టెలికం కంపెనీలకు 8 శాతం పెరిగిన ఆదాయం
1,205.64 మిలియన్లకు టెలిఫోన్ చందాదారులు
ట్రాయ్ త్రైమాసిక నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్‌లో వైర్‌లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్‌లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్‌లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది.
పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం
గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment