మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం.
మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు.
మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము.
మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి.
ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది.
ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో?
మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు.
మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి.
‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది;
నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది.
మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం.
ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment