మనుగడ అనేది ప్రతి మనిషికీ ఉంటుంది. మనిషికి మాత్రమే మనుగడ ఉంటుందా? ప్రతి జీవికీ మనుగడ ఉంటుంది. ఏ జీవి మనుగడ దానిదే. కొన్ని జంతువుల మనుగడ మనిషికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి మనిషి మనుగడా తనకు, సమాజానికి ప్రయోజనకరంగానే ఉండాలి; ప్రయోజనకరంగా ఉండేందుకు మనిషి తన మనుగడను ఒక అవకాశంగా తీసుకుని, చేసుకుని ప్రయత్నించాలి.
మనుగడ ప్రయోజనకరంగా పరిణమించడానికి ఏ మనిషికి ఐనా మెదడు, మనసు ఈ రెండూ కీలకం ఐనవి. మనసు తిన్ననైంది కాకపోవడం మాత్రమే మనిషికి లోటు కాదు; మెదడు సరిగ్గా పనిచెయ్యక పోవడం మాత్రమే మనిషికి లోటు కాదు. మెదడుకు మనసు లేకపోవడమే, మనసుకు మెదడు లేకపోవడమే మనిషికి లోతైన లోటు! మెదడుకు మనసు ఉండాలి; మనసుకు మెదడు ఉండాలి. మెదడు, మనసు కలిసి ఉద్యుక్తం ఐతే, ఉన్ముఖం ఐతే, ఉద్యమిస్తే ఉన్నతం ఐన ఫలితం వస్తుంది. మనుగడ ఉచ్చస్థితికి చేరుతుంది.
సగటు మనిషి తన చేతిలోనే తాను ఓడిపోతూ ఉంటాడు; తన ప్రవర్తనవల్ల తాను సరిగ్గా ఉండడం జరగదు సగటు మనిషికి; చేసిన లేదా జరిగిన తప్పులు దిద్దుకోబడడం ఉండదు చాలమంది విషయంలో; చెడిపోవడం అన్నది చెరిగిపోవడం జరగడం లేదు పలువురిలో. వీటికి కారణం మెదడుకు మనసు లేకపోవడమే; మనసుకు మెదడు లేకపోవడమే.
మనిషి మెదడు, మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏవేవో, ఎన్నెన్నో వాటిలో ఉంటూ ఉంటాయి. అవసరం ఐనవి తక్కువగా, ఎక్కువగా అనవసరం ఐనవి మెదడు, మనసుల్లో ఉండి మనిషి మనుగడ మందమైపోవడానికి, మొద్దుబారిపోవడానికి కారణాలు ఔతూ ఉంటాయి. మెదడు, మనసుల పనితీరువల్లే మనిషికి మేలు, కీడులు కలుగుతూ ఉంటాయి; మనిషిని పనికి వచ్చేట్టుగానూ, పనికిరానట్టుగానూ చేసేవి మెదడు, మనసులే.
మెదడుకు మనసును, మనసుకు మెదడును నేర్పుతో అనుసంధానం చేసుకోవడమూ, ఆ అనుసంధానంతో దైనందిన జీవనాన్ని ఎదుర్కోవడమూ తెలిసిన మనిషికి అభివృద్ధి అలవడుతుంది. మనిషి అభివృద్ధిని అలవాటు చేసుకోవాలి; మనిషికి అభివృద్ధిలో అభినివేశం ఉండి తీరాలి. అభివృద్ధిలేని మనిషి అక్కరకురాని మనిషి ఔతాడు ఆపై అక్కర్లేని మనిషి ఔతాడు. మనిషి మనుగడ అనవసరం ఐంది, పనికిరాంది కాకూడదు; మనిషి మనుగడ వెలవెలపోకూడదు. మనిషి మనుగడ విలువైంది కావాలి. మనిషి తన మనుగడకు తానే విలువను, వన్నెను సమకూర్చుకోవాలి. మెదడు, మనసుల్ని సంయుక్తంగా సంప్రయోగించి మనిషి తన మనుగడను విజయవంతంగా నడుపుకోవాలి.
‘తిండిని వెతుక్కుంటూ రోజూ తిని/ ఏవేవో అల్పమైన కథలు చెప్పుకుని/ మనసు ఒడిలి
బాధల్ని అనుభవించి/ ఇతరుల్ని బాధించేవెన్నో చేసి/ తల నెఱుపు వచ్చి ముసలితనాన్ని పొంది/
ఘోరమైన మరణానికి బలై / మాసిపోయే పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?’ అని, అని తమిళ్ కవి సుబ్రమణియ బారతి పేలవంగా ఉండడాన్ని తిరస్కరించారు.
కూలిపోయేందుకు కాకుండా, విదూషకత్వంతో కాకుండా, మాసిపోయేందుకు కాకుండా, ఇతరుల్ని బాధించేందుకు కాకుండా, బాధల్ని అనుభవిస్తూ ఉండేందుకు కాకుండా, అల్పుడుగా కాకుండా, ఏదో తింటూ కాలం గడిపేందుకు కాకుండా మిన్నగా మసలేందుకు, మిన్నులా ఎత్తుల్లో నిలిచేందుకు మెదడుతో మనసును, మనసుతో మెదడును సంయుక్తం చేసుకుని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి.
మనిషి మనుగడ ప్రయోజనకరంగా ఎందుకు ఫలించకూడదు? మనిషి తన మనుగడను పట్టుదలతో ప్రయోజనకరం చేసుకోవాలి. మెదడు, మనసుల సమన్వయంతో, సంయోగంతో మనిషి సంపూర్ణంగా సఫలం అవాలి. మనిషి తన మనుగడకు సత్ప్రయోజనాన్ని సాధించుకోవాలి; సమాజానికీ సాధ్యం ఐనంత ప్రయోజనకరంగా మనిషి మెదులుతూ ఉండాలి.
మనిషికి మెదడు, మనసు ఉంటాయి. అవి సరిగ్గా, మెరుగ్గా ఉంటే మనిషి సరిగ్గా, మెరుగ్గా ఉంటాడు; అవి మేలుగా ఉంటే మనిషి మేలుగా ఉంటాడు. మెదడు, మనసు రెండూ కలిసి జతగా పనిచేస్తూ ఉంటేనే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, గతిని ఆపై ప్రగతిని పొందుతూ ఉంటాడు.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment