మార్పును పొందడం, మారడం బతుకుతున్న మనిషికి ఎంతో అవసరం. మనిషి రాయి కాదు మార్పును పొందకుండా మారకుండా పడి ఉండడానికి. బతుకుతున్న మనిషి మార్పును పొందుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. బతకడానికి సిద్ధంగా ఉన్న మనిషి మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక మనిషి మారకపోవడం అతడు సరిగ్గా బతకలేక పోవడమూ, బతకకపోవడమూ అవుతుంది.
‘నువ్వు ఇక్కడ ఉంది బతకడానికి; నువ్వు ఇక్కడ ఉంది ఆడడానికి; నువ్వు ఇక్కడ ఉంది బతుకును అనుభవించడానికి‘ అని ఓషో చెప్పా రు. మార్పు లేకుండా, మారకుండా రాయిలా బతికితే ఎలా? బతుకుతూ ఉండడానికి, బతుకును అనుభవిస్తూ ఉండడానికి మనిషిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉండాలి; మనిషి తనను తాను మార్చుకుంటూ, తనకు తాను మార్పులు చేసుకుంటూ బతుకును ఆస్వాదిస్తూ ఉండాలి.
ర్పుల్ని స్వీకరించని మనిషికి, మారని మనిషికి, ఊరట ఉండదు, సాంత్వన ఉండదు. ‘ఎవరికి ఏది తెలియదో అది వాళ్లకు ఉండదు’ అని తాత్త్వికకృతి త్రిపురారహస్యం మాట. మారడం తెలియనివాళ్లకు మార్పు అనేది ఉండదు. మార్పు లేనివాళ్లకు బతుకు సరిగ్గా ఉండదు. అంతేకాదు బతకడమే భారమైపోతుంది. మనిషిలో మార్పులు రాకపోడానికి ముఖ్యమైన కారణాలు అభిప్రాయాలు. అభిప్రాయాల వలలో చిక్కుకుపోయినవాళ్లు మారడం చాతకాకుండా మానసికంగా బాధపడుతూనే ఉంటారు; తమవాళ్లను అదేపనిగా బాధపెడుతూనే ఉంటారు. అభిప్రాయాలకు అతీతమైన అవగాహన మనిషికి అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది.
వయసువల్ల మనిషికి శారీరికమైన మార్పులు రావడం సహజం. ఆ విధంగానే ప్రతి మనిషికీ ఆలోచనపరంగా, దృక్పథంపరంగా, ప్రవర్తనపరంగా, మనస్తత్వంపరంగా మార్పులు రావాలి. మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిన కంప్యూటర్లను మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని కూడా మనం మాటిమాటికీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండడంవల్ల జడత్వం లేదా స్తబ్దత తొలగిపోతుంది. జడత్వం, స్తబ్దతలు తొలగిపోతున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది.
మన జీవితాన్ని మన మస్తిష్కం నిర్ణయిస్తుంది. మస్తిష్కంలో మార్పులు రాకపోతే జీవితంలో మార్పులు రావు. మారని మస్తిష్కం మొద్దులాంటిది. మస్తిష్కం మొద్దుగా ఉంటే జీవితం మొద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఇలా మొద్దుబారిన జీవితాలతో చాలమంది కనిపిస్తూ ఉంటారు. మార్పులకు మాలిమి అవని వాళ్లు మానసికరోగులుగా కూడా అయిపోతారు. కొంతమంది ఉన్మాదులుగా అయిపోవడానికి కారణం వాళ్లలో మార్పు అనేది రాకపోవడమే; వాళ్లకు మార్పు అవసరం అని వాళ్లు గ్రహించకపోవడమే. ప్రపంచానికి ఎంతో కీడు చేస్తున్న మతోన్మాదం,ప్రాం తీయవాదం, ముఠాతత్త్వం వంటివాటికి మూలం మారని, మారలేని మనుషుల మనస్తత్వమే.
మనుషులు పసితనం నుంచి మారుతూ వచ్చాక ఒక వయసు తరువాత మారడాన్ని ఆపేసుకుంటారు. తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, అభిరుచులు, ఉద్దేశాలు, ప్రవర్తన సరైనవే అని తీర్మానించుకుని తమలో తాము కూరుకుపోతూ ఉంటారు. మారకపోవడం తమ గొప్పతనం అని నిర్ణయించుకుంటారు. అటుపైన వాళ్లు మూర్ఖులుగానో, చాదస్తులుగానో, తిక్కవ్యక్తులుగానో, పనికిరానివాళ్లుగానో, అసూయాపరులుగానో, దొంగలుగానో, ఇంగితం లేనివాళ్లుగానో, వంచకులుగానో, చెడ్డవాళ్లుగానో, హంతకులుగానో రూపొందుతూ ఉంటారు.
సంఘానికి, ప్రపంచానికి మారని పలువురివల్ల ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. మారకపోవడంవల్ల మనుషులు మనుషులకు అపాయకరమైపోతూ ఉన్నారు. మార్పును పొందడం, మారడం మనుషులకు ఉండి తీరాల్సిన లక్షణం. ఊరట, సాంత్వన కావాలంటే, రావాలంటే, ఉండాలంటే మనుషులు మారడం నేర్చుకోవాలి. మారడం నేర్చుకుని మనుషులు శాంతంగా బతకాలి.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment