Contract doctors
-
కాంట్రాక్టు డాక్టర్లకే కొలువులు!
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువుల భర్తీ ప్రక్రియ కాంట్రాక్టేతర వైద్య అభ్యర్థులను నిరాశపర్చింది. ఇందులో దాదాపు అన్ని పోస్టులు కాంట్రాక్ట్ వైద్యులకే దక్కనున్నాయని మెజారిటీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రాధాన్యత మార్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం(పీహెచ్–ఎఫ్డబ్ల్యూ), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) విభాగాల్లో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జూలై 15న తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల మొదటివారంలో అభ్యర్థుల స్కోరింగ్ జాబితాను విడుదల చేసింది. ఇటీవల సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా 1:2 నిష్పత్తిలో విడుదల చేసిన టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ శనివారం నాటితో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది. అతి త్వరలో తుదిజాబితా విడుదల చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుంది. వారికి రిక్తహస్తమే... వాస్తవానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ కొలువులను పెద్దసంఖ్యలో భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. కానీ, ప్రాథమిక అర్హత జాబితాలో కాంట్రాక్టు డాక్టర్లకు మాత్రమే చోటు దక్కిందని కాంట్రాక్టేతర అభ్యర్థులు చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగాల భర్తీ కాకుండా కాంట్రాక్టు డాక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరించినట్లుగా నియామకాల ప్రక్రియ జరిగిందంటూ మెజార్టీ అభ్యర్థులు పెదవి విరిచారు. ముందుగా కాంట్రాక్టు వైద్యులతో పోస్టులు భర్తీ చేసి, ఆ తర్వాత ఇతర అభ్యర్థుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్సులో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు దక్కేవని అంటున్నారు. అలా కాకుండా పెద్ద సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చూపి చివరకు కాంట్రాక్టు వైద్యులతో సరిపెట్టడంతో ఇతర అభ్యర్థులను నిరుత్సాహపరిచినట్లు అయిందంటూ పలువురు వైద్యులు బోర్డు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కాంట్రాక్ట్ వైద్యుల సమ్మె బాట
కడప రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 2015లో రెగ్యులర్ వైద్యుల నియామకాలను చేపట్టింది. తర్వాత చేపట్టలేదు. దీంతో కాంట్రాక్ట్ వైద్యులు ఆందోళనకు దిగారు. నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్‌తో సమ్మె బాట పట్టారు.ఫలితంగా గ్రామీణ వైద్యం పడకేసినట్లైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 75 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి పరిధిలో 435 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల్లో 75 మంది వైద్యులు పనిచేయాలి. అయితే కేవలం 26 మంది రెగ్యులర్ వైద్యులు, 42 మంది కాంట్రాక్ట్వైద్యులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం 68 మంది మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం కాంట్రాక్ట్ వైద్యులు సమ్మె బాట పట్టారు. భవిష్యత్‌పై వైద్యుల ఆందోళన... రాష్ట్ర ప్రభుత్వం 2013లో రెగ్యులర్ వైద్యుల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత జారీ చేయలేదు. దీంతో ఆ వైద్యుల్లో ఆందోళన నెలకొంది. ఉదాహరణకు జిల్లాలో ఒక కేంద్రంలో ఆరేళ్ల క్రితం ఒక వైద్యుడు కాంట్రాక్ట్ పద్ధతిన విధుల్లో చేరారు. తమ వైద్య జీవితాల్లో ‘రెగ్యులర్’వెలుగులు కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలను వైద్యుల కొరత వేధిస్తోంది. పెద్దముడియం, మైలవరం పీహెచ్‌సీలను ఒక వైద్యుడే చూస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ వైద్యులు 3 రోజల పాటు అక్కడ..ఇక్కడ విధులను చేపడుతున్నారు. మిగిలిన ఒక్క రోజు అవసరం ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి రోగులను పరీక్షిస్తున్నారు. ఒక పీహెచ్‌సీకి ఒక రోజుకు దాదాపు 70 నుంచి 100 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రస్తుత రోగాల సీజన్లో వారికి వైద్యం చేయడం వైద్యులకు భారంగా మారింది. నర్సులే వైద్యులుగా... సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ వైద్యులు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు జనరల్ ఓపీ, ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలను బహిష్కరించారు. కేవలం ఎమర్జెన్సీ సేవలను మాత్రమే చూడాలని నిర్ణయించారు. 14వ తేదీ నుంచి సామూహిక సెలవుల్లోకి వెళుతున్నారు. ఇదే గనుక జరిగితే ‘పల్లె వైద్యం’పూర్తిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ వైద్యుల సమ్మె కారణంగా హెడ్ నర్సులు వైద్యుల అవతారం ఎత్తారు. వారు సాధారణ జ్వరాలు..తదితర జబ్బులకు మందులు ఇస్తున్నారు. కలెక్టర్‌కు వినతి... ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోíసియేషన్ నాయకులు సోమవారం కలెక్టర్ హరికిరణ్‌ను కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ నాయకులు, కాంట్రాక్ట్ వైద్యులు అజరయ్య, పురుషోత్తం రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శైలజ, ఉషా, సమీరా పాల్గొన్నారు. -
నేటి నుంచి కాంట్రాక్ట్ వైద్యుల నిరసన
విజయనగరం, పార్వతీపురం: జిల్లా వ్యాప్తంగా పలు ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఒప్పంద వైద్యులు శుక్రవారం నుంచి ఈ నెల 10వరకు నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఐటీడీఏ పీఓ డాక్టర్ జి.లక్ష్మిషాను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం శాశ్వత పద్ధతిలో వైద్యులను నియమించడం లేదని తెలిపారు. 1850 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయని ఒక్క విజయనగరం జిల్లాలోనే 62 పీహెచ్‌సీలు, 14సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి ఉండగా అందులో దాదాపు 96 మంది కాంట్రాక్ట్ వైద్యులు పనిచేస్తున్నట్టు వారు పీఓకు తెలిపారు. వీరందరిని పర్మినెంట్ చేయాలని ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఓపీ చూడకుండా నిరసన తెలియజేయనున్నట్టు వారు తెలిపారు. -
మంత్రుల లేఖలు బుట్టదాఖలు
సాక్షి, అమరావతి: సాక్షాత్తూ మంత్రుల లేఖలనే సర్కారు పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంటే ఇక సామాన్యుల ఫిర్యాదులకు దిక్కెవరు? ముగ్గురు కేబినెట్ మంత్రులు ఓ సమస్య పరిష్కారం కోసం సిఫారసులతో ప్రభుత్వానికి లేఖ రాస్తే ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేఖను సైతం లక్ష్యపెట్టకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీని నిలబెట్టుకోవాలని మంత్రుల సూచన రాష్ట్రంలో కాంట్రాక్టు వైద్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ వీరు పలుమార్లు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. మూడేళ్లు పనిచేస్తే తమను క్రమబద్ధీకరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా పట్టించుకోకపోవడంతో మంత్రుల దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజన్సీ ప్రాంతాల్లో పలువురు కాంట్రాక్టు వైద్యులు ఇప్పటికే విధుల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు వైద్యులు దీర్ఘకాలంగా పని చేస్తున్నందున వారిని క్రమబద్ధీకరించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని సూచిస్తూ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. మూడేళ్ల సర్వీసు దాటిన వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని గతంలో ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రే ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తుండటంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిన పని లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రుల లేఖలను చిత్తు కాగితాలు కింద పరిగణించి బుట్ట దాఖలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాళీగానే చాలా పోస్టులు.. కొన్నేళ్లుగా పలువురు కాంట్రాక్టు వైద్యులు గ్రామీణ ప్రాం తాల్లో పని చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నందున రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. దీనిపై వైద్యులు పదేపదే కోరుతున్నారు. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీచేయాలి. – కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి) మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలి కాంట్రాక్టు వైద్యుల రెగ్యులైజేషన్ అంశాన్ని మీ (ముఖ్యమంత్రి) దృష్టికి తీసుకువస్తున్నా. ఇప్పటికే పలు వైద్య సంఘాలు ఈ విషయంపై నాకు విన్నవించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. – కిమిడి కళావెంకట్రావు (విద్యుత్ శాఖ మంత్రి) క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉండగా హామీ ఇచ్చారు. దీనిపై త్వరలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలి. – కాల్వ శ్రీనివాసులు (గృహ నిర్మాణ శాఖ మంత్రి) -
వైద్య శాఖకు ‘కాంట్రాక్ట్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ‘కాంట్రాక్టు’చిచ్చు రగిలింది. కొత్త వైద్యుల నియామక పద్ధతిపై ప్రస్తుత కాంట్రాక్టు వైద్యులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లో తాము చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పటికైనా నియామక ప్రక్రియలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలోని కాంట్రాక్టు వైద్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం(సీడబ్ల్యూఏటీఎస్) సోమవారం ప్రకటన జారీ చేసింది. అంతకుముందు సీడబ్ల్యూఏటీఎస్ అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధానకార్యదర్శి ఎల్.పూర్ణచందర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు వైద్యులు సోమవారం హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మూకుమ్మడిగా సర్వీసు నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రికి, అధికారికి లేఖలు రాశారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 700 మంది కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. గరిష్టంగా 10 ఏళ్లుగా మారుమూల, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు పద్థతిపై పనిచేసే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో వైద్య విభాగ నియామక కమిటీ ఆధ్వర్యంలో ప్రాధాన్యత కల్పించేది. శాశ్వత నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేది. ఈ నేపథ్యంలో వైద్య విద్య పూర్తి చేసినవారు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు ముందుకు వచ్చేవారు. ప్రభుత్వం శాశ్వత నియామకాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీతో కాకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో నియమించాలని నిర్ణయించారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్న మాకు కొత్త విధానంతో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్టు వైద్యులుగా పనిచేసేందుకు ఏ ఒక్క వైద్యుడూ ముందుకురారు. ప్రజారోగ్య సేవలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం మాపై అశ్రద్ధ వహిస్తూ మా నియామక ప్రక్రియకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కాంట్రాక్టు వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మా సేవలను గుర్తించి డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీతోనే నియామకాలు చేపట్టాలని కోరుతున్నాము. లేని పక్షంలో కాంట్రాక్టు వైద్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూఏటీఎస్) అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి ఎ.పూర్ణచందర్, నాయకులు ఎల్.రాంబాబు, బి.శ్రీనివాస్, టి.శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఐదు నెలలుగా జీతాల్లేవు
307 మంది కాంట్రాక్టు వైద్యుల అవస్థలు సాక్షి, హైదరాబాద్: పేదలకు సేవచేసే కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారి సేవలను రెగ్యులర్ చేయడం ఎలా ఉన్నా.. కనీసం చేస్తున్న పనికి జీతం కూడా ఇవ్వట్లేదు. సర్వీస్ రెగ్యులర్ కావడంపై ఆందోళనతో ఉన్న కాంట్రాక్టు వైద్యులకు 5 నెలలుగా వేతనాలు రాకపోవడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా 307 మంది వైద్యులు కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా పని చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం 2014 జూలై 1న జారీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల మార్గదర్శ కాల ప్రకారం వీరు పని చేస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టు వైద్యులుగా పని చేస్తున్న వీరు సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశంపై చర్చ జరుగుతున్నా ఆచరణలోకి రావట్లేదు. కాంట్రాక్టు అసిస్టెంట్ సర్జన్ల సర్వీసును ప్రతి ఏటా కొనసాగిస్తేనే వీరికి వేతనాలు అందు తాయి. వీరి కాంట్రాక్టు సర్వీసును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పొడిగించడంలో వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 307 మంది కాంట్రాక్టు వైద్యులకు 2017 మొదటి నుంచి వేతనాలు అందట్లేదు. 307 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ల కాంట్రాక్టు సర్వీసును పొడిగిస్తూ జూలై 25న ఉత్తర్వులు జారీ చేసింది. 2018 మార్చి 31 వరకు వీరి సర్వీసు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఉత్తర్వులు విడుదలై 2 వారాలైనా ఇప్పటికీ వేతనాలు రాలేదు. వీరికి వేతనాలు చెల్లించక పోవడంతో గ్రామీణ పేదలకు అందే వైద్య సహాయంపై ప్రభావం పడుతోంది.