సాక్షి, హైదరాబాద్: వైద్యశాఖలో ‘కాంట్రాక్టు’చిచ్చు రగిలింది. కొత్త వైద్యుల నియామక పద్ధతిపై ప్రస్తుత కాంట్రాక్టు వైద్యులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా మారుమూల ప్రాంతాల్లో తాము చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పటికైనా నియామక ప్రక్రియలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే రాష్ట్రంలోని కాంట్రాక్టు వైద్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం(సీడబ్ల్యూఏటీఎస్) సోమవారం ప్రకటన జారీ చేసింది. అంతకుముందు సీడబ్ల్యూఏటీఎస్ అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధానకార్యదర్శి ఎల్.పూర్ణచందర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు వైద్యులు సోమవారం హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే మూకుమ్మడిగా సర్వీసు నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రికి, అధికారికి లేఖలు రాశారు.
‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 700 మంది కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. గరిష్టంగా 10 ఏళ్లుగా మారుమూల, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు పద్థతిపై పనిచేసే వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో వైద్య విభాగ నియామక కమిటీ ఆధ్వర్యంలో ప్రాధాన్యత కల్పించేది. శాశ్వత నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేది. ఈ నేపథ్యంలో వైద్య విద్య పూర్తి చేసినవారు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు ముందుకు వచ్చేవారు. ప్రభుత్వం శాశ్వత నియామకాల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీతో కాకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో నియమించాలని నిర్ణయించారు. ఇన్నేళ్లుగా సేవలు అందిస్తున్న మాకు కొత్త విధానంతో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్టు వైద్యులుగా పనిచేసేందుకు ఏ ఒక్క వైద్యుడూ ముందుకురారు.
ప్రజారోగ్య సేవలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం మాపై అశ్రద్ధ వహిస్తూ మా నియామక ప్రక్రియకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కాంట్రాక్టు వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మా సేవలను గుర్తించి డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీతోనే నియామకాలు చేపట్టాలని కోరుతున్నాము. లేని పక్షంలో కాంట్రాక్టు వైద్యులందరూ మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఒప్పంద వైద్యుల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూఏటీఎస్) అధ్యక్షుడు కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి ఎ.పూర్ణచందర్, నాయకులు ఎల్.రాంబాబు, బి.శ్రీనివాస్, టి.శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Tue, Sep 26 2017 1:03 AM | Last Updated on Tue, Sep 26 2017 1:04 AM
Advertisement
Advertisement