![Five Reasons for Lifestyle Policies - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/INSURANCE-POLICIES.jpg.webp?itok=43F3D8uB)
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి.
► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్‌లు, వెల్‌నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి.
► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు.
► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్‌డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు.
► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు.
► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment