health programme
-
న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించింది. న్యూజెర్సీ, ఎడిసన్‌లోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్‌కి విశేష స్పందన వచ్చింది. ఫ్లు ఇంజెక్షన్ తోపాటు Free Medication అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలందించారు.ఈ సందర్భంగా మాటా తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్‌లో అతి తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాటా అన్నారు. మూడు వేల మంది సభ్యులతో ప్రారంభించి.. అనేక రాష్ట్రాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాటా సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథిలుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
Telangana: ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: పోలీసుల ఆరోగ్యరికార్డులను రూపొందించాలని వైద్య, ఆరో గ్య శాఖ నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను ముందస్తుగానే తెలుసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లో వారికి మెరుగైన వైద్యం అందించడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ లో ప్రతీ ఉద్యోగి పేరు మీద ‘పోలీసులకు ఆరోగ్య రక్ష’ పేరిట ప్రత్యేక రికార్డు తయారు చేస్తారు. ఈ వివరాలను ఆన్లైన్లో పొందుపరచి, ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుకల్పిస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. హెల్త్ ప్రొఫైల్ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తారు. పోలీసుల బీపీ, షుగర్‌తోపాటు బ్లడ్ గ్రూప్, కిడ్నీ, కాలేయం పనితీరు, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియేటినైన్, ఆల్కలైన్ ఫాస్పటేజ్, కొలెస్ట్రాల్, ఈసీజీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటిని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఇలాంటి పరీక్ష లు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో, లేదా ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ వద్దకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏకీకృత నంబర్ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల మెరుగైన వైద్యం చేయడానికి అవకాశంఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా బయటపడే వీలుంటుందని చెపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల సీపీలు, ఎస్పీలు పర్యవేక్షిస్తారు. ఇటీవల హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రుల్లో చాలా మంది యువ పోలీస్అధికారులు, ఉద్యోగులు పలు రకాల రోగాలతో చికిత్స పొందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. చాలా మంది పని ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నట్లు గమనించారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో ఉద్యోగులకు ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం గురువారం సిద్దిపేటలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టు కింద పోలీసుల హెల్త్ ప్రొఫైల్ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్నప్పుడు సమస్యలు బయటకు తెలియవని, కానీ వయసు పైపడిన తర్వాత వ్యాధులకు సంబంధించిన బాధలు తెలుస్తాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు ఆరోగ్యరక్ష కార్యక్ర మం చేపట్టామని వెల్లడించారు. పొలిటికల్, పోలీసులు, ప్రెస్.. ఈ మూడు వర్గాలు కలసి నిత్యం సమాజం కోసం శ్రమిస్తుంటాయని, బయట చూసేందుకు బాగానే ఉన్నా.. లోపల వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని వివరించారు. బీపీ, షుగర్ లాంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని, అశ్రద్ధ చేస్తే మూత్రపిండాలు, కాలేయం, గుండె దెబ్బతిని జీవితం ప్రమాదంలో పడుతుందని మంత్రి పోలీసులకు హితవు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో సిద్దిపేట జిల్లా పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, సీపీ శ్వేత, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, రాష్ట్ర నర్సింగ్ కమిటీ సభ్యుడు పాల సాయిరాంలు పాల్గొన్నారు. సాధారణ ప్రజలకూ హెల్త్ ప్రొఫైల్ తయారు.. తెలంగాణలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ ప్రొఫైల్ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రజలకు ఆరోగ్య ప్రొఫెల్ చేపట్టారు. మిగిలిన జిల్లాల్లో తాత్కాలికంగా వాయిదా వేశారు. -
ప్రతీ కార్మికుడికి హెల్త్ ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది. దీంతో భవిష్యత్ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్‌పేషెంట్) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్ఐసీ చెబుతోంది. ఆరోగ్య పరీక్షలు కీలకం కార్మికుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్ఐసీ వెబ్సైట్లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్డేట్ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
చిన్నారి డాక్టర్లు.. గురుకులాలకు వీళ్లే కేర్టేకర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకులంలో ప్రతి తరగతికి ఓ ‘డాక్టర్’! విద్యార్థి ఆరోగ్య స్థితిపై కన్నేసి ఉంచడం, జలుబు, జ్వరం, దగ్గులాంటి స్వల్ప అస్వస్థత అయినా సరే గుర్తించి వెంటనే క్లాస్ టీచర్, పాఠశాల హెల్త్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి కర్తవ్యం. డాక్టర్ అంటే నిజంగా ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న అనుభవజ్ఞుడైన డాక్టర్ కాదండోయ్.. గురుకులంలోని ఓ విద్యార్థే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) తన పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధగా పర్యవేక్షించే క్రమం లో ప్రయోగాత్మకంగా ‘చిన్నారి డాక్టర్’కార్యక్రమా న్ని చేపట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం గురుకుల పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయగా.. ప్రస్తుతం అది సత్ఫలితాలు ఇస్తున్నట్టు సొసైటీ అధికారులు చెబుతున్నారు. నిత్యం మరింత శ్రద్ధగా..: టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ పరిధిలో 269 గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలలో 5నుంచి 10 వరకు తరగతులు, ప్రతి క్లాసుకు రెండు సెక్షన్ల చొప్పున మొత్తం పన్నెండు సెక్షన్లుంటాయి. ఒక్కో గురుకులంలో గరిష్టంగా 480 మంది విద్యార్థులుంటారు. అయితే ఒక పాఠశాలకు ఒక హెల్త్ సూపర్వైజర్ పోస్టును మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కరిపైనే ఎక్కువ భారం పడొద్దని భావించిన అధికారులు సొసైటీకి అనుబంధంగా కొనసాగుతున్న పనేషియా ప్రాజెక్టు సహకారంతో చిన్నారి డాక్టర్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. చిన్నారి డాక్టర్ కార్యక్రమంతో విద్యార్థుల ఆరోగ్య స్థితిని నిత్యం మరింత శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనారోగ్యాన్ని ముం దుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకా శాలు తక్కువగా ఉంటున్నాయని, కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రయోగం మరింతగా సత్ఫలితాలనిస్తోందని వివరించారు. త్వరలో కోవిడ్ కట్టడికో బృందం కోవిడ్–19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ పాఠశాలల్లో అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి పాఠశాలకు ఒక కోవిడ్–19 వర్క్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సొసైటీ విద్యార్థుల ఆరోగ్య స్థితిపై నిఘా వేసి ఉంచే పనేషియా ప్రాజెక్ట్ హెడ్ సామర్ల కిరణ్‌కుమార్ తాజాగా కోవిడ్–19 వర్క్ టీమ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శి ఆమోదం పొందిన వెంటనే ప్రతి పాఠశాలలో నలుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పీఈటీతో పాటు ఇద్దరు టీచర్లు, హెల్త్ సూపర్వైజర్ సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు గమనించడం, కోవిడ్ ప్రొటోకాల్ అమలు చేయడం వీరి బాధ్యత అని అధికారులు చెబుతున్నారు. -
గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్
సాక్షి, ఝరాసంగం: గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా మారాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాపూర్‌లో గ్రామ ఆరోగ్య వేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని శిథిల పాఠశాలతో పాటు ప్రధాన రహదారిలోని మురికి కాల్వలు, ఇంటి ఆవరణలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కళాకారులచే కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామం ఒక అంశంలో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు తొలగించాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి నిల్వతో డెంగ్యూతో పాటు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో స్థలం లేనందున ఎవరైనా 10 గుంటల స్థలం ఇప్పించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాడి గ్రామాభివృద్దికి సహకరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్, తుప్రాన్లోని మల్కాపూర్ గ్రామాల మాదిరి ఆదర్శవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ శశిరేఖశ్రీనివాస్రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ జితిష్బీ.పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్, ఇమ్యూనైజేషన్ అధికారిణి గాయత్రీదేవి, ఎంపీడీఓ సుజాత, మండల వైద్యాధికారి మజీద్ తదిరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం కోసం దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జన చైతన్య అవగాహన, సర్వే కార్యక్రమాలు నిర్వహణ కోసం యువ ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రూరల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ రహమతుల్లా శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు కలిగి, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఎంపికైన వారికి జీతం 8వేల నుంచి రూ.10వేల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 95533221166, 9553259970, 83400886882 నంబర్లకు సంప్రదించాలని కోరారు.