కాంట్రాక్ట్‌ వైద్యుల సమ్మె బాట | Contract Doctors Strike YSR Kadapa | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ వైద్యుల సమ్మె బాట

Published Tue, Sep 11 2018 2:04 PM | Last Updated on Tue, Sep 11 2018 2:04 PM

Contract Doctors Strike YSR Kadapa - Sakshi

కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ వైద్యుల అసోసియేషన్‌ నాయకులు

కడప రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం 2015లో రెగ్యులర్‌ వైద్యుల నియామకాలను చేపట్టింది. తర్వాత చేపట్టలేదు. దీంతో కాంట్రాక్ట్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. నోటిఫికేషన్‌ జారీ చేయాలనే డిమాండ్‌తో సమ్మె బాట పట్టారు.ఫలితంగా గ్రామీణ వైద్యం పడకేసినట్లైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 75 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి పరిధిలో 435 సబ్‌ సెంటర్స్‌ ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల్లో 75 మంది వైద్యులు పనిచేయాలి. అయితే కేవలం 26 మంది రెగ్యులర్‌ వైద్యులు, 42 మంది కాంట్రాక్ట్‌వైద్యులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం 68 మంది మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం కాంట్రాక్ట్‌ వైద్యులు సమ్మె బాట పట్టారు.

భవిష్యత్‌పై వైద్యుల ఆందోళన...
రాష్ట్ర ప్రభుత్వం 2013లో రెగ్యులర్‌ వైద్యుల నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. తర్వాత జారీ చేయలేదు. దీంతో ఆ వైద్యుల్లో ఆందోళన నెలకొంది. ఉదాహరణకు జిల్లాలో ఒక కేంద్రంలో ఆరేళ్ల క్రితం ఒక వైద్యుడు కాంట్రాక్ట్‌ పద్ధతిన విధుల్లో చేరారు. తమ వైద్య జీవితాల్లో ‘రెగ్యులర్‌’వెలుగులు కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలను వైద్యుల కొరత వేధిస్తోంది.  పెద్దముడియం, మైలవరం పీహెచ్‌సీలను ఒక వైద్యుడే చూస్తున్నారు. ఆ కాంట్రాక్ట్‌ వైద్యులు 3 రోజల పాటు అక్కడ..ఇక్కడ విధులను చేపడుతున్నారు. మిగిలిన ఒక్క రోజు అవసరం ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి రోగులను పరీక్షిస్తున్నారు. ఒక పీహెచ్‌సీకి ఒక రోజుకు దాదాపు 70 నుంచి 100 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రస్తుత రోగాల సీజన్‌లో వారికి వైద్యం చేయడం వైద్యులకు  భారంగా మారింది.

నర్సులే వైద్యులుగా...
సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్‌ వైద్యులు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు జనరల్‌ ఓపీ, ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ సేవలను బహిష్కరించారు. కేవలం ఎమర్జెన్సీ సేవలను మాత్రమే చూడాలని నిర్ణయించారు. 14వ తేదీ నుంచి సామూహిక సెలవుల్లోకి వెళుతున్నారు. ఇదే గనుక జరిగితే ‘పల్లె వైద్యం’పూర్తిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ వైద్యుల సమ్మె కారణంగా హెడ్‌ నర్సులు వైద్యుల అవతారం ఎత్తారు. వారు సాధారణ జ్వరాలు..తదితర జబ్బులకు మందులు ఇస్తున్నారు.

కలెక్టర్‌కు వినతి...
ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ డాక్టర్స్‌ అసోíసియేషన్‌ నాయకులు సోమవారం కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్‌ నాయకులు, కాంట్రాక్ట్‌ వైద్యులు అజరయ్య, పురుషోత్తం రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శైలజ, ఉషా, సమీరా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement