చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్న కలెక్టర్
సాక్షి, ఝరాసంగం: గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా మారాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాపూర్‌లో గ్రామ ఆరోగ్య వేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని శిథిల పాఠశాలతో పాటు ప్రధాన రహదారిలోని మురికి కాల్వలు, ఇంటి ఆవరణలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కళాకారులచే కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామం ఒక అంశంలో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు తొలగించాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి నిల్వతో డెంగ్యూతో పాటు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు.
గ్రామంలో స్థలం లేనందున ఎవరైనా 10 గుంటల స్థలం ఇప్పించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాడి గ్రామాభివృద్దికి సహకరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్, తుప్రాన్‌లోని మల్కాపూర్ గ్రామాల మాదిరి ఆదర్శవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ శశిరేఖశ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ జితిష్‌బీ.పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్, ఇమ్యూనైజేషన్ అధికారిణి గాయత్రీదేవి, ఎంపీడీఓ సుజాత, మండల వైద్యాధికారి మజీద్ తదిరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment