సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్టేతర వైద్య అభ్యర్థులను నిరాశపర్చింది. ఇందులో దాదాపు అన్ని పోస్టులు కాంట్రాక్ట్ వైద్యులకే దక్కనున్నాయని మెజారిటీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రాధాన్యత మార్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం(పీహెచ్–ఎఫ్‌డబ్ల్యూ), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జూలై 15న తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల మొదటివారంలో అభ్యర్థుల స్కోరింగ్ జాబితాను విడుదల చేసింది. ఇటీవల సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ శనివారం నాటితో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. అతి త్వరలో తుదిజాబితా విడుదల చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది.
వారికి రిక్తహస్తమే...
వాస్తవానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువులను పెద్దసంఖ్యలో భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. కానీ, ప్రాథమిక అర్హత జాబితాలో కాంట్రాక్టు డాక్టర్లకు మాత్రమే చోటు దక్కిందని కాంట్రాక్టేతర అభ్యర్థులు చెబుతున్నారు.
కొత్తగా ఉద్యోగాల భర్తీ కాకుండా కాంట్రాక్టు డాక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరించినట్లుగా నియామకాల ప్రక్రియ జరిగిందంటూ మెజార్టీ అభ్యర్థులు పెదవి విరిచారు. ముందుగా కాంట్రాక్టు వైద్యులతో పోస్టులు భర్తీ చేసి, ఆ తర్వాత ఇతర అభ్యర్థుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్సులో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు దక్కేవని అంటున్నారు. అలా కాకుండా పెద్ద సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చూపి చివరకు కాంట్రాక్టు వైద్యులతో సరిపెట్టడంతో ఇతర అభ్యర్థులను నిరుత్సాహపరిచినట్లు అయిందంటూ పలువురు వైద్యులు బోర్డు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment