Trai report
-
Telcos Profits: సగటు యూజర్ నుంచి రూ.157.45
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల బ్యాలన్స్ షీట్లు ఆర్థికంగా బలపడుతున్నాయి. ఒక్కో మొబైల్ యూజర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 8 శాతం పెరిగి జూన్‌తో ముగిసిన త్రైమాసికం చివరికి రూ.157.45కు చేరినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరికి ఇది రూ.153.54గా ఉంది. త్రైమాసికం వారీ పనితీరు సూచిక నివేదికను ట్రాయ్ విడుదల చేసింది. టెలికం రంగం సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) 0.13 శాతం పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే ఏజీఆర్ 7.51 శాతం పెరగడం గమనార్హం. టెలిఫోన్ చందాదారులు మార్చి చివరికి 1,199.28 మిలియన్లుగా ఉంటే, జూన్ చివరికి 1,205.64 మిలియన్లకు చేరింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య 35.11 మిలియన్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ నాటి గణాంకాలతో పోల్చి చూస్తే 16% పెరిగింది. నికరంగా జూన్ క్వార్టర్లో వైర్లెస్ చందాదారులు 54 లక్షల మేర పెరిగారు. దీంతో మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,170.53 మిలియన్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి వైర్లెస్ చందాదారులు 1,165.49 మిలియన్లుగా ఉన్నారు. వైర్‌లైన్ టెలీ సాంద్రత 2.50 శాతంగా ఉంటే, వైర్లెస్ టెలీ సాంద్రత 85.95 శాతానికి చేరింది. పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో టెలీ సాంద్రత మార్చి చివరికి ఉన్న 59.19 శాతం నుంచి జూన్ చివరికి 59.65 శాతానికి పెరిగింది. కానీ, ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ (టెలికం సదుపాయం ఉన్నవారు) 133.72 శాతం నుంచి 133.46 శాతానికి తగ్గింది. ఇంటర్నెట్ చందాదారులు 1.59 శాతం పెరిగి 969.60మిలియన్లకు చేరారు. -
మళ్లీ జియోనే టాప్!!
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ ఛార్ట్‌లో మళ్లీ రిలయన్స్ జియోనే ముందంజలో నిలిచింది. ఆగస్టు నెలలో 22.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడుతో, అత్యంత వేగవంతమైన 4జీ ఆపరేటర్‌గా జియో నిలిచినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో డౌన్లోడ్ పరంగా దూసుకెళ్లగా.. ఐడియా సెల్యులార్ కంపెనీ హయ్యస్ట్ అప్లోడ్ స్పీడు నెట్‌వర్క్‌గా నిలిచినట్టు ట్రాయ్ రిపోర్టు తెలిపింది. జియో సగటు 4జీ డౌన్లోడ్ స్పీడులో, తన ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ముందంజలో ఉంది. సెకనుకు 10 మెగాబిట్స్ డౌన్లోడ్ స్పీడ్‌ను జియో నమోదు చేసినట్టు ట్రాయ్ తన మైస్పీడ్ పోర్టల్‌లో ప్రచురించింది. అదేవిధంగా ఐడియా 4జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ ఫ్లాట్‌గా 6.2 ఎంబీపీఎస్‌గానే ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ జూలై నెలలో 6.4 ఎంబీపీఎస్‌గా ఉండగా.. ఆగస్టు నెలలో 6.7 ఎంబీపీఎస్‌కు పెరిగింది. ఐడియా 4జీ అప్లోడ్ స్పీడ్‌లో 5.9 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో ఉంది. వీడియోలను చూడటానికి, నెట్ బ్రౌజ్ చేయడానికి, ఈమెయిల్స్‌ను యాక్సస్ చేసుకోవడంలో డౌన్లోడ్ స్పీడ్ కీలక పాత్ర పోషిస్తోంది. -
డబుల్ స్పీడులో జియో
సంచలనమైన ఆఫర్లతోనే కాకుండా.. ప్రత్యర్థుల కంటే డబుల్ స్పీడులో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. మరోసారి డౌన్ లోడ్ స్పీడులో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. జియో సగటు డౌన్లోడ్ స్పీడు 16.48ఎంబీపీఎస్‌గా నమోదైంది. ఈ స్పీడు ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువని టెలికాం రెగ్యులేటరి ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. మే నెలలో జియో సెకనుకు 16.48 మెగాబిట్ సగటు డౌన్లోడ్ స్పీడును అందించినట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. దీని తర్వాత ఐడియా 8.33ఎంబీపీఎస్ ఇచ్చిందట. టెలికాం దిగ్గజంగా పేరున్న భారతీ ఎయిర్ టెల్ స్పీడడ్ 7.66 ఎంబీపీఎస్ అని వెల్లడైంది. జియో ప్రస్తుతమందిస్తున్న ఈ 16ఎంబీపీఎస్ స్పీడులో యూజర్లు ఒక బాలీవుడ్ సినిమాను 5 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశముంటుందని తెలిసింది. అదేవిధంగా టెలికాం మార్కెట్లో ఉన్న మిగతా కంపెనీలు వొడాఫోన్ 5.66 ఎంబీపీఎస్, రిలయన్స్ కమ్యూనికేషన్ 2.64ఎంబీపీఎస్, టాటా డొకొమో 2.52ఎంబీపీఎస్,ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 2.26ఎంబీపీఎస్, ఎయిర్ సెల్ 2.01 డౌన్ లోడ్ స్పీడును అందిస్తున్నట్టు ట్రాయ్ రిపోర్టు పేర్కొంది. 'మై స్పీడ్ యాప్' ద్వారా సేకరించిన డేటా ప్రకారం 4జీ డౌన్ లోడ్ స్పీడును ట్రాయ్ గణిస్తుంది.