
ఇస్లాం వెలుగు
ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ (ర) వద్దకు వచ్చి: ‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం నా కాళ్ళూ చేతులూ కట్టి పడేసింది. ఎవరికీ ఏమీ చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?.’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరులపట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘అయ్యా.. అదేకదా నా సమస్య, నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేమున్న దని.?’ అన్నాడా వ్యక్తి నిర్లిప్తంగా..
‘అదేమిటీ అలా అంటావు? ఎంతో గొప్పసంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర. ’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడై, ‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి’ అన్నాడు.
‘అయ్యయ్యో..! ఆట పట్టించడంకాదు. ఇది నిజం. నేను చెబుతావిను.’ అంటూ.. ‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం కూడా సదఖాతో సమానం అన్నారు మన ప్రవక్త. (జామె తిర్మజీ 1956) దీనికోసం ధనం అవసరంలేదు. ఇది పూర్తిగా ఉతం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.
రెండవది కళ్ళు. ఇవి లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయి. ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మవైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. హజ్ అంటే ధనవంతులు చేయగలిగే ఆరాధనే గదా..!’
మూడవది నోరు. నోరు మందైతే ఊరు మందవుతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంని బోధించవచ్చు. మంని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి. ‘నీదగ్గరున్న మరోనిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీసొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మరోగొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచి పనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు.
మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై. ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మసంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపోయ్యాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్