మొహమాటానికి పోయి...!
రాజకీయ చైతన్యానికి పేరైన కృష్ణా జిల్లాలోని నందిగామ ప్రాంత నాయకులు మొహమాటానికి పోయి భలేగా బుక్కవుతున్నారట! అదీ తమ అధినాయకుల వద్ద బీరాలకు పోయి ‘బేరాలను’ వదులుకుంటున్నారని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవలే ఓ ఇరిగేషన్ ప్రాజెక్టులో దండిగా దక్కిన పర్సంటేజీలలో కొంత మొత్తాన్ని తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వంలో ఉన్న జిల్లాకు చెందిన నేతకు ‘బాస్’ చెప్పారట. మొహమాటానికి పోయిన సదరు నేత ఫర్వాలేదులే...! అన్న రీతిలో కొద్ది రోజులు గడిపారట. ఎలాగైనా చివరకు బాస్ చెప్పిన మొత్తం దక్కకపోతుందా? అన్న ఆశల పల్లకిలో ఉన్న ఆ నేతకు ‘బాస్’ షాకిచ్చారట.
ఓ ఫైన్ మార్నింగ్ తన కారులోకి చేర్చిన సూట్‌కేసును ఎంతో ఆశగా తెరవగా అందులో బాస్ చెప్పిందాట్లో సగమే ఉందట. 40 ‘సీ’లు చెప్పిన మొత్తంలో సగమే దక్కడంతో సదరు నేత బాధ వర్ణనాతీతంగా ఉందట. ఆ ప్రాంత నేతలు ఇలా తమ అధినేతల వద్ద బుక్ అవుతున్న సందర్భాల్ని సీనియర్ రాజకీయ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ ఈ ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత 1983వ సంవత్సరంలో ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పట్లో ఆ ప్రాంత నేత హైదరాబాద్‌లో భారీ ఇల్లు నిర్మాణం చేపట్టారు. గృహ ప్రవేశానికి తన అధినేతను ఆహ్వానించారు. అధినేతకు కుదరకపోవడంతో తన కుమార్తెను గృహ ప్రవేశానికి పంపించారు. నందిగామ నేత కట్టిన ఇల్లును చూసి ముచ్చట పడిన అధినేత కుమార్తె తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పారట. ఆ తర్వాత నందిగామ ప్రాంత ముఖ్య నేత తన అధినేతను కలిసిన సందర్భంలో ఇంటి నిర్మాణం చర్చకు వచ్చిందట. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చయిందని అధినేత ఆరా తీయగా, మొహమాటానికి పోయిన నందిగామ నేత ఖర్చును సగానికి సగం తగ్గించి చెప్పారట.
ఇంకేముంది... అధినేత తన కుమార్తె కోర్కె తీర్చేందుకు ఆ ఇంటిని అంతే ఖర్చుకు తనకివ్వమని చెప్పారట. దీంతో ఖంగుతిన్న నందిగామ నేత చేసేదేమీ లేక మొహమాటానికి పోతే ఏదో అయిందన్నట్లు తన పరిస్థితి ఉందనుకున్నారట. ఇప్పుడు సరిగ్గా మళ్లీ నందిగామ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడికి అలాంటి తరహా అనుభవమే ఎదురుకావడంతో రాజకీయ వర్గాల్లో సెటైర్లు జోరుగా వినిపిస్తున్నాయి.