ఏజెన్సీకి ఆరోగ్య రక్ష | Health protection agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీకి ఆరోగ్య రక్ష

Published Tue, Aug 2 2016 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

ఏజెన్సీకి ఆరోగ్య రక్ష - Sakshi

ఏజెన్సీకి ఆరోగ్య రక్ష

  • ఐటీడీఏ పరిధిలో కొత్త కార్యక్రమం
  • అందరికి కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులు
  • వ్యకుల వారీగా ఆరోగ్య వివరాల నమోదు
  • పీహెచ్‌సీలతో వివరాలు అనుసంధానం
  • ఇప్పటికి 68 వేల మంది వివరాల సేకరణ
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వైద్య సేవలకు దూరంగా ఉండే గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మంచిరోజులు వస్తున్నాయి. ఇంటి వద్దకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మొదలైంది. అందరికీ ఒకే రకమైన వైద్యం, మందులు అనే పాత విధానానికి స్వస్తి చెబుతున్నారు. ఎవరికి ఏ వైద్యం అవసరమో అదే అందించే కొత్త కార్యక్రమానికి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ స్వయంగా రూపొందించిన ఈ కార్యక్రమం త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని ప్రతి కుటుంబానికి అవసరమైన సందర్భాల్లో వైద్య సేవలు అందించే లక్ష్యంతో దీన్ని అమలు చేయనున్నారు.
     
    ఏజెన్సీ పరిధిలోని ప్రతి వ్యక్తికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ‘కుటుంబ సంరక్షణ కార్డు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డి.అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఐటీడీఏ పరిధిలోని ప్రతి కుటుంబానికి ఒక ‘కుటుంబ సంరక్షణ కార్డు’ను అందిస్తారు. కుటుంబంలోని వ్యక్తుల వారీగా వివరాలను నమోదు చేసేందుకు ఈ కార్డులో ప్రత్యేకంగా పేజీలు ఉంటాయి. వ్యక్తుల వారీగా... పేరు, చిరునామా, ఆర్థిక పరిస్థితులు, వృత్తి, రక్తం గ్రూపు, బీపీ, షుగర్‌ వంటి అంశాలతోపాటు ధీర్ఘకాలిక, స్వల్పకాలిక అనారోగ్య లక్షణాలను ఈ కార్డులో పేర్కొంటారు. ఇవే వివరాలను పొందుపరిచిన మరో కార్డును ఆయా గ్రామాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెడతారు. ఈ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
     
    ఇలా వివరాలు సేకరించిన అనంతరం వ్యక్తుల వారీగా అవసరమైన వైద్య సేవలను అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంటి వద్దకు వెళ్లడం లేదా పీహెచ్‌సీలకు రప్పించి వైద్య సేవలు చేస్తారు. ప్రతి పీహెచ్‌సీ సిబ్బంది విధిగా నెలలో రెండుసార్లు అన్ని గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరు పీహెచ్‌సీల సిబ్బంది గ్రామాలకు వెళ్లి ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికి ఏ వైద్యం, మందులు అవసరమో వాటినే అందిస్తారు. మొదటి దశలో వ్యక్తుల వివరాల సేకరణ జరుగుతోంది. 
     
     ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, భూపాలపల్లి, ములుగు, నల్లబెల్లి, నర్సంపేట, కొత్తగూడ, ఖానాపురం, గూడూరు,  మహబూబాబాద్‌ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి నిర్దేశిత జనాభా ఉంది. 14,267 కుటుంబాలకు చెందిన 68,222 మంది వివరాలను సేకరించారు. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఆధారంగా వ్యక్తిగతంగా వ్యాధుల వివరాలను పేర్కొంటున్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అందించాలో కార్డులో నమోదు చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాల్లోని వంద శాతం కుటుంబాల అన్ని గ్రామాల వివరాలను సేకరించనున్నారు. రెండో దశ వివరాల నమోదు ప్రక్రియ బుధవారం నుంచి మొదలవుతోంది.
     
    104 వాహనాలకు జీపీఆర్‌ఎస్‌...
    కుటుంబ సంరక్షణ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగిస్తూనే వేగంగా వైద్య సేవలను అందించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐటీడీఏ పరిధిలో 104 వాహనాలు 20 ఉన్నాయి. ఈ ఇరవై వాహనాల్లోనూ పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని 104 వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ వ్యవస్థను అమర్చుతున్నారు. జీపీఆర్‌ఎస్‌తో... ఏ వాహనం ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. రోజువారీగా చేసిన సేవల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సంరక్షణ కార్డులు పొందిన వారికి అసరమైన సమయాల్లో వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని జీపీఆర్‌ఎస్‌తో పర్యవేక్షిస్తారు. 
     
    ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వైద్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు
    అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అతి కీలకమైనది. ఏజెన్సీలోని ప్రతి కుటుంబానికి మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో కుటుంబ ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేస్తున్నాం. వ్యక్తుల వారీగా ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నాం. దీని వల్ల ఎవరికి ఎప్పుడు ఎలాంటి వైద్యం, మందులు అవసరమో తెలుస్తాయి. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం సకాలంలో అందించే అవకాశం ఉంటుంది.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement