Telcos profits
-
Telcos Profits: సగటు యూజర్ నుంచి రూ.157.45
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్లో వైర్లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది. పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు. -
టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్
ముంబై: డేటా వినియోగం, 4జీ కనెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. వీటి దన్నుతో క్యూ3లో టెల్కోల ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 3-4 శాతం వృద్ధి నమోదు చేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒరిస్సా, హర్యానాలో ఆవిష్కరించిన రేట్ల పెంపును భారతి ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లలోనూ అమలు చేసి, పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పడితే నాలుగో త్రైమాసికంలో సీక్వెన్షియల్‌గా టెల్కోల ఆదాయం 5 శాతం పైగా వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) దిగువ స్థాయిలో రేట్ల పెంపును ఎయిర్టెల్ రెండు సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసిన పక్షంలో టెలికం రంగం ఆదాయ వృద్ధిపై పెద్దగా అర్థవంతమైన ప్రభావమేమీ ఉండకపోవచ్చని బీఎన్పీ పారిబా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని ఇతర సర్కిళ్లకూ విస్తరిస్తే, పోటీ కంపెనీలు కూడా అనుసరిస్తే మాత్రం 2022-23 నాలుగో త్రైమాసికంలో ఆదాయాలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనూ త్రైమాసికాల వారీగా (సీక్వెన్షియల్) టెలికం పరిశ్రమ ఆదాయాలు 3-4 శాతం స్థాయిలో వృద్ధి చెందాయి. నవంబర్ ఆఖర్లో అమలు చేసిన రేట్ల పెంపు ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ సానుకూలంగా కొనసాగింది. ఇక రెండో త్రైమాసికంలో కస్టమర్లు పెద్ద డేటా ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతుండటం ఆదాయాల వృద్ధికి కలిసి వచ్చింది. జియో, వొడా ఐడియా కీలకం.. పరిశ్రమలో పరిస్థితులను అంచనా వేసుకునేందుకు ఎయిర్టెల్ ఈ నెల తొలినాళ్లలో ఒరిస్సా, హర్యానాలో కనీస టారిఫ్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ. 155కి చేసిన సంగతి తెలిసిందే. పోటీ కంపెనీల ప్రతిస్పందనను కూడా చూసిన తర్వాత ఈ పెంపును కొనసాగించడం లేదా పూర్వ స్థాయికి తగ్గించడం గురించి తగు నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎయిర్టెల్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ మిగతా కంపెనీలు కూడా అదే బాట పడితే మాత్రం టారిఫ్‌ల పెంపును ఎయిర్టెల్ మిగతా సర్కిళ్లకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ చర్యలకు ప్రతిస్పందనగా జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) ఎంత మేర టారిఫ్‌లు పెంచుతాయనే దానిపై జనవరి–మార్చి త్రైమాసికంలో టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి ఆధారపడి ఉంటుందని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్ తన బేస్ ప్యాక్ టారిఫ్‌ల పెంపును ఎంత వేగంగా మిగతా సర్కిళ్లకు విస్తరిస్తుంది .. జియో, వీఐ తమ కనీస రీచార్జ్ ప్లాన్లను రూ. 99 నుండి రూ. 125 స్థాయికి పెంచుతాయా లేదా ఎయిర్‌టెల్‌కు సమానంగా నేరుగా రూ. 155కి పెంచేస్తాయా అనే అంశాలతో ఆదాయాలు ప్రభావితం కాగలవని వారు పేర్కొన్నారు. విక్రేతల మార్కెట్.. విశ్లేషకుల అంచనాలు ఒకవేళ పోటీ కంపెనీలు కూడా ఎయిర్‌టెల్‌ను అనుసరించిన పక్షంలో టెలికం పరిశ్రమ.. విక్రేతల మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సందర్భంలో రేట్లను వినియోగదారుల డిమాండ్ కాకుండా విక్రేతలే నిర్దేశించే అవకాశం ఉంటుంది. టెలికం రంగంలో ఇలాంటి పరిస్థితి కనిపించి దాదాపు దశాబ్ద కాలం పైగా గడిచిపోయింది. రేట్లను నిర్దేశించే శక్తి కంపెనీల దగ్గర ఉన్నప్పుడు ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు ఎంచుకునేందుకు ప్రత్యా మ్నాయ ఉత్పత్తులు, సర్వీసులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, టారిఫ్‌ల పెంపునకు ఇక్కడితో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడులపై వచ్చే రాబడి అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరో విడత పెంపు అవసరం ఉంటుందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. రేట్లను పెంచుతున్నా త్రైమాసికాల వారీగా టెల్కోల యూజర్ల స్థాయి దాదాపు అదే స్థాయిలో కొనసాగుతుండటంతో.. టారిఫ్‌లను మరింతగా పెంచేందుకు టెలికం సంస్థలకు అవసరమైన ధీమా లభించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్టెల్ శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఏజీఆర్ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్ ఐడియా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గత నెల 24వ తేదీన ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిప్రకారం రూ.92,642 కోట్లు టెల్కోలు లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వినియోగ చార్జీగా చెల్లించాలి. మారటోరియం, టారిఫ్ పెంపు సరిపోదు: ఫిచ్ రేటింగ్స్ స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం, టారిఫ్‌ల పెంపు వంటివి సానుకూలమే అయినప్పటికీ .. వీటి వల్ల టెలికం రంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రతికూల తీర్పుతో భారీగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న టెల్కోలకు ఊరట లభించకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం.. టెలికం రంగానికి ప్రతికూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. జియోకు సానుకూలం..: టారిఫ్ పెంపుతో అత్యంత వేగంగా మార్కెట్ వాటా పెంచుకుంటున్న జియోకు లాభపడగలదని ఫిచ్ అంచనా వేసింది. 2020 ద్వితీయార్ధానికి జియో 40 కోట్ల మంది యూజర్లు, పరిశ్రమ ఆదాయంలో 40 శాతం వాటాను దక్కించుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. -
టెల్కోల రాబడులు రెట్టింపు!
న్యూఢిల్లీ: టెలికం(టెల్కో) కంపెనీల నిర్వహణ లాభాల వృద్ధి రేటు రెండేళ్లలో రెట్టింపవుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కాల్ రేట్లు పెరగడం, టెలికాం విధానాల్లో స్పష్టత రావడం, తదితరాలు దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., పెద్ద టెలికం కంపెనీల నిర్వహణ లాభాలు రెండేళ్లలో 20 శాతం పెరుగుతాయి. గత ఐదేళ్లలో ఈ కంపెనీల నిర్వహణ లాభాలు 10 % చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. దీంతో పోల్చితే రెండేళ్లలో నిర్వహణ లాభాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవలే కొన్ని టెలికం కంపెనీలు కాల్ రేట్లను పెంచాయి. దీనికితోడు టెలికం విధానాల్లో స్పష్టత రావడం వృద్ధికి తోడ్పడనున్నది. టెలికం కంపెనీలకు నిమిషానికి సగటున వచ్చే ఆదాయానికి (ఏఆర్‌పీఎం), ప్రధాన టారిఫ్‌ల మధ్య తేడా 50 శాతంగా ఉంది. టెల్కోలు వినియోగదారులకు భారీస్థాయిలో డిస్కౌంట్ కాల్ రేట్లను ఆఫర్ చేస్తుండడమే దీనికి కారణం. పోటీ తీవ్రత తగ్గుతుండడంతో కంపెనీలు డిస్కౌంట్ కాల్ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. టారిఫ్‌లు నిర్ణయించే అధికారం మరో 2-3 ఏళ్లు టెలికం కంపెనీల చేతుల్లోనే ఉండబోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల ఆదాయాల్లో 16 శాతంగా ఉన్న డేటా, వాల్యూ యాడెడ్ సర్వీసుల ఆదాయం మధ్య కాలానికి 20 శాతానికి చేరనున్నది. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండడం, ధరలు తగ్గుతుండటంతో 3జీ సేవల విస్తరణ, డిమాండ్ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల కూడా ఆదాయం మరింత పెరగనుంది. స్పెక్ట్రమ్ లభ్యత, స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన రిజర్వ్ ధర నిర్ణయం తదితర అంశాలు సానుకూలంగా పరిష్కారమవుతున్నాయి.