జోరుగా సీతాఫలాల వ్యాపారం
సీజన్‌లో రూ.ఏడున్నర కోట్ల లావాదేవీలు
రియల్‌ఎస్టేట్ దెబ్బకు చాగల్నాడులో అంతరిస్తున్న తోటలు
రాజానగరం: రుచిలో సిమ్లా యాపిల్‌ని మరపించే చాగల్నాడు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం)కి తూర్పు గోదావరి జిల్లాలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంచి పేరు ఉంది. అయితే చాగల్నాడు ప్రాంతంలో రియలెస్టేట్ విస్తరిస్తున్న నేపథ్యంలో సీతాఫలాల తోటలు అంతరించిపోతున్నాయి. ఫలితంగా చాగల్నాడు సీతాఫలాలకు డిమాండ్ పెరిగి ధర కూడా పెరిగిపోయింది. చాగల్నాడు ప్రాంతంలో తోటలు (మామిడి, జీడిమామిడితో కలసి ఉంటాయి) తరిగిపోవడంతో సీతాఫలాల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది.
సీతాఫలాలు పక్వానికి రావాలంటే శీతలంతో పాటు వర్షాలు కురుస్తూ ఉండాలి. ఈ కారణంగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో అక్కడక్కడా లభిస్తున్న సీతాఫలాలతో ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా దొరుకుతున్న సీతాఫలాలను జోడించి వ్యాపారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచే జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా రవాణా అవుతున్నాయి. ఈ విధంగా సీజన్‌లో సీతాఫలాలు క్రయవిక్రయాల ద్వారా సుమారు రూ.7.5 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా.
గుర్తించడం చాలా కష్టం
రెండు దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణకు ముందు ఈ ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా సీతాఫలాల తోటలు విస్తారంగా ఉండేవి. రాత్రి సమయాల్లో బస్సుల్లో ప్రయాణించే వారికి లైటింగ్‌లో సీతాఫలాలు నిగనిగలాడుతూ కనిపించేవి. అంతేకాదు సీజన్‌లో దివాన్‌చెరువు కూడలి క్రయ, విక్రయదారులతో కిక్కిరిసిపోయేది. ఒక్కో సమయంలో ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతూ ఉండేది.
అయితే నేడు ఆ పరిస్థితులు లేవు. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న సీతాఫలాలు చాగల్నాడు ఫలాలో, ఏజెన్సీవో కూడా తెలియని పరిస్థితి. వీటి మధ్య ఉన్న తేడా స్థానికులకే మాత్రమే కొంత అవగాహన ఉంటుంది. దీంతో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ప్రయాణికులు చాగల్నాడు ఫలాలుగానే భావించి కొనుగోలు చేసుకుని, తమ ప్రాంతాలకు తీసుకెళుతుంటారు.
ఎందరికో ఉపాధి
సీతాఫలాల ద్వారా సీజన్‌లో ఎందరికో జీవనోపాధి లభిస్తుంటుంది. రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారి వెంబడి విరివిగా వెలసిన దుకాణాలతో పాటు సైకిళ్ల పైన, తోపుడు బళ్లపైన జిల్లా అంతటా వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు.
చాగల్నాడు సీతాఫలాలు నిల్వకు ఆగవు. పక్వానికి వచ్చిన వెంటనే కళ్లు విచ్చుకున్నట్టుగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అయితే ఏజెన్సీ సీతాఫలాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ సీజన్‌లో సీతాఫలాల వ్యాపారం రూ.ఏడున్నర కోట్లు దాటుతుందని ఒక అంచనా.
జాలై నుంచి అక్టోబరు వరకు ఏజెన్సీ సీతాఫలాలను దిగుమతి చేసుకుని, రూ.4.50 కోట్లకు పైబడి వ్యాపారం చేస్తుంటారు. ఇక తోటలు తగ్గినాగాని చాగల్నాడు సీతాఫలాల ద్వారా ఈ సీజన్‌లో (అక్టోబరు) రూ.రెండు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ఏ విధంగా చూసిన ఈ సీజన్‌లో సీతాఫలాల ద్వారా జిల్లాలో రూ.ఏడున్నర కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.
వంద ఫలాలు రూ.2,500 పైమాటే..
తోటలు విస్తారంగా ఉన్న సమయంలో వంద సీతాఫలాలను రూ.50 నుంచి రూ.వందకు విక్రయించే వారు. కానీ నేడు ఆ ధరకు అడిగితే ఎగాదిగా చూస్తారు. ఎందుకంటే వందల లెక్కన కొనుగోలు చేసే రోజులు పోయాయి. మామిడి పండ్ల మాదిరిగా డజను, పాతిక, పరక చొప్పున కొనాల్సి వస్తుంది.
గతంలో మాదిరిగా వంద ఫలాలు కొనాలంటే రూ.2500 పైనే ధర పలుకుతుంది. అంత మొత్తం పెట్టలేక చాలామంది డజన్ల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. కాయల సైజులను బట్టి పరక, డజను లెక్కల్లో డజను రూ.300 నుండి రూ.500కు విక్రయిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వీటిని కొంతమంది స్థానిక వ్యాపారులు హోల్‌సేల్‌గా తీసుకువచ్చి, జాతీయ రహదారి వెంబడి ఉన్న స్టాల్స్‌కి సరఫరా చేస్తుంటారు.
అక్టోబర్ చివర్లో షోలాపూర్ ఫలాలు..
ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల సమయంలో చాగల్నాడు సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయి. అయితే తోటలు తక్కువగా ఉండటంతో అవి ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు అయిపోయాయనే విషయం కూడా తెలియకుండా జరిగి పోతుంటుంది. దీంతో ఈ సీజన్ ప్రారంభంతో ఏజెన్సీ సీతాఫలాలను చాగల్నాడు మార్కెట్‌కి వస్తే, ఆఖరులో (అక్టోబరు, నవంబరు) వ్యాపారులు షోలాపూర్ నుంచి కూడా సీతాఫలాలను దిగుమతి చేసుకుని తమ వ్యాపారాలు కొనసాగిస్తుంటారు.
ఇవి చూడటానికి చాగల్నాడు సీతాఫలాల మాదిరిగానే నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. దీంతో ఈ సీజన్‌లో షోలాపూర్ కాయల ద్వారా సుమారు రూ.కోటి వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ఒక అంచనా. దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌కి షోలాపూర్ నుంచి వచ్చే యాపిల్, దానిమ్మల లోడులో వీటిని తీసుకువస్తుంటారు.
సీజన్‌లో దొరికే ఫలాలను తినాలి
సీజన్‌లో దొరికే ఫలాలను తినడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రకృతి మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నివారణకు ఫలాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో సీతాఫలాలను తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందుకనే వీటికి మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. – అద్దంకి సీతారామమ్మ, అచ్యుతాపురం
సీజనల్ పండ్లని నిర్లక్ష్యం చేయవద్దు
నేటి ఆధునిక సమాజంలో అంతా రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడటం వలన జనం జబ్బుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరి, పండ్లు తిని నయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సీజనల్‌గా దొరికే పండ్లని ఒక్కసారైనా తింటే సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు.
– సత్తి త్రిమూర్తులు, ముక్కినాడపాకలు
Comments
Please login to add a commentAdd a comment