఐ తమ కనీస రీచార్జ్ ప్లాన్లను రూ. 99 నుండి రూ. 125 స్థాయికి పెంచుతాయా లేదా ఎయిర్‌టెల్‌కు సమానంగా నేరుగా రూ. 155కి పెంచేస్తాయా అనే అంశాలతో ఆదాయాలు ప్రభావితం కాగలవని వారు పేర్కొన్నారు.
విక్రేతల మార్కెట్..
విశ్లేషకుల అంచనాలు ఒకవేళ పోటీ కంపెనీలు కూడా ఎయిర్‌టెల్‌ను అనుసరించిన పక్షంలో టెలికం పరిశ్రమ.. విక్రేతల మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సందర్భంలో రేట్లను వినియోగదారుల డిమాండ్ కాకుండా విక్రేతలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. టెలికం రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపించి దాదాపు దశాబ్ద కాలం పైగా గడిచిపోయింది. రేట్లను నిర్దేశించే శక్తి కంపెనీల దగ్గర ఉన్నప్పుడు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు ఎంచుకునేందుకు ప్రత్యా మ్నాయ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం.
మరోవైపు, టారిఫ్‌ల పెంపునకు ఇక్కడితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరో విడత పెంపు అవసరం ఉంటుందని ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. రేట్లను పెంచుతున్నా త్రైమాసికాల వారీగా టెల్కోల యూజర్ల స్థాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండటంతో.. టారిఫ్‌లను మరింతగా పెంచేందుకు టెలికం సంస్థలకు అవసరమైన ధీమా లభించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment