టెలికం
న్యూఢిల్లీ: టెలికం(టెల్కో) కంపెనీల నిర్వహణ లాభాల వృద్ధి రేటు రెండేళ్లలో రెట్టింపవుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కాల్ రేట్లు పెరగడం, టెలికాం విధానాల్లో స్పష్టత రావడం, తదితరాలు దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..,
పెద్ద టెలికం కంపెనీల నిర్వహణ లాభాలు రెండేళ్లలో 20 శాతం పెరుగుతాయి. గత ఐదేళ్లలో ఈ కంపెనీల నిర్వహణ లాభాలు 10 % చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. దీంతో పోల్చితే రెండేళ్లలో నిర్వహణ లాభాలు రెట్టింపు కానున్నాయి.
ఇటీవలే కొన్ని టెలికం కంపెనీలు కాల్ రేట్లను పెంచాయి. దీనికితోడు టెలికం విధానాల్లో స్పష్టత రావడం వృద్ధికి తోడ్పడనున్నది.
టెలికం కంపెనీలకు నిమిషానికి సగటున వచ్చే ఆదాయానికి (ఏఆర్‌పీఎం), ప్రధాన టారిఫ్‌ల మధ్య తేడా 50 శాతంగా ఉంది. టెల్కోలు వినియోగదారులకు భారీస్థాయిలో డిస్కౌంట్ కాల్ రేట్లను ఆఫర్ చేస్తుండడమే దీనికి కారణం. పోటీ తీవ్రత తగ్గుతుండడంతో కంపెనీలు డిస్కౌంట్ కాల్ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి.
టారిఫ్‌లు నిర్ణయించే అధికారం మరో 2-3 ఏళ్లు టెలికం కంపెనీల చేతుల్లోనే ఉండబోతోంది.
గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం కంపెనీల ఆదాయాల్లో 16 శాతంగా ఉన్న డేటా, వాల్యూ యాడెడ్ సర్వీసుల ఆదాయం మధ్య కాలానికి 20 శాతానికి చేరనున్నది. స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు పెరుగుతుండడం, ధరలు తగ్గుతుండటంతో 3జీ సేవల విస్తరణ, డిమాండ్ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల కూడా ఆదాయం మరింత పెరగనుంది.
స్పెక్ట్రమ్ లభ్యత, స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన రిజర్వ్ ధర నిర్ణయం తదితర అంశాలు సానుకూలంగా పరిష్కారమవుతున్నాయి.