సాక్షి, హైదరాబాద్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భార్యాభర్తలకు ప్రాధాన్యం ఉండబోదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి మెరిట్ ఆధారంగానే డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల తాత్కాలిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) పరిధిలో ఏడు పోస్టులకు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. వాస్తవానికి మొత్తం 969 పోస్టులకుగాను 950 మందితో తుది జాబితాను విడుదల చేశారు. దివ్యాంగ అభ్యర్థులు లేకపోవడంతో వారికి కేటాయించిన 39 పోస్టుల్లో 19 మంది అభ్యర్థులే వచ్చారు.
దీంతో మిగిలిన 20 పోస్టులను ఖాళీగా వదిలేశారు. వాటిని వచ్చే పోస్టుల భర్తీలో నింపుతారు. అప్పుడు కూడా రాకుంటే వాటిని సాధారణ పోస్టుల జాబితాలో చేరుస్తారు. మొత్తం జాబితాలో అత్యధికంగా మహిళా డాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయితే మెరిట్‌లో వారి రిజర్వేషన్‌కు మించి మహిళా డాక్టర్లు ఉన్నందున రిజర్వేషన్‌ను కాకుండా ప్రతిభ ఆధారంగానే జాబితా విడుదల చేసినట్లు బోర్డు వెల్లడించింది.
వారం రోజుల్లో కౌన్సెలింగ్...
మూడు విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మొత్తం 4,803 దరఖాస్తులు రాగా వాటిలో రెండో విడతలో 1,860 మంది అర్హులను ఎంపిక చేశారు. వారిలో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హులతో 950 మందిని గుర్తించారు. వారం రోజుల్లోగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదా అనారోగ్య సమస్యలు లేదా భార్యాభర్తలకు ఒకచోట లేదా సమీప ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యాలు ఉండవని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
నిబంధనల ప్రకారం మెరిట్ ప్రకారం వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. మొదట వచ్చినవారికి ఇష్టమైన చోటకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత వచ్చే వారికి వారి ప్రాధాన్యం ప్రకారం ఉంటే ఇస్తారు... లేకుంటే మరోచోటకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. బదిలీల సందర్భంగానే భార్యాభర్తలు, ఇతర ప్రాధాన్యాల ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారని, ఇప్పుడు మాత్రం కుదరదని చెబుతున్నారు.
నేటి నుంచి అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు..
సివిల్ అసిస్టెంట్ సర్జన్ల జాబితా విడుదలతో ఇక 1,147 అసిస్టెంట్ వైద్య ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని బోర్డు సభ్య కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఈ పోస్టులకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ భర్తీ ప్రక్రియ ఒక దశకు చేరుకున్నాక నర్సుల పోస్టుల భర్తీపై ప్రకటన విడుదల చేస్తారు.
ఇది సరికొత్త రికార్డు: మంత్రి హరీశ్‌రావు
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైందన్నారు. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం ఆరు నెలల్లో బోర్డ్ పూర్తి చేసిందన్నారు. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment